విశాలం.. విలాసం

ఆకాశ్‌ చిన్నకుటుంబంతో రెండు పడక గదుల ఫ్లాట్‌లో పదేళ్లుగా నివస్తున్నారు. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు. ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

Published : 13 May 2023 04:03 IST

కొద్దికాలంగా గృహ నిర్మాణ మార్కెట్‌లో ఇదే పోకడ
ఈనాడు, హైదరాబాద్‌

కాశ్‌ చిన్నకుటుంబంతో రెండు పడక గదుల ఫ్లాట్‌లో పదేళ్లుగా నివస్తున్నారు. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు. ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అల్లుళ్లు వస్తే ఇప్పుడు ఉన్న ఇల్లు సరిపోదని.. మూడు పడకల ఫ్లాట్‌ కోసం చూస్తున్నారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో కొంతకాలంగా విలాసవంతమైన నివాసాల మార్కెట్‌ ఆశాజనకంగా ఉంది. బడ్జెట్‌ ధరల ఇళ్లలోనూ 3 పడకల గదులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కుటుంబ అవసరాల రీత్యా విశాలంగా ఉండాలని ఎక్కువ మంది పెద్ద ఇళ్లను కోరుకుంటున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు.

వీటి వాటానే అధికం..

తెలంగాణ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో జరిగిన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే 1000-2000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని నివాసాలే అత్యధికంగా 69 శాతం ఉన్నాయి. ఆ తర్వాత 500-1000 అడుగులలోపు ఉన్న ఫ్లాట్ల వాటా 17 శాతం ఉంది. విలాసవంతమైన 2 వేల నుంచి 3 వేల చదరపు అడుగుల మధ్యనే ఇళ్లు కొన్నవారు 8 శాతం ఉన్నారు. 3 వేల చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కల్గిన అత్యంత విలాసవంతమైన ఇళ్ల వాటా స్థిరంగా 2 శాతం కొనసాగుతోంది.

సగటున 5700 యూనిట్లు..  

నాలుగు జిల్లాల పరిధిలో 15 నెలల సగటు చూస్తే నెలకు 5700 అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొన్నినెలల్లో ఎక్కువ.. మరికొన్ని నెలల్లో తక్కువ ఉంటున్నాయి. సెంటిమెంట్‌ ఆధారంగా నడిచే మార్కెట్‌ కావడంతో మంచిరోజులు చూసుకుని కొనుగోలు చేస్తుంటారు. ఈ కారణంగా హెచ్చుతగ్గులు ఉంటాయని స్థిరాస్తి వర్గాలు అంటున్నాయి. మొత్తం యూనిట్లలో 4 వేల యూనిట్లు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంపైన ఉన్నవే కొంటున్నారు.  

విలువపరంగా చూస్తే..

ఇళ్ల ధరల్లో మార్కెట్‌ ధర ఒకలా, రిజిస్ట్రేషన్‌ ధర మరోలా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ధర ప్రకారం చూస్తే హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రతినెలా సగటున రూ.2800 కోట్ల విలువైన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. స్థలాలు, భూముల లావాదేవీలు కలిపితే ఇందుకు రెండు మూడు రెట్లు అధికంగా ఉంటుంది.


అప్‌గ్రేడ్‌ చేసుకుంటున్నారు

- శాంసన్‌ ఆర్ధర్‌, హైదరాబాద్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌, నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా

హైదరాబాద్‌ మార్కెట్‌ ఏప్రిల్‌ నెల రిజిస్ట్రేషన్లలో తగ్గుదల నమోదు చేసినప్పటికీ గత ఏడాది ఇదే నెలలో కన్పించిన ధోరణికి అనుగుణంగా ఉంది. మొత్తంగా మార్కెట్‌ను చూస్తే విశాలమైన ఇళ్లకు 1000-2000 చ.అ.విస్తీర్ణం కల్గిన వాటికి డిమాండ్‌ కొనసాగుతోంది. ఇల్లు మరింత విశాలంగా ఉండాలని అప్‌గ్రేడ్‌ చేసుకుంటున్న తీరును ఇది ప్రతిబింబిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని