Ravindra Jadeja: పంజాబ్‌తో మ్యాచ్‌.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా

పంజాబ్‌ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

Published : 06 May 2024 09:52 IST

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్‌ మీద బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన అతడు ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా (POTM) నిలిచాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) పేరిట ఉన్న రికార్డును రవీంద్ర జడేజా అధిగమించాడు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున అత్యధిక POTMలను అందుకొన్న క్రికెటర్‌గా జడేజా అవతరించాడు. ఇప్పటి వరకు ధోనీ 15 సార్లు అవార్డులను దక్కించుకోగా.. జడేజా 16వ సారి సొంతం చేసుకున్నాడు. వీరిద్దరి తర్వాత సురేశ్‌ రైనా (12), రుతురాజ్‌ గైక్వాడ్ (11), మైక్‌ హస్సీ (10) ఉన్నారు. పంజాబ్‌పై జడేజా 43 పరుగులు చేయడంతోపాటు 3 వికెట్లను తీశాడు. మ్యాచ్‌ అనంతరం జడేజా పిచ్‌ పరిస్థితిపై స్పందించాడు. 

‘‘డే టైమ్‌లో జరిగిన మ్యాచ్‌లో వికెట్ స్లోగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. వేడి వల్ల నెమ్మదిగా ఉంటుందని భావించాం. కానీ, పిచ్‌ నుంచి బ్యాటర్లకు పెద్దగా సహకారం లేకుండాపోయింది. అందుకే, నేను బ్యాటింగ్ చేసే సమయంలో 40 పరుగుల పార్టనర్‌షిప్‌ను నిర్మిస్తేనే మ్యాచ్‌లో మేం పోటీనివ్వడానికి ఉంటుందని అనుకున్నా. బంతి పాతబడే కొద్దీ బ్యాట్‌ మీదకు సరిగ్గా రాలేదు.  కొత్త పిచ్‌పై ఆడేటప్పుడు ఎలా స్పందిస్తుందో అర్థం కాదు. బ్యాటింగ్‌లో 15 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. త్వరగా వికెట్లను కోల్పోవడం వల్ల ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. అయితే, మేం బౌలింగ్‌ చేసే సమయానికి ఆ స్కోరు సరిపోతుందని అర్థమైంది’’ అని జడేజా తెలిపాడు. 

తొలిసారి 9వ స్థానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌

టీ20 కెరీర్‌లో ఎంఎస్ ధోనీ తొలిసారి 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇప్పటి వరకు ఎక్కువగా వన్‌ డౌన్‌ నుంచి 7వ స్థానంలోపే క్రీజ్‌లోకి అడుగు పెట్టేవాడు. ఈ సీజన్‌లో ఒకసారి 8వ స్థానంలోనూ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, పంజాబ్‌తో మ్యాచ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ తర్వాత ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, 19వ ఓవర్‌లో బ్యాటింగ్‌ వచ్చిన ధోనీని హర్షల్ పటేల్ వేసిన స్లో బంతితో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్‌ డక్‌ కావడంతో అభిమానులు నిరాశకు గురి చేశారు. ప్రస్తుత ఎడిషన్‌లో ధోనీ ఔట్ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. పంజాబ్‌పైనే రెండుసార్లూ పెవిలియన్‌కు చేరాడు. గత మ్యాచ్‌లోనూ రనౌట్ అయిన విషయం తెలిసిందే.

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు

  • ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధికసార్లు 40+ స్కోరు - మూడు వికెట్లు తీసిన మూడో బౌలర్ రవీంద్ర జడేజా. షేన్‌ వాట్సన్ (3), యువరాజ్‌ సింగ్‌ (3)ని సమం చేశాడు. వీరి తర్వాత ఆండ్రి రస్సెల్ (2) ఉన్నాడు.
  • ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఇరు జట్ల వికెట్‌ కీపర్లు డకౌట్‌ కావడం ఇది ఐదోసారి. చెన్నై తరఫున ధోనీ, పంజాబ్‌ ఆటగాడు జితేశ్‌ శర్మ సున్నాకే పెవిలియన్‌కు చేరారు. ఇంతకుముందు రాజస్థాన్-ముంబయి (2010), ముంబయి - రాజస్థాన్‌ (2012), ముంబయి -హైదరాబాద్ (2018), గుజరాత్ - దిల్లీ (2023) మ్యాచుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
  • పంజాబ్‌ సొంతమైదానాల్లో ఘోరంగా విఫలమైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. గతేడాది కూడా ఏడింట్లో ఒక్కటి గెలిచి.. ఆరు ఓటములను చవిచూసింది.
  • పంజాబ్‌పై చెన్నై దాదాపు మూడేళ్ల తర్వాత గెలిచింది. 2021 సీజన్‌లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు 28 రన్స్‌తో గెలిచింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని