ఐకమత్యమే మహా‘ఫలం’!

అడుగు అడుగు కదిలింది.. చేతులు కలిశాయి.. మొక్కలు పాతాయి.. పాదులు తీశాయి.. పర్యావరణ పరిరక్షణకు కంచెను కట్టాయి. చిట్టి చేతులు ఊరుకుంటాయా..?! అవీ బుడతాభక్తిగా ఉడతా సాయం చేశాయి. ఎందరికో ఆదర్శంగా నిలిచాయి.

Published : 03 Feb 2022 01:13 IST

అడుగు అడుగు కదిలింది.. చేతులు కలిశాయి.. మొక్కలు పాతాయి.. పాదులు తీశాయి.. పర్యావరణ పరిరక్షణకు కంచెను కట్టాయి. చిట్టి చేతులు ఊరుకుంటాయా..?! అవీ బుడతాభక్తిగా ఉడతా సాయం చేశాయి. ఎందరికో ఆదర్శంగా నిలిచాయి.

ఐకమత్యమే మహా‘ఫలం’. కేవలం బలానికే కాదు.. ఫలానికి కూడా ఐకమత్యమే ఆధారం. దీన్ని చాటి చెబుతోంది ‘గ్రీన్‌ వేళచ్చేరి ట్రస్టు.’ రోటరీ క్లబ్‌ సభ్యులు, ఎక్స్‌నోరా ఇంటర్నేషనల్‌, అపెక్స్‌ క్లబ్‌, స్థానికులంతా కలిసి చెన్నైలోని వేళచ్చేరిలో మహాక్రతువుకు చేతులు కలిపారు. అదే పచ్చదనం పెంపొందించడం. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించడమే వాళ్ల ధ్యేయం.

లక్ష.. లక్ష్యం!
అదీ ఏదో ఆషామాషీగా మొక్కలు నాటడం కాదు. ఏకంగా ‘లక్ష’ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్‌ 2021లో ప్రారంభించారు. ఈ మధ్యే తమ లక్ష్యాన్ని సాధించారు. రైల్వేస్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ వాళ్లు వీరికి తమ సహాయసహకారాలు అందించారు. 

చిట్టి చేతులు..
ఇదంతా ఒకెత్తైతే చిట్టిపొట్టి చిన్నారులు స్వచ్ఛందంగా వచ్చి ఈ హరితయజ్ఞంలో పాలుపంచుకొన్నారు. తమ చిన్ని చిన్ని చేతులతో కొన్ని వందల మొక్కలు తీసుకొచ్చి వాళ్లూ, నాటారు. కాకపోతే అవి కొన్ని వారాల్లోనే పెరిగిపెద్దైపోతాయా? అని అమాయకంగా అడిగారు!

చక్కని చేతలు!
వీళ్లను చూసి చాలా మంది పెద్దలూ ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. వీళ్ల ప్రయాసను అక్కడి ప్రభుత్వమూ గుర్తించింది. నిజంగా వీళ్ల ఆశయం ఎంతోమందికి ఆదర్శం కదూ! ఇంకా మీరు ఉత్తచేతులతో ఉన్నారేంటి. మీరూ కొన్ని మొక్కలు చకచకా నాటేయండి.. సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని