పిట్ట కొంచెం.. ప్రయాణం ఘనం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల ఆధారంగా పక్షులు ఏటా వేలాదిగా వలస వెళ్తుంటాయని పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు.

Published : 01 Dec 2022 00:14 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల ఆధారంగా పక్షులు ఏటా వేలాదిగా వలస వెళ్తుంటాయని పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. అలా మన దగ్గరకు వచ్చే కొన్ని విదేశీ పక్షులనూ పత్రికల్లోనో, టీవీల్లోనో చూసే ఉంటారు. అలా వలస వెళ్లిన ఓ బుజ్జి పక్షి.. ఏకంగా ప్రపంచ రికార్డే కొట్టేసింది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ఇటీవల ‘బార్‌-టెయిల్డ్‌ గాడ్‌విట్‌’ అనే ఓ విదేశీ జాతి పక్షి.. ఏకధాటిగా 13,560 కిలోమీటర్లు ప్రయాణించి ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కేసింది. ఇంతా చేస్తే.. ఆ పక్షి వయసు కేవలం అయిదు నెలలు మాత్రమే. అంటే.. అప్పుడప్పుడే గూటి నుంచి బయటకు వచ్చి సొంతంగా బతకడం నేర్చుకునే వయసన్నమాట.

దారి తప్పి.. ఎక్కువ దూరం..

అమెరికాలోని అలస్కా నుంచి పసిఫిక్‌ మహాసముద్రం మీదుగా న్యూజిలాండ్‌కు ఏటా వేల సంఖ్యలో గాడ్‌విట్‌ పక్షులు వలస వెళ్తుంటాయి. ఈసారి కూడా శీతాకాలం ప్రారంభం కాగానే.. అవి తమ ప్రయాణం మొదలుపెట్టాయి. వాటిలో ఒక నెలల పక్షి ఏకంగా 13,560 కిలోమీటర్లు ప్రయాణించింది. అదీ.. కేవలం 11 రోజుల్లోనే అంతదూరం ప్రయాణించడం విశేషం. ఆ చిన్న పక్షి మధ్యలో కాస్త దారితప్పడంతో అదనంగా 500 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చిందట. ‘ఈ ప్రయాణ సమయం, దూరం వివరాలు మనకెలా తెలుస్తాయి?’ అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది కదా! ఆ పక్షులు ప్రయాణం ప్రారంభించడానికి ముందుగానే.. శాస్త్రవేత్తలు వాటి శరీరం మీద అయిదు గ్రాములు మాత్రమే బరువుండే బుజ్జి ట్రాకర్‌ను అమర్చారట. దాంతో ఆ వివరాలన్నీ వారికి సులభంగా తెలిశాయి.

నీళ్లలో పడితే అంతే..

సాధారణంగా 300 నుంచి 400 గ్రాముల బరువుండే ఈ గాడ్‌విట్‌ పక్షులు నీళ్లలో ఈదలేవు. వాటి కాలి వేళ్లు బాతుల్లా కలిసి ఉండకపోవడంతో.. ఇవి నీటిలో పడితే ముందుకు కదల్లేవు. ప్రాణాలు వదలాల్సిందేనన్నమాట. అయినా కూడా ఏటా ఈ పక్షుల సమూహం పసిఫిక్‌ మహాసముద్రం మీదుగానే రోజుల తరబడి ప్రయాణం చేస్తుంటాయి. గిన్నిస్‌ రికార్డు సాధించిన పక్షి.. అంతదూరం ప్రయాణంలో సగం బరువును కోల్పోయి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతకుముందు కూడా ఇదే రికార్డు ఈ గాడ్‌విట్‌ పక్షుల పేరిటే ఉంది. 2020లో ఈ జాతికే చెందిన ఓ పక్షి.. పదకొండు రోజుల్లో 12,000 కిలోమీటర్లు ప్రయాణించింది. దారి చూపే అవసరం, ఎటువంటి విరామం లేకుండా అంతదూరం ఎగరగలిగేంత శక్తి ఈ పక్షులకు ఎక్కడి నుంచి వచ్చిందో శాస్త్రవేత్తలకూ అంతుచిక్కడం లేదట. ఇది మొత్తం చదివాక.. ‘పిట్ట కొంచెం - ప్రయాణం ఘనం’ అని అనిపిస్తోంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని