తూర్పు పెరిగేనా?

మూసీనదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో అడుగులు వేస్తోంది. కొత్త సర్కారు కొలువుదీరిన రోజు నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అనేక సమావేశాలు జరిగాయి.

Updated : 20 Jan 2024 04:43 IST

మూసీనది అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
అందుబాటులో భారీగా ఖాళీ స్థలాలు
ఈనాడు, హైదరాబాద్‌

మూసీనదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో అడుగులు వేస్తోంది. కొత్త సర్కారు కొలువుదీరిన రోజు నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అనేక సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం సీఎంతో పాటు అధికారుల బృందం లండన్‌ పర్యటనలో ఉంది. థేన్స్‌ నది అభివృద్ధిపై అక్కడి అధికార బృందంతో చర్చలు జరుపుతోంది. ప్రపంచ నీటి మండలి(వరల్డ్‌ వాటర్‌ కౌన్సిల్‌)తో ఒప్పందం కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఆ ప్రయత్నాలన్నీ ముగిశాక.. పకడ్బందీ ప్రణాళికతో మూసీని అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తూర్పు నగరంపై జనాలు దృష్టి పెడుతున్నారు. ఓఆర్‌ఆర్‌ వెలుపలేగాక.. లోపల కూడా వేలాది ఎకరాల ఖాళీ స్థలాలు అందుబాటులో ఉండటంతో పెట్టుబడికి ఉత్సాహం చూపుతున్నారు.

కోకాపేట చుట్టూ ధరలకు రెక్కలు..

ఐటీ సంస్థలన్నీ పశ్చిమాన ఉండటంతో స్థిరాస్తి రంగం అక్కడ అంతకంతకూ అభివృద్ధి చెందుతోంది. దేశవిదేశాల నుంచి పెట్టుబడిదారులు వరుస కట్టడంతో.. 30, 40, 50 అంతస్తుల ఆకాశహర్మ్యాలకు ఆ ప్రాంతం చిరునామాగా మారింది. ఆదరణ ఆకాశాన్ని తాకడంతో.. గతేడాది నిర్వహించిన వేలంలో కోకాపేట ప్రభుత్వ భూమి ఎకరా రూ.100కోట్లు పలికింది. ఈ క్రమంలో కోకాపేట, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరాస్తి ధరల్లో వృద్ధి ఊపందుకుంది. ఇదే సమయంలో మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వ విధానాలు, పోత్సహకాలు ఉండాలని స్థిరాస్తి పరిశ్రమ వర్గాలు ఎంతో కాలంగా కోరుతున్నాయి. గతంలో కొన్ని చర్యలు చేపట్టినా.. మరిన్ని బాటలు వేసేందుకు కొత్త సర్కారు అడుగులు వేస్తోంది.

తూర్పును అనుసంధానిస్తే..

మూసీనది నగరం మధ్యలో 55కి.మీ పొడవున ప్రవహిస్తోంది. నగరం చుట్టూ ఉన్న ఓఆర్‌ఆర్‌ను తూర్పున ప్రతాపసింగారం వద్ద, పశ్చిమాన నార్సింగి వద్ద తాకుతుంది. నది అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నార్సింగి, ప్రతాపసింగారం మధ్య ఓఆర్‌ఆర్‌తో సమానంగా సువిశాల రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. అంతేగాక.. నది పొడవునా సుందర ఉద్యానవనాలు, కాలిబాటలు, షాపింగ్‌మాల్స్‌, వినోదాన్ని పంచే రకరకాల పార్కులు, ఇతర పర్యాటక అందాలను సాకారం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నదిలో పరిశుభ్రమైన నీటి ప్రవాహం, ఇరువైపులా అద్దాల మేడలు, మధ్యలో తూర్పు, పడమరలను అనుసంధానించే రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తే.. ప్రతాప సింగారం చుట్టుపక్కల ప్రాంతాలకు మంచి డిమాండ్‌ వస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కొత్త వంతెనలతో..

మూసీపై కొత్తగా 15 వంతెనలు నిర్మించే పనులు పురోగతిలో ఉన్నాయి. పీర్జాదిగూడ, ముసారంబాగ్‌, అత్తాపూర్‌, తదితర ప్రాంతాల్లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. అవన్నీ పూర్తయితే నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల మధ్య దూరం తగ్గుతుంది. భారీవర్షాలొచ్చినా నదిపై రాకపోకలు సజావుగా కొనసాగుతాయి. ఇలా అత్తాపూర్‌ నుంచి నాంపల్లి, జియాగూడ, గౌలిగూడ, చాదర్‌ఘాట్‌, ముసారంబాగ్‌, నాగోల్‌, పీర్జాదిగూడ, ప్రతాపసింగారం వరకు నదికి ఇరువైపులా ఉన్న పేద, మధ్య తరగతి కాలనీలకు రాకపోకలు సులభతరం కానున్నాయి.

మొదలైన ప్రాజెక్టులు..

నాగోల్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు వేలాది ఎకరాల ఖాళీ స్థలాలు ఉన్నాయి. నది అభివృద్ధిపై కొత్త సర్కారు స్పష్టమైన వైఖరి ప్రదర్శించడంతో.. ఆయా ప్రాంతాల్లో, అయోమయంలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. విల్లా లేఅవుట్లలో అభివృద్ధి వేగం పుంజుకుంది. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు చేపట్టేందుకు స్థిరాస్తి సంస్థలు సిద్ధమవుతున్నాయి.

రవాణా సదుపాయాలు..

ఇప్పటికే హైటెక్‌సిటీ నుంచి ఎల్బీనగర్‌, నాగోల్‌కు మెట్రో రైలు సదుపాయం ఉంది. భవిష్యత్తులో మెట్రో మార్గం విమానాశ్రయం వరకు విస్తరించనుంది. ఎల్బీనగర్‌ మెట్రోను హయత్‌నగర్‌ వరకు పొడిగించే అవకాశమూ ఉంది. వాటికి నది పొడవునా నిర్మించే రోడ్డు మార్గం తోడైతే.. తూర్పు, పడమరల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.  ఇవన్నీ కూడా అందుబాటు గృహాల నిర్మాణానికి ఊతమివ్వనున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని