అరచేయంత కుందేలోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా? నేను మీ చింటూను. ఈ రోజు నేను ఓ కుందేలు ఇంటర్వ్యూతో మీ ముందుకొచ్చాను. అలా అని అది ఏమీ మామూలు కుందేలు కాదు.

Published : 21 Mar 2024 00:14 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా? నేను మీ చింటూను. ఈ రోజు నేను ఓ కుందేలు ఇంటర్వ్యూతో మీ ముందుకొచ్చాను. అలా అని అది ఏమీ మామూలు కుందేలు కాదు. దానికో ప్రత్యేకత కూడా ఉంది. ఆ విశేషాలు మీరు తెలుసుకుంటారనే.. ఆ వివరాలతో ఇలా వచ్చాను.

చింటు: హలో కుందేలూ.. నువ్వు బుజ్జిగా భలే ముద్దొస్తున్నావు తెలుసా?

 కుందేలు: థ్యాంక్స్‌ చింటూ.. నువ్వు కూడా చక్కగా ముద్దుగా ఉన్నావు.

 చింటు: అవును.. ఇంతకీ నీ పేరేంటి?
కుందేలు: నా పేరు పిగ్మీరాబిట్‌.

చింటు: నువ్వు ప్రపంచంలోకెల్లా అతి చిన్న జాతికి చెందిన కుందేలువు అని విన్నాను. అది నిజమేనా?
కుందేలు: హుమ్‌.. నేను ప్రపంచంలోకెల్లా అతి చిన్న కుందేలును. సరిగ్గా మీ పెద్దవాళ్ల అరచేతుల్లో సరిపోతాను. నన్ను మొదట అందరూ చూసి పిల్ల కుందేలేమో అనుకుంటారు. కానీ నేను పెద్ద కుందేలునే. మేం దాదాపు 375 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బరువు తూగుతాం. 23.5 నుంచి 29.5 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాం. మాలో ఆడవి, మగవాటికన్నా కాస్త పెద్దగా ఉంటాయి.
చింటు: నీ చెవులేంటి ఇలా ఉన్నాయి?
కుందేలు: మిగతా కుందేళ్లకున్నట్లు నాకు పొడవైన చెవులుండవు. చాలా చిన్నగా ఉంటాయి. నువ్వు గమనించావో లేదో.. నా కాళ్లు కూడా పొట్టిగానే ఉంటాయి. నా శరీరమేమో బూడిద రంగులో ఉంటుంది.
చింటు: ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటావు?
కుందేలు: నేను ఉత్తర అమెరికాలోని పర్వత ప్రాంతాల్లో జీవిస్తుంటాను. అది కూడా ఎత్తైన, గుబురైన పొదలున్న చోటే ఉంటాను. ఇవే నాకు రక్షణ కవచాలన్నమాట. నేను బొరియలు కూడా తవ్వుకోగలను. వాటిలోనే నా నివాసం.

చింటు: బుజ్జి కుందేలూ... ఆ బొరియల గురించి ఇంకా ఏమైనా చెబుతావా?
కుందేలు: ఓ.. తప్పకుండా చెబుతాను. ఆ బొరియలు మరీ పెద్దవేం కావు. దాదాపు ఒక మీటరు లోతు వరకు తవ్వుకోగలను. ఓ వందమీటర్ల దూరం వరకు వాటిని నిర్మించుకుంటాను. మంచు కురిసే సమయాల్లో ఈ బొరియలే మా ప్రాణాలను కాపాడతాయి.
చింటు: అవునూ.. ఇంతకీ నువ్వు ఏం తింటావు?
కుందేలు: నేను ప్రధానంగా గడ్డిని ఆహారంగా తీసుకుంటాను. పొదలు, లేత ఆకులను కూడా తిని నా బొజ్జ నింపుకొంటాను.
చింటు: నీకు శత్రువులు ఏమైనా ఉన్నాయా?
కుందేలు: లేకేం.. చాలా ఉన్నాయి. ముంగిసల్లాంటి జీవులైన వీసెల్స్‌, తోడేళ్లు, నక్కలు, అమెరికన్‌ బ్యాడ్జర్లు, బాబ్‌క్యాట్స్‌, గుడ్లగూబలు, గద్దలు నాకు ప్రధాన శత్రువులు. ఇవి మా కోసం కాచుకొని ఉంటాయి. మేం కనిపిస్తే చాలు.. అమాంతం దాడి చేసి కరకరలాడించేస్తాయి. సరే చింటూ.. నేను వెళ్లొస్తా. ఇప్పటికే చాలా సమయమైంది.
చింటు: ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్‌ పిగ్మీ కుందేలు. బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని