లేఅవుట్లలోనే రిసార్టులు

లేఅవుట్ల నిర్మాణంలో డెవలపర్లు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. వందల నుంచి వేల ఎకరాల విస్తీర్ణంలో వీటిని అభివృద్ధి చేస్తుండటంతో కొంగొత్త రీతితో తీర్చిదిద్దుతున్నారు.

Updated : 05 Nov 2022 08:08 IST

అవుటర్‌, ప్రాంతీయ వలయ రహదారులకు చేరువలో వందల ఎకరాల్లో ప్రాజెక్టులు
భవిష్యత్తు టౌన్‌షిప్పులకు పునాదులు వేస్తున్నామంటున్న డెవలపర్లు
ఈనాడు, హైదరాబాద్‌

లేఅవుట్ల నిర్మాణంలో డెవలపర్లు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. వందల నుంచి వేల ఎకరాల విస్తీర్ణంలో వీటిని అభివృద్ధి చేస్తుండటంతో కొంగొత్త రీతితో తీర్చిదిద్దుతున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు లేఅవుట్‌ల చెంతనే రిసార్టులను ఏర్పాటు చేస్తున్నారు. క్లబ్‌హౌస్‌కు అదనంగా వీటిని చేపడుతున్నారు. భవిష్యత్తు టౌన్‌షిప్పులకు పునాదులు వేస్తున్నారు. రిస్టార్ట్‌కు వెళ్లాలంటే మున్ముందు సిటీకి దూరంగా ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఇంటి పక్కనే నడుచుకుంటూ వెళ్లి సేద తీరవచ్చు. ఇదివరకు రిసార్టుల్లో లేఅవుట్‌ చేసి ప్లాట్లను విక్రయించగా..ఇప్పుడేమో లేఅవుట్‌లో రిసార్టుల పేరుతో కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నగరంలో ఇదివరకు ఎక్కువ శాతం చిన్న లేఅవుట్లు ఉండేవి. హెచ్‌ఎండీఏ, ఇతర ప్రైవేటు సంస్థలు వేసిన కొన్ని వెంచర్లు మాత్రమే వందలాది ఎకరాల్లో ఉండేవి. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లన్నీ బాహ్యవలయ రహదారి,  ప్రాంతీయ వలయ రహదారి లోపల, బయట వస్తున్నాయి. ఇక్కడ లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారుల వెంట వందల నుంచి వేల ఎకరాలను డెవలపర్లు సేకరించి లేఅవుట్లు వేస్తున్నారు. వంద ఎకరాలపైన చేస్తున్న వెంచర్లు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. వీటిని వెయ్యి ఎకరాల వరకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో కొండలు, గుట్టలు సైతం వీరి పరం అవుతున్నాయి. చెరువులు, కుంటలను కలిపేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కొందరు మాత్రం వీటిని పరిరక్షిస్తూ మరింతగా అభివృద్ధి చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. విజయవాడ, నాగార్జునసాగర్‌, శ్రీశైలం, బెంగళూరు జాతీయ రహదారుల్లో ఈతరహా పెద్ద ప్రాజెక్టులు ప్రస్తుతం వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఆయా సంస్థలు వీటిని తమ కలల ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతున్నాయి.

పక్కా ప్రణాళికతో...

వందల ఎకరాల్లో లేఅవుట్‌ కావడంతో పక్కా ప్రణాళికతో కొందరైతే అంతర్జాతీయ కన్సల్టెంట్లతో డిజైన్‌ చేయిస్తున్నారు. సకలం అక్కడే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పనిలో పనిగా తమ వ్యాపారానికి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. ప్రారంభంలో వాణిజ్య సముదాయాలకు స్థలాలను కేటాయిస్తున్నారు. ఆకాశహర్మ్యాలకు చోటు వదులుతున్నారు.  వీటిని ప్రీమియం ధరలకు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత విల్లాలు కడుతున్నారు. ఆఖర్లో ఇంటి స్థలాల లేఅవుట్‌ వేస్తున్నారు. పార్కులు, కమ్యూనిటీ అవసరాల కోసం స్థలాలను వదులుతున్నారు. కొండలు, గుట్టలు ఉన్న స్థలాలు వృథా కాకుండా క్లబ్‌ హౌస్‌ నిర్మిస్తున్నారు. కొత్తగా రిసార్ట్‌ల థీమ్‌ ఈ మధ్య మొదలైంది. లేఅవుట్‌ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఒక్కో సంస్థ ఈ తరహాలో ఒక్కో థీమ్‌తో ముందుకొస్తున్నాయి. రిసార్టును ఐదు నుంచి పది ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్నారు. భారీ లేఅవుట్లు అన్నీ సిటీకి దూరంగా ప్రాంతీయ వలయ రహదారికి చేరువలో ఉండటంతో రిసార్టులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. టౌన్‌షిప్పులో స్థలం, విల్లా, వాణిజ్య స్థలాలను కొనుగోలు చేసిన వారికి ఉచిత సభ్యత్వం ఇస్తామంటున్నారు.

అన్ని వర్గాలు కొనగలిగేలా ఉంటేనే...

టౌన్‌షిప్పులో సకలం ఉంటున్నాయి సరే.. అన్ని వర్గాలు కొనగలిగే స్థితిలో ఉంటున్నాయా అంటే లేదనే సమాధానం వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థిరాస్తి సంఘాల సూచనలతో  లేఅవుట్‌లోని కొన్ని నిబంధనలను సర్కారు సవరించింది. దీంతో కొన్ని వర్గాలు స్థలాలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు వరకు ప్రతి వెంచర్‌లో అల్పాదాయ వర్గాల కోసం 60 గజాల స్థలాలను కొన్నింటిని కేటాయించేవారు. అయితే వీటిని అమ్మడం కష్టంగా ఉందని చెప్పి ఎల్‌ఐజీ ప్లాట్లు లేకుండా చేశారు. దీంతో పెద్ద ప్లాట్లు చేయడం మొదలైంది. 150 గజాలు, ఆపైన విస్తీర్ణం కలిగిన ప్లాట్లను చేసి విక్రయిస్తున్నారు. దీంతో అవుటర్‌ బయట కొనుగోలు చేయాలన్నా రూ.పాతిక లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలకు నగరంలో భూములు అందుబాటులో లేకుండా పోయాయి. టౌన్‌షిప్పులో అల్పాదాయ వర్గాలకు కొన్ని ప్లాట్లను కేటాయించాలనే సూచనలు కొనుగోలుదారుల నుంచి వస్తున్నాయి.

భూసేకరణ పూర్తికాకుండానే..

వేల ఎకరాల్లో లేఅవుట్‌ అంటే భూసేకరణకే చాలా సమయం పడుతుంది. పూర్తిగా సేకరించకుండానే కొంత భూమి చేతిలోకి రాగానే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. ప్రాజెక్టులోని కొన్ని భూములపై భూ యజమానులు, డెవలపర్ల మధ్య వివాదాలు ఉంటున్నాయి. దీంతో వీటిలో అనుమతులను సైతం దశలవారీగా తీసుకుంటున్నారు. కొనేముందు వివాదాలు ఏమైనా ఉన్నాయా? అన్ని అనుమతులు ఉన్నాయా? లేవుట్‌లోని స్థిరాస్తులపై కొనుగోలుదారులకు ఉన్న హక్కులేమిటి? డెవలపర్‌కు చెందిన ఆస్తులేవి అని వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం మేలు. లిఖితపూర్వకంగా ఉంటే ఇంకా మేలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు