రబ్బర్‌ ఫ్లోరింగ్‌

ఇంటి గచ్చులో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఇల్లంతా ఒకటే ఫ్లోరింగ్‌ పాత ముచ్చట. ఇప్పుడు గదికో ఫ్లోరింగ్‌తో మెరిపిస్తున్నారు. సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటివారి దృష్టి ఇప్పుడు రబ్బర్‌ ఫ్లోరింగ్‌పై పడింది.

Published : 11 Feb 2023 02:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి గచ్చులో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఇల్లంతా ఒకటే ఫ్లోరింగ్‌ పాత ముచ్చట. ఇప్పుడు గదికో ఫ్లోరింగ్‌తో మెరిపిస్తున్నారు. సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటివారి దృష్టి ఇప్పుడు రబ్బర్‌ ఫ్లోరింగ్‌పై పడింది.

సాధారణంగా రబ్బర్‌ ఫ్లోరింగ్‌ను వ్యాయామశాలలు, క్రీడా మైదానాలు, కార్యాలయాల్లో అవసరమైన చోట వినియోగిస్తుంటారు. ఆరోగ్య స్పృహ పెరగడంతో ఇళ్లలోనూ వ్యాయామ గదుల ఏర్పాటు ప్రత్యేకంగా ఉంటోంది. ఇదివరకైతే సాధారణ గచ్చే వేసుకునేవారు. మార్కెట్లో లభ్యత పెరగడంతో రబ్బర్‌ ఫ్లోరింగ్‌ పరిపిస్తున్నారు. కొందరు పిల్లల గదుల్లోనూ వీటిని వేయిస్తున్నారు. సాధారణ టైల్స్‌తో పోలిస్తే వీటి వ్యయం అధికంగా ఉంటోంది. అందుకే పరిమితంగా అవసరమైన మేరకే వీటి వేయిస్తున్నారు.

* అపార్ట్‌మెంట్లలో ఉంటే పై అంతస్తులో నడుస్తుంటే కింది అంతస్తుల్లో శబ్ధాలు వినబడుతుంటాయి. స్వేచ్ఛగా పిల్లలు ఆడుకోలేని పరిస్థితి. రబ్బర్‌ ఫ్లోరింగ్‌తో ఇలాంటి ఇబ్బందులు తొలగనున్నాయి.

కాంక్రీట్‌పైనే..

పాత టైల్స్‌పైనే రబ్బర్‌ ఫ్లోరింగ్‌ వేయిస్తున్నా.. కాంక్రీట్‌పైన వేయించడమే సరైందని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌ కోసం గదిని కేటాయించినప్పుడే రబ్బర్‌ ఫ్లోరింగ్‌ ఆలోచన చేస్తే మేలు. సులభంగా వేయడానికి వీలుంటుంది.

* ఈ తరహా ఫ్లోరింగ్‌ దీర్ఘకాలం మన్నుతుందని తయారీదారులు అంటున్నారు. సరిగ్గా నిర్వహిస్తే 20 ఏళ్లు వస్తుందని చెబుతున్నారు.
* నిర్వహణ సులభమే. పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. మురికిని తుడిచేయవచ్చు.
* రబ్బర్‌ గచ్చులతో ఫంగస్‌, ఇతర అలెర్జీలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు.
* తడిగా ఉండే ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. కిచెన్‌లు, బాత్‌రూమ్‌ల వంటి ప్రదేశాలకు రబ్బర్‌ ఫ్లోరింగ్‌ అనుకూలమైంది.

భిన్నరంగుల్లో..

రబ్బరు ఫ్లోరింగ్‌లో నచ్చిన రంగుల్లో వేయించుకోవచ్చు. విభిన్న శైలులు, రంగులు, అల్లికలు, ఇతర లక్షణాలతో లభిస్తున్నాయి. ఇంటి రంగులతో సరిపోయే రంగులను ఎంచుకుంటే మేలు.

* టైల్‌, షీట్‌ రూపంలో ఇవి దొరుకుతున్నాయి.

ప్రతికూలతలు ఉన్నాయ్‌..

* ఖరీదు ఎక్కువ కావడంతో అందరూ భరించలేరు.
* వీటి వాసనలు కొందరికి పడవు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని