నవీకరణ వైపు.. పరుగు

గృహ నిర్మాణ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా బిల్డర్లు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు.

Updated : 16 Dec 2023 07:58 IST

ఈనాడు, హైదరాబాద్‌

గృహ నిర్మాణ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా బిల్డర్లు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. బడా నిర్మాణ సంస్థలు.. ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లనే నిర్మిస్తున్నాయి. చాలా సంస్థలు.. 2 బీహెచ్‌కే ఫ్లాట్లను వదిలేసి మూడు, నాలుగు బీహెచ్‌కే ఇళ్లనే కడుతున్నాయి. కొత్తగా ప్రారంభిస్తున్న వాటిలో 68 శాతం దాకా అధిక విస్తీర్ణం కలిగిన ఫ్లాట్లే ఉంటున్నాయి.

కొవిడ్‌ తర్వాత మార్కెట్‌ పూర్తిగా అధిక విస్తీర్ణం కలిగిన గృహ నిర్మాణం వైపు మళ్లింది. విశాలమైన పడక గదులు, పిల్లల గదితో పాటు.. పెద్దలు, అతిథుల కోసం మరో గది ఉండాలని కోరుకునేవారు పెరిగారు. ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా మరో గది, కుదిరితే వ్యాయామానికి విడిగా గది ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో మూడు, నాలుగు పడకల ఫ్లాట్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఎక్కువగా వీటిని కడుతున్నాయి.


ఆధునికతకు తగ్గట్టుగా

నగరంలో మొదటిసారి ఇళ్లు కొనుగోలు చేసేవారితో పాటు పాత ఫ్లాట్‌ స్థానంలో కొత్తవి కొంటున్నవారు ఉన్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా కొత్త ప్రదేశాలకు మారి అక్కడ కొనుగోలు చేస్తున్నారు. పదవీ విరమణ అనంతరం సిటీకి దూరంగా ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు, పిల్లలకు దగ్గరగా ఉండేందుకు నూతన ప్రదేశాల్లో ఇల్లు కొంటున్నారు. ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా నివాసం ఉండేందుకు గేటెడ్‌ కమ్యూనిటీలకు మారుతున్నవారు ఇటీవల పెద్ద సంఖ్యలో కన్పిస్తున్నారు. వీరంతా మూడు, నాలుగు బీహెచ్‌కే ఇళ్లకే మొగ్గుచూపుతున్నారని బిల్డర్లు అంటున్నారు. ఏటా సిటీలో తమ ఇంటిని అప్‌గ్రేడేషన్‌ చేసుకొనేవారు 5 శాతం వరకు ఉంటారని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు హరిబాబు అన్నారు.


ఏడాదికాలంలో మరిన్ని మార్పులు..

గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే మార్కెట్లో స్పష్టమైన మార్పులు కన్పిస్తున్నాయి. ఒక పడక గది ఇళ్ల నిర్మాణ పరంగా పెద్దగా మార్పులేకపోగా.. 2 బీహెచ్‌కే ఫ్లాట్లలో ఏకంగా 7 శాతం తగ్గుదల నమోదైంది. 3 బీహెచ్‌కే 56 నుంచి 57 శాతానికి పెరిగింది. 3.5 బీహెచ్‌కే ఫ్లాట్లు కొత్తగా నిర్మిస్తున్నారు. ఇవి 1 శాతంగా ఉన్నాయి. 4 బీహెచ్‌కే ఫ్లాట్లు సైతం ఏడాదికాలంలోనే 5 శాతం నుంచి 9 శాతానికి పెరిగాయి. 5 బీహెచ్‌కే కొనేవారు ఉండటంతో వీటిని సైతం కడుతున్నారు. ఈ ఏడాది వీటి ప్రారంభాల వాటా ఒక శాతంగా ఉంది. గత ఏడాది వీటి సంఖ్య నామమాత్రం. అధికాదాయ, సంపన్న వర్గాలు వీటిని కొంటున్నాయి.


విశాలంగా ఉండాల్సిందే..

పడక గదులు కింగ్‌సైజ్‌ బెడ్‌లతో ఎక్కువ విస్తీర్ణం ఆక్రమిస్తున్నాయి. దీంతో 14*16 అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించాల్సి వస్తోందని నిర్మాణదారులు అంటున్నారు. బాల్కనీలు సైతం విశాలంగా ఉండాలని కోరుకుంటున్నారు. కేవలం దుస్తులు ఆరేసుకునే ప్రదేశంగా కాకుండా ఉదయం, సాయంత్రం కుటుంబంతో కలిసి గడిపే ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. 6*10 అడుగుల విస్తీర్ణంలో వీటిని బిల్డర్లు నిర్మిస్తున్నారు. బాల్కనీ ప్రత్యేకతలతో మార్కెటింగ్‌ చేస్తున్న సంస్థలు ఉన్నాయంటే వీటి ప్రాధాన్యం ఎంత మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని