ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరా?

చిన్నూ: మొదటి లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గాల కంటే ఎన్నికైన సభ్యులు ఎక్కువ మంది ఉండే వారన్నారు కదా? ఎలా?

Updated : 31 Mar 2019 01:16 IST

చిన్నూ: మొదటి లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గాల కంటే ఎన్నికైన సభ్యులు ఎక్కువ మంది ఉండే వారన్నారు కదా? ఎలా?
ఆర్వీరామారావ్‌ తాతయ్య: 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు 1957లో రెండో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాగే జరిగింది. నియోజకవర్గాలకన్నా లోక్‌సభలో సభ్యుల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే అప్పుడు కొన్ని ద్విసభ్య నియోజకవర్గాలు, మరి కొన్ని త్రిసభ్య నియోజకవర్గాలు ఉండేవి. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరినో ముగ్గురినో ఎన్నుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది వింతగా కనిపిస్తుంది.

చిన్నూ: అదెలా? ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరూ ముగ్గురూ ఎంపికా?
తాతయ్య: మొదటి రెండు లోక్‌సభల్లో ఎస్సీలకు, ఎస్టీలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండేది కానీ ప్రత్యేక నియోజకవర్గాలు లేవు. ద్విసభ్య నియోజకవర్గం ఉన్న చోట ఒక జనరల్‌ అభ్యర్థిని ఒక ఎస్సీ అభ్యర్థిని లేదా ఒక ఎస్టీ అభ్యర్థిని ఎన్నుకోవాల్సి వచ్చేది.

చిన్నూ: మరి కొన్నింటిలో ముగ్గురున్నారు? ముగ్గురెవరెవరు?
తాతయ్య: ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ అభ్యర్థులు.

చిన్నూ: అలాగా... ఇంతకీ ఆ పద్ధతి ఎప్పుడు మారింది?
తాతయ్య: 1961లో ద్విసభ్య, త్రిసభ్య నియోజకవర్గాలను రద్దు చేస్తూ చట్టం చేశారు.

చిన్నూ: ఇప్పుడు ఆ పద్ధతి లేదుగా?
తాతయ్య: లేదు. బ్రిటన్‌లో 1950 ఎన్నికలకు ముందు ఈ పద్ధతే ఉండేది. అయితే అమెరికాలో ఒకరి కన్నా ఎక్కువ మందిని ఎన్నుకునే విధానం ఇప్పటికీ ఉంది. దాన్ని బహుళ సభ్యుల జిల్లా అంటారు. అక్కడా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందిని ఒకే నియోజకవర్గం నుంచి ఎన్నుకుంటారు.

చిన్నూ: ఈ పద్ధతి ఎందుకు మానేశారు?
తాతయ్య: కొన్ని సమస్యలు వచ్చాయి. ఉదాహరణకు 1957లో వి.వి.గిరి పార్వతీపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అది ద్విసభ్య నియోజకవర్గం. గిరితో పాటు అక్కడ మరో ఇద్దరు ఎస్టీలు కూడా పోటీ చేశారు. ఆ ఇద్దరికీ గిరి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అందువల్ల ఇద్దరూ గిరిజనులే అయినా వాళ్లే గెలిచినట్టు ప్రకటించాల్సి వచ్చింది. అంటే అందులో ఒకరు ఎస్టీ ప్రతినిధి, మరొకరు జనరల్‌ ప్రతినిధి అయ్యారు. దీంతో జనరల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వి.వి.గిరి ఓడిపోయినట్టయ్యింది. అందుకే ఈ పద్ధతిని రద్దు చేశారు. వి.వి.గిరి తర్వాత రాష్ట్రపతి అయ్యారు తెలుసుగా!

చిన్నూ: అంటే ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అంతే మంది సభ్యులుంటారన్నమాట.
తాతయ్య: అవును. 1962 నుంచి ద్విసభ్య నియోజక వర్గాలకు బదులు ఎస్సీలకు, ఎస్టీలకు ప్రత్యేకంగా నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని