అమ్మమ్మ చూపిన బంగారు బాట!

అనగనగా ఓ ఊరు. ఆ ఊరిలో అర్చిత అనే అమ్మాయి ఉంది...

Published : 21 Sep 2020 00:39 IST

నగనగా ఓ ఊరు. ఆ ఊరిలో అర్చిత అనే అమ్మాయి ఉంది. ఆమె తన అమ్మానాన్నలు, అమ్మమ్మతో కలిసి ఉంటోంది. అయిదో తరగతి చదువుతోంది. చదువుల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. కానీ కాస్త పెంకితనం. దీనికి తోడు అమ్మమ్మ గారాబంతో కొన్నిసార్లు మారాం చేస్తుండేది.

ఓ రోజు బడి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన అర్చిత ఎప్పుడూ ఉన్నట్లు కాకుండా కొంత విసుగ్గా కనిపించింది. అదే సమయంలో వాళ్ల అమ్మానాన్న బయటకు వెళ్తూ ‘అర్చిత చదువుకోమ్మా! మేం ఇంటికి వచ్చేసరికి నువ్వు నీ హోమ్‌వర్క్‌ పూర్తి చేయాలి. అమ్మమ్మతో కలిసి కాలక్షేపం చేయకు’ అని చెప్పి బయలు దేరారు.

అర్చిత ఎప్పటిలా హుషారుగా లేదు. ఎంతో దిగాలుగా కనిపించింది. ‘అర్చిత ఎందుకలా ఉన్నావు తల్లీ.. నిన్ను ఎవరు ఏం అన్నారు?’ అని అడిగింది అమ్మమ్మ. అప్పుడు తన స్నేహితులు తనను ఆటపట్టిస్తున్నారని తన ప్రవర్తన మార్చుకోవాలి అని అనుకుంటున్నట్లు చెప్పింది. వాళ్లు తనను కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక తనను తాను మార్చుకుందామని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

మళ్లీ దిగాలుగా కూర్చున్న అర్చితను చూస్తూ ఎవరో ఏదో అన్నారని మనల్ని మనం తక్కువ చేసుకుని ఆత్మస్థైర్యం కోల్పోవద్ధు నువ్వు.. నువ్వులా ఉండాలి. ఎప్పుడైనా సరే లోపం లేనంతవరకు నీ ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం లేదు. పొరుగువారికోసం ప్రతిసారి మారిపోతే.. నీకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపు ఉండదు. చివరికి నువ్వు.. నువ్వు కాకుండా పోతావ్‌.

అలా అని వాళ్ల మాట అసలు వినొద్దు అని కాదు. మనిషిని బట్టి వాళ్లు చెప్పే విషయాన్ని బట్టి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఉదాహరణకు బడిలో మాస్టారు నిన్ను కోప్పడినప్పుడు.. ఆయన ఎందుకు మందలించారు. నువ్వు చేసిన తప్పు ఏమిటి? అలానే నిన్ను నువ్వు మార్చుకోవడం ఎలా? ఎలా తప్పును దిద్దుకోవాలి? అనేవి తెలుసుకుని నువ్వు మారాలి. ఎందుకంటే గురువు ఎంతోమంది విద్యార్థులను చూస్తారు. చక్కదిద్దుతారు. అంతే కాదు.. గురువు దైవంతో సమానం.

అంతేకానీ ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. ఓసారి ఈ విషయం మీ ఉపాధ్యాయుడితో కూడా చర్చించు. ఆయన అభిప్రాయమూ తెలుసుకో..! మన చేతికున్న అయిదు వేళ్లే ఒకలా ఉండవు. అలాంటిది ప్రపంచంలో మనుషులు అందరూ ఒకలా ఎందుకు ఉంటారు? వాళ్లు పెరిగిన వాతావరణం, అమ్మానాన్నలు, స్నేహితుల ఆధారంగా వాళ్ల ప్రవర్తనలోనూ తేడాలుంటాయి. మంచివారితో స్నేహం చేస్తే ఇలాంటి చిక్కులే రావు. ఇకపై అలాంటి వారినే స్నేహితులను చేసుకో.. పద పద.. బాధపడుతూ కూర్చుంటే ఎలా? ముందు భోజనం చేసి.. హోంవర్క్‌ చేసేయ్‌.. మళ్లీ మీ అమ్మ వస్తే నిన్ను.. నన్ను ఇద్దరినీ అంటుంది అంది అమ్మమ్మ.

ఇంతలో అర్చిత వాళ్ల అమ్మానాన్న వచ్చారు. వస్తూ వస్తూ మిఠాయిలు తీసుకు వచ్చారు. ఇక వాటిని చూశాక అర్చిత అన్ని బాధలు మరిచిపోయి.. హాయిగా లేడిపిల్లలా ఇల్లంతా గెంతులు వేసింది. ఇదంతా చూసి అమ్మమ్మ ‘పిచ్చిపిల్ల’ అంటూ తనలో తాను నవ్వుకుంది.

- డి.కల్యాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని