పెరగక ముందే కొనేద్దాం

ఇళ్ల ధరలు కొత్త సంవత్సరంలో మరింత పెరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి నిర్మాణ సంస్థలు. జనవరి 1 నుంచి చదరపు అడుగు ధరలను పలు సంస్థలు సవరించబోతున్నాయి. స్థలాలపై ఇస్తున్న రాయితీలు ముగుస్తాయని... ఈలోపే బుక్‌ చేసుకోవాలని స్థిరాస్తి సంస్థలు కోరుతున్నాయి.

Updated : 30 Dec 2023 09:24 IST

జనవరి 1 తర్వాత ఇళ్ల ధరలను సవరించబోతున్న నిర్మాణ సంస్థలు
ఈనాడు, హైదరాబాద్‌

ఇళ్ల ధరలు కొత్త సంవత్సరంలో మరింత పెరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి నిర్మాణ సంస్థలు. జనవరి 1 నుంచి చదరపు అడుగు ధరలను పలు సంస్థలు సవరించబోతున్నాయి. స్థలాలపై ఇస్తున్న రాయితీలు ముగుస్తాయని... ఈలోపే బుక్‌ చేసుకోవాలని స్థిరాస్తి సంస్థలు కోరుతున్నాయి. నచ్చిన ఇల్లు దొరక్క, నచ్చినా బడ్జెట్‌ సహకరించక స్థిరాస్తి కొనుగోలును చాలా మంది వాయిదా వేస్తుంటారు. కొనుగోలు ఆలస్యమయ్యేకొద్దీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

ఏకంగా 24 శాతం దాకా

దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మన దగ్గర వార్షికంగా ఇళ్ల ధరల పెరుగుదల అత్యధికంగా ఉంటోంది. గత ఏడాది 24 శాతం పెరుగుదల నమోదైంది. ఇంతలా ధరలు ఎందుకు పెంచుతున్నారని బిల్డర్ల ముందు ప్రస్తావిస్తే... భూముల ధరల్లో పెరుగుదలతోనే ఇళ్ల రేట్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

నిర్మాణాలూ పెరుగుతున్నాయ్‌ 

సిటీలో గతంలో పోలిస్తే ఇటీవల సంవత్సరాల్లో వార్షికంగా నిర్మాణం పూర్తిచేసుకుంటున్న యూనిట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో 68,010 యూనిట్ల సరఫరా ఉంటే. ఈసారి 76,345కి పెరిగింది. 12 శాతం వృద్ధి నమోదైంది. రూ.40 లక్షలు మొదలు రూ.రెండున్నర కోట్ల వరకు ఉన్న గృహాల వాటానే 82 శాతంగా ఉంది.

కొనుగోళ్లు  ఆశాజనకంగా

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొనుగోళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఏకంగా 30 శాతం పెరుగుదల నమోదైంది. ఇతర నగరాలతో పోలిస్తే మాత్రం హైదరాబాద్‌ వెనకబడింది. 2022లో వార్షికంగా 47,485 యూనిట్లు విక్రయిస్తే.. ఈసారి 61,715కి పెరిగింది. వృద్ధిరేటులో దేశవ్యాప్త సగటు 31తో పోలిస్తే దాదాపుగా సమానంగా ఉంది. పుణెలో 52 శాతంతో అత్యధిక వృద్ధి నమోదైంది. ముంబయిలో వార్షికంగా ఇళ్ల విక్రయాలు లక్షన్నర దాటింది. 40 శాతం పెరుగుదల నమోదైంది. బెంగళూరు, హైదరాబాద్‌ దాదాపు ఒకే స్థితిలో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని