ఈ కూరగాయ ధర వింటే దడే!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఖరీదైన ఆహార పదార్థాలు అనగానే మనకు హిమాలయాల్లాంటి అతి శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే కుంకుమపువ్వో, పుట్టగొడుగులో గుర్తుకువస్తాయి.

Published : 06 Dec 2022 00:12 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఖరీదైన ఆహార పదార్థాలు అనగానే మనకు హిమాలయాల్లాంటి అతి శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే కుంకుమపువ్వో, పుట్టగొడుగులో గుర్తుకువస్తాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కూరగాయ ముందు అవన్నీ చాలా తక్కువ ధర అనిపిస్తాయి. నిజమే నేస్తాలూ.. ఇంతకీ అదేంటో, దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..!

హాప్‌షూట్స్‌.. అనే కూరగాయ మనకు అంతగా తెలియదు కానీ, యూరప్‌ దేశాల వారికి బాగా పరిచయం. విషయం ఏంటంటే.. వీటి ధర కిలో రూ.80 వేల నుంచి రూ.85వేల వరకూ ఉంటుందట. ‘అమ్మో.. మన దగ్గర కూరగాయల ధర కాస్త పెరిగితేనే.. అస్సలు తట్టుకోలేం. అలాంటిది దీనికి ఇంత రేటా?’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ! వీటిలోని ఔషధ గుణాల కారణంగానే అవి అంత ధర పలుకుతున్నాయట. అందుకే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయగా దీనికి పేరుంది.

సాగు.. సవాలే..

ధరకు తగినట్టే.. ఈ హాప్‌షూట్స్‌ సాగు కూడా సవాల్‌తో కూడుకున్నదే. వీటి పైభాగంలో ఉండే పూలవంటివాటిని చాలా జాగ్రత్తగా సేకరించాలట. ఈ పువ్వులను ‘హాప్‌కోన్స్‌’ అని పిలుస్తారు. వాటి సేకరణకు యంత్రాల వాడకం కుదరదు కాబట్టి కచ్చితంగా మనుషులనే ఉపయోగించాలి. ఈ కొమ్మలను సలాడ్‌లలో, ఊరగాయగానూ ఉపయోగిస్తారు. ఈ మొక్కలు ఒకరోజులో దాదాపు ఆరు అంగుళాల వరకూ పెరుగుతాయట. ఒకసారి సాగు చేస్తే.. ఇరవై ఏళ్ల వరకూ ఇవి దిగుబడి ఇస్తాయి. వీటిలోని ఔషధ గుణాలను చాలా దశాబ్దాల క్రితమే గుర్తించారట. ఇది మన దగ్గర సాగు చేయడం లేదు. కాకపోతే, ఒకసారి హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా హాప్‌షూట్స్‌ పెంపకం చేపట్టారు. సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులపైన పన్ను ఉండదు. కానీ, ఇంగ్లండ్‌లో 18వ శతాబ్దంలో ఈ కూరగాయలపైనా పన్ను విధించారట. ఇవి మానవ శరీరంలో యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తాయట.

మన దగ్గరా..

‘మరి మన దగ్గర లభించే వాటిలో ఖరీదైనవి లేవా?’ అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది కదా! ఎందుకు లేవు - గుచ్చి అనే పుట్టగొడుగులు కేజీ రూ.30 వేల వరకూ పలుకుతాయి. ఇవి హిమాలయాల్లో మాత్రమే పెరుగుతుంటాయి. ఇదికాక.. మరికొన్ని రకాల పుట్టగొడుగుల ధర కూడా వేలల్లో ఉంటుంది. వీటితో పోల్చుకుంటే.. హాప్‌షూట్స్‌ ధర రెట్టింపుకంటే ఎక్కువే కదూ! మొత్తానికి ఇవీ అత్యంత ఖరీదైన కూరగాయ వివరాలు.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని