కొత్త ప్రాజెక్టుల జోరు

నిర్మాణ సంస్థలు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టాయి. వరసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తున్నాయి.

Updated : 25 Nov 2023 07:46 IST

ఖరీదైన ఆవాసాల మార్కెట్‌ విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ సంస్థలు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టాయి. వరసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తున్నాయి. పది రోజుల వ్యవధిలో మూడు ప్రధాన సంస్థలు దాదాపు 7వేల అపార్ట్‌మెంట్ల నిర్మాణాలను ప్రారంభించాయి. వీటిలో ఒకటి ప్రధాన నగరంలో ప్రాజెక్ట్‌ను చేపట్టగా.. మిగతా రెండు సంస్థలు శివార్లలో మొదలెట్టాయి. ఊహించిన దానికంటే మెరుగ్గా బుకింగ్‌లు ఉన్నాయని ఆయా సంస్థలు సంతృప్తి వ్యక్తం చేశాయి.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అన్నివైపులకు విస్తరిస్తోంది. గేటెడ్‌ కమ్యూనిటీలు ఇదివరకు పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సిటీ నలువైపులా ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. ఇన్నాళ్లు బడ్జెట్‌ హోమ్స్‌కే పరిమితమైన ఈ ప్రాంతాల్లో ఇప్పుడు విలాసవంతమైన గృహాలు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో సైతం కొనేవారు ఉన్నారని బిల్డర్లు చెబుతున్నారు.

విలాసవంతమైన నివాసాలు

రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల స్థాయిలోని నివాసాల విక్రయాలే కష్టమని ఒకప్పుడు భావించిన తూర్పు, ఉత్తర, దక్షిణ హైదరాబాద్‌లో.. ఇప్పుడు రెండు నుంచి నాలుగైదు కోట్లు విలువ చేసే విలాసవంతమైన ప్రాజెక్ట్‌లను సులువుగా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. శంషాబాద్‌లో మొదలెట్టిన ప్రాజెక్ట్‌లో 3,355 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు కడుతున్నారు. జేఎన్‌టీయూ వద్ద మొదలెట్టిన అపార్ట్‌మెంట్లలో 3,130 చ.అ. వరకు ఉంది. కొంపల్లిలో మొదలైన ప్రాజెక్ట్‌లో గరిష్ఠంగా ఐదు పడకల ఫ్లాట్‌ విస్తీర్ణం ఏకంగా 5,100 చ.అ. వరకు ఉంది. ఇవన్నీ కూడా పశ్చిమ హైదరాబాద్‌ బయట చేపట్టిన ప్రాజెక్టులు కావడం విశేషం. వీటితోపాటు తక్కువ విస్తీర్ణం కల్గిన నివాసాలు సైతం నిర్మిస్తున్నారు. బడ్జెట్‌, అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.

రెండు శాతం పెరిగాయ్‌

సిటీలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ ఉండటంతో అలాంటి ప్రాజెక్ట్‌లే ఎక్కువగా నిర్మాణదారులు చేపడుతున్నారు. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరు నాటికి ఈ విభాగంలో రెండు శాతం వృద్ధి కనిపించింది. రెండువేల నుంచి మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్లు ఏడాదికాలంలో 8 నుంచి 10 శాతానికి పెరిగాయి. మూడువేలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కల్గిన నివాసాలు 2 శాతంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. వెయ్యి నుంచి 2 వేలలోపు చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన ఫ్లాట్ల వాటా 66 శాతం నుంచి 69 శాతానికి పెరిగాయి.

గత నెలలో చూస్తే..

ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో అత్యంత విలాసంతమైన ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. సెంట్రల్‌, పశ్చిమ హైదరాబాద్‌లో కొన్నేళ్ల క్రితమే ఈ పోకడ మొదలైంది. ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గత నెలలో జరిగిన అత్యంత ఖరీదైన ఐదు లావాదేవీలను పరిశీలిస్తే.. అన్నీ కూడా 3వేల చదరపు అడుగులపైనే ఉన్నాయి. కొండాపూర్‌లో రూ.5.27 కోట్ల విలువైన స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ జరిగింది. బంజారాహిల్స్‌లో రెండు నివాసాలు ఒక్కోటి రూ.5.16 కోట్ల విలువైనవి రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. రాయదుర్గంలో ఒకటి రూ.4.63 కోట్లు, మరోటి రూ.4.54 కోట్ల విలువ చేసే ఇళ్ల లావాదేవీలు జరిగాయి.

ఎదురుచూడకుండా

గత కొన్నాళ్లుగా స్థిరాస్తి ధరలు నిలకడగా ఉన్నాయి. ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్తగా వచ్చే ప్రభుత్వాలను బట్టి కాస్త వెనకా ముందు పెరగడం ఖాయం అని అంటున్నారు. ఈలోపే నచ్చిన స్థిరాస్తిని ఎంపిక చేసుకుని కొనుగోలు చేయడం మేలని బిల్డర్లు చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లతోపాటు కొత్తగా ప్రారంభించిన వాటిలోనూ బడ్జెట్‌ను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ఐటీ కారిడార్‌లో ఇళ్ల ధరలు భారంగా భావించే వాళ్లకు ఇతర ప్రాంతాల్లో నివాసాలు అందుబాటులో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని