అక్కడికెళ్తే... గడ్డకట్టుకుపోవడమే.!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఉదయం, సాయంత్రం వేళల్లో చలికి అంతా గజగజా వణికిపోతున్నాం కదూ! దిల్లీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అంతేనా.. అమెరికాలో మంచు తుపానులు అక్కడి జనజీవనాన్ని స్తంభింపజేశాయి.

Published : 03 Jan 2023 01:15 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఉదయం, సాయంత్రం వేళల్లో చలికి అంతా గజగజా వణికిపోతున్నాం కదూ! దిల్లీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అంతేనా.. అమెరికాలో మంచు తుపానులు అక్కడి జనజీవనాన్ని స్తంభింపజేశాయి. కనీసం ఇళ్లలో నుంచి అడుగు కూడా బయటపెట్టలేని స్థితి. మరి, ఇటువంటి పరిస్థితుల్లో భూమిపైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయో తెలుసుకుందామా..!

భూమి మీద మొత్తం ఖండాలు ఏడు అనీ, వాటిలో అయిదో అతి పెద్దదైన అంటార్కిటికా మొత్తం మంచుతోనే కప్పబడి ఉంటుందని మీరు తరగతి పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. తూర్పు అంటార్కిటికాలోని ఓ పర్వత శిఖరంపైన -93.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందట. అంటే.. భూమిపైన అత్యంత శీతల ప్రదేశం ఇదేనన్నమాట. నాసా శాస్త్రవేత్తలే ఈ విషయం చెబుతున్నారు.  

మంచు ముద్దలా..  

ఇటీవల మంచు తుపానులు అమెరికా తదితర దేశాలను అతలాకుతలం చేస్తున్నాయన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉష్ణోగ్రతలు దాదాపు -28 డిగ్రీల వరకూ పడిపోతుంటాయి. అలాంటి వాతావరణంలో ఒక మనిషి బయట మంచుకు ఉంటే కేవలం పది నిమిషాల్లోనే గడ్డకడతాట. అయితే, దీనికే మనిషి గడ్డకట్టుకుపోతే.. ఇక అత్యంత శీతల ప్రదేశమైన తూర్పు అంటార్కిటికాలో పరిస్థితి ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేం. ఓ అధ్యయనం ప్రకారం -35 డిగ్రీలు నమోదయ్యే ప్రదేశంలో, ఎటువంటి రక్షణ చర్యలు లేకపోతే.. మనుషులు కేవలం రెండు నిమిషాల్లోనే మంచు ముద్దల్లా మారిపోతారట.  

పదేళ్లుగా రికార్డు

గత పదేళ్లుగా.. అంటే 2013 నుంచి ‘వరల్డ్‌ కోల్డెస్ట్‌ ప్లేస్‌’ రికార్డు తూర్పు అంటార్కిటికా పీఠభూమి పేరిటే నమోదవుతోందని నాసా అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా అక్కడ మంచు తీవ్రత అధికమవుతోందట. అంటే, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని అర్థం. భూమి కంటే సూర్యుడి నుంచి అధిక దూరంలో ఉండే అంగారక గ్రహం మీద కంటే, మన భూమి మీదనే అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని నాసా ఉపగ్రహాల ద్వారా తెలిసింది. నేస్తాలూ.. మన దగ్గర ఉష్ణోగ్రతలు కాస్త తగ్గితేనే వణికిపోతుంటాం.. మరి అలాంటిది తూర్పు అంటార్కిటికాకు వెళ్తే ఇక మనం ఒక్క క్షణమైనా ఉండగలమా? - ఊహించుకుంటేనే వణుకు పుడుతోంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని