Qantas: లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్‌ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!

Qantas: కాంటాస్‌ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్‌ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది.

Updated : 06 May 2024 09:52 IST

సిడ్నీ: లాభాల కోసం అక్రమ విధానాలను అనుసరించిన ఆస్ట్రేలియా విమానయాన సంస్థ కాంటాస్‌ (Qantas) చివరకు మూల్యం చెల్లించుకుంది. ‘ఘోస్ట్‌ ఫ్లైట్స్‌’ పేరిట ప్రాచుర్యం పొందిన కుంభకోణంలో 66 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.550 కోట్లు) జరిమానా చెల్లించేందుకు సిద్ధమైంది.

ముందుగానే రద్దయిన విమానాల్లోని టికెట్లను సైతం కాంటాస్‌ (Qantas) విక్రయిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా అంగీకరించిందని ఆస్ట్రేలియా నియంత్రణా సంస్థ తెలిపింది. దీంతో 66 మిలియన్‌ డాలర్ల జరిమానాతో పాటు 86 వేల మంది ప్రయాణికులకు 13 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లాభాల కక్కుర్తితో కంపెనీ చేసిన నిర్వాకం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చీవాట్లు పెట్టింది. అనేక మంది వ్యాపారులు, పర్యటకులు రద్దు చేసిన విమానాల్లోని టికెట్లు బుక్‌ చేసుకొని నష్టపోయారని తెలిపింది.

‘‘మూడు రోజుల ముందే రద్దయిన విమానాల టికెట్లను సైతం విక్రయించాం. మా కస్టమర్లకు నష్టం కలిగించాం. ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యాం. ప్రయాణికులకు సకాలంలో నోటిఫికేషన్లు పంపలేకపోయాం. దానికి క్షమాపణ చెబుతున్నాం’’ అంటూ కాంటాస్‌ సీఈఓ వనెస్సా హడ్సన్‌ తమ తప్పును అంగీకరించారు.

దాదాపు 103 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ ఈ తరహా అనైతిక విధానాలను అవలంబించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల ధరలు పెంచడం, సేవల నాణ్యతలో లోపాలు, కరోనా సమయంలో 1,700 మంది సిబ్బంది తొలగింపు వంటి అంశాల్లోనూ ఈ సంస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. గత ఏడాది ఈ కంపెనీ 1.1 బిలియన్‌ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు