Published : 19 Nov 2022 00:27 IST

యజమానిని రక్షించిన టామీ!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పెంపుడు జీవులంటే ఎంతో ఇష్టం కదూ! అందులోనూ కుక్కపిల్లలంటే మరీనూ.. వాటిని విశ్వాసానికి ప్రతీకగానూ చెబుతుంటారు. అందుకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలూ వినే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా అలాంటిదే. మరి ఇంకెందుకాలస్యం.. గబగబా ఇది చదివేయండి మరి..

సాధారణంగా గాయపడిన మూగజీవాలు కనిపిస్తే.. మనం రక్షిస్తుంటాం. కానీ, కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ పరిధిలో జరిగిన సంఘటన మాత్రం అందుకు భిన్నం. జీవనోపాధి కోసం అడవికి వెళ్లి, కళ్లు తిరిగి పడిపోయిన యజమాని ఆచూకీని ఓ పెంపుడు కుక్క గుర్తించింది. అంతేకాదు.. అందరితోనూ శెభాష్‌ అనిపించుకుంటోంది.

చకచకా వెళ్లి..

సూడురు అనే గ్రామానికి చెందిన శేఖరప్పకు 55 సంవత్సరాలు. ఆయన రోజూ ఊరికి ఆనుకొని ఉన్న అడవికి వెళ్లి, కట్టెలు కొట్టుకొని తీసుకురావడం చేస్తుండేవాడు. ఎప్పటిలాగే ఇటీవల ఒకరోజు ఉదయం ఆరు గంటలకు అడవిలోకి వెళ్లాడాయన. పని ముగించుకొని పదింటికల్లా తిరిగొచ్చే శేఖరప్ప.. ఆరోజు మాత్రం మధ్యాహ్నం దాటినా రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే, వాళ్లంతా గ్రామస్థులను తీసుకొని శేఖరప్పను వెతికేందుకు అడవిలోకి వెళ్లారు. అన్ని దిక్కులూ జల్లెడ పట్టినా.. ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోయారు. ఇంతలో కొంతదూరం నుంచి కుక్క అరుపులు వినిపించాయి. దాంతో వారంతా గబగబా అక్కడకు వెళ్లి చూడగా.. శేఖరప్ప స్పృహ కోల్పోయి ఓ పెద్ద చెట్టు కింద పడి ఉన్నాడు.  

గ్రామస్థుల సన్మానం

శరీరంలో నీటి శాతం తగ్గి, కళ్లు తిరిగి పడిపోయిన శేఖరప్పను అందరూ కలిసి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండ్రోజుల్లో ఆయన కోలుకున్నాక.. ఇంటికి తీసుకొచ్చారు. రోజూ యజమానితోపాటు అడవికి వెళ్లే ఆ కుక్క.. ఆరోజు మాత్రం వెళ్లలేదు. కొన్నేళ్లక్రితం గాయాలతో రోడ్డు పక్కన అల్లాడుతున్న కుక్కపిల్లను శేఖరప్ప గుర్తించి ఇంటికి తీసుకొచ్చి పెంచుకోసాగాడు. దీనికి ‘టామీ’ అని పేరు కూడా పెట్టారు. ఆ విశ్వాసాన్ని మర్చిపోని టామీ.. ఇటీవల అడవిలో పడిపోయిన యజమాని ఆచూకీని తెలిపిందన్నమాట. దాంతో గ్రామస్థులంతా పప్పీని ప్రశంసించడంతోపాటు సత్కరించారు. ప్రాణం ఉన్నంత వరకూ.. తనను రక్షించిన టామీని కంటికి రెప్పలా చూసుకుంటానని శేఖరప్ప చెబుతున్నాడు. విశ్వాసంలో తమ జాతిని మించిన వారు లేరని మరోసారి నిరూపించిన టామీ.. నిజంగా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు