Published : 20 Dec 2021 00:50 IST

జఫ్ఫా అను నగరంలో..

‘జఫ్ఫానా.. జఫ్ఫా అంటే తిట్టు కదా!’
అనుకుంటున్నారు కదూ..!
నిజానికి ఇది ఓ నగరం పేరు!
అంతేకాదు ఓ పండు పేరు కూడా...
ఆశ్చర్యంగా ఉంది కదా!
మరి కథనం మొత్తం చదివేయండి.. పూర్తి వివరాలు మీకే తెలుస్తాయి!!

ఫ్ఫా.. ఈ పదం వినగానే మనకు నవ్వు వస్తుంది. సినిమాల్లో ఈ పదాన్ని మనకు పరిచయం చేసింది ఓ రకంగా బ్రహ్మానందం అంకుల్‌! ఈ పేరుతోనే వచ్చిన సినిమాలో ఆయన నటించారు కూడా! జఫ్ఫా అంటే ఏదో తిట్టు అనేంతలా జనాల్లోకి చొచ్చుకుపోయింది. కానీ ఈ పేరుతో ఓ నగరం ఉందని మీకు తెలుసా! అదీ మామూలు నగరం కాదు..!

ఎంతో ప్రాముఖ్యం ఉంది

జఫ్ఫా అనేది.. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రాచీన ఓడరేవు. దీన్ని జొప్పా అని కూడా అంటారు. చరిత్ర పరంగా దీనికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నగరాన్ని సందర్శించడానికి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ఇప్పటికీ ప్రాచీన కట్టడాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఖరీదైన రెస్టారెంట్లు, కేఫ్‌లకు కూడా ఇది నిలయం. ఈ జఫ్ఫా తీరంలో సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటుంది. ఈ సుందర దృశ్యాలను చూడ్డానికి, తమ కెమెరాల్లో బంధించడానికి పర్యాటకులు వరుస కడుతుంటారు. జఫ్ఫాకు సమీపంలోనే ‘టెల్‌ అవీవా’ అనే ఆధునిక నగరమూ ఉంది. ఇక్కడకు వచ్చిన యాత్రికులు జఫ్ఫాలో కాలు మోపకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు.


పండు పేరు కూడా...

ఈ ప్రాచీన నగరంలో ఒట్టోమన్‌ కాలానికి చెందిన క్లాక్‌ టవర్‌ చాలా ప్రసిద్ధి. ఓ రకంగా ఇది జఫ్ఫాకు ల్యాండ్‌మార్క్‌. ఇంకా చిన్న చిన్న వీధులు, ప్రాచీన వస్తువులు అమ్మే దుకాణాలు. హస్తకళలకు సంబంధించిన వస్తువులు ఇవన్నీ చాలా ఫేమస్‌. జఫ్ఫా పేరుతో నగరం మాత్రమే కాదు.. ఓ పండు కూడా ప్రసిద్ధి. 19వ శతాబ్దం మధ్యలో స్థానిక రైతులు జఫ్ఫా నగరానికి సమీపంలో పండే బలాదీ రకపు ఆరెంజ్‌ను సంకరం చేసి కొత్త వంగడాన్ని సృష్టించారు. దానికి ‘జఫ్ఫా ఆరెంజ్‌’ అని పేరు పెట్టారు. ఇక్కడి నుంచే ఇవి ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. మిగతా ఆరెంజ్‌లతో పోల్చుకుంటే ఇవి తియ్యగా ఉంటాయి. వీటి తొక్క ఒలవడం కూడా చాలా తేలిక. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కూడా.. జఫ్ఫా పేరుతో ఐఫోన్‌ కేస్‌లూ ఉన్నాయి. చరిత్రను ప్రతిబింబించే, ప్రసిద్ధ కట్టడాల చిత్రాలతో ఉన్న వీటిని ఇష్టంగా కొనుక్కునే వాళ్లూ ఉన్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ జఫ్ఫా విశేషాలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని