Published : 21 Jan 2023 00:02 IST

కానుక చూసి.. పోలీసును చేసి..

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ప్రజాప్రతినిధులో, అధికారులో వెళ్తుంటే.. వారి చుట్టూ రక్షణగా పోలీసులను చూసే ఉంటారు కదూ! ప్రముఖులు, ఉన్నత స్థానంలో ఉన్న వారికి మాత్రమే సాధ్యమయ్యే ఆ బందోబస్తు.. ఇటీవల ఓ చిన్నారికి కూడా దక్కింది. ‘అదేంటి?’ అని ఆశ్చర్యపోకుండా.. ఈ కథనం చదివితే, ఆ విశేషాలేంటో మీకు కూడా తెలుస్తాయి.

యూకేకు చెందిన హ్యారీకి ప్రస్తుతం అయిదు సంవత్సరాలు. ఇటీవల బొమ్మ ఎలక్ట్రిక్‌ బైక్‌ మీద హ్యారీ ముందు వెళ్తుంటే, పోలీసులు కూడా వాళ్ల పెట్రోలింగ్‌ వాహనాల మీద తన వెనకే వెళ్లసాగారు. వెనక్కి తిరిగి వారిని చూసుకుంటూ మరీ.. హ్యారీ మురిసిపోతున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఒక్క క్లిప్‌తో ఈ బుడతడు వార్తల్లో నిలిచాడు.

క్రిస్మస్‌ కానుకగా..

గతేడాది అనారోగ్య కారణాలతో హ్యారీ వాళ్ల నాన్న చనిపోయారట. అయితే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఈ నేస్తానికి బొమ్మలంటే బోలెడంత ఇష్టం. దాంతో గత క్రిస్మస్‌ సందర్భంగా ఓ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఈ బుడతడికి కానుకగా అందింది. అతడు ఆ బైక్‌ మీద వీధుల్లో రయ్‌.. రయ్‌మంటూ చక్కర్లు కొడుతున్న ఒక వీడియోను వాళ్ల అమ్మ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అది చూసిన ఆమె స్నేహితురాలు.. ట్రాఫిక్‌ పోలీసుగా పనిచేస్తున్న తన భర్తకు దాన్ని చూపించింది. తండ్రి పోయిన బాధను మరిపించేందుకు.. ‘ఒకరోజు నిజమైన పోలీసులా పని చేస్తావా?’ అని ఆయన హ్యారీని అడగడంతో సరేనన్నాడు. దాంతో ఇటీవల పోలీస్‌ యూనిఫాంతో తన బుజ్జి బైక్‌ మీద విధులు నిర్వర్తించాడీ నేస్తం. అంతేకాదు.. ముగ్గురు అసలైన పోలీసులూ సెల్యూట్‌ చేస్తూ, ఎస్కార్టుగా అతడి వెనకే వెళ్లారట.

వైరల్‌గా మారి..

హ్యారీ ముందు వెళ్తుండగా, తన వెనకే పోలీసులు విధులు నిర్వర్తించిన వీడియోను డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌ ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ కూడా సాధించింది. నెటిజన్లు కూడా బుడతడిని సూపర్‌ కాప్‌ అంటూ, పోలీసులను అభినందిస్తూ.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని