అభివృద్ధికి భరోసా

రాజకీయం తర్వాత నాకు ఏదైనా సంపూర్ణంగా అవగాహన ఉందంటే అది రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగమే. నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరిస్తున్నాం. దీర్ఘకాలంలో ఉపయోగపడాలనే విధానంలో ముందుకు వెళుతున్నాం. మీకు కావాల్సిన పనులు.. ఏమైనా చెప్పదల్చుకున్నా పేషీలో అధికారులు అందుబాటులో ఉంటారు.

Updated : 24 Feb 2024 03:51 IST

రాజకీయం తర్వాత నాకు ఏదైనా సంపూర్ణంగా అవగాహన ఉందంటే అది రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగమే. నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరిస్తున్నాం. దీర్ఘకాలంలో ఉపయోగపడాలనే విధానంలో ముందుకు వెళుతున్నాం. మీకు కావాల్సిన పనులు.. ఏమైనా చెప్పదల్చుకున్నా పేషీలో అధికారులు అందుబాటులో ఉంటారు. ఓఆర్‌ఆర్‌, త్రిపుల్‌ ఆర్‌ మధ్యన పెద్ద ఎత్తున శాటిలైట్‌ టౌన్‌షిప్పులతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాన్ని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వ విధానం. ప్రపంచంలో ఏ నగరంలో చూసినా బిల్డర్లు కట్టిన నిర్మాణాలే ల్యాండ్‌మార్క్స్‌గా ఉన్నాయి. ఈ నగరం మనది.. అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. స్థిరాస్తి రంగానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. 

రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

ఈనాడు, హైదరాబాద్‌: సిటీలో మూసీ సుందరీకరణ... విమానాశ్రయంతో సహా కీలకమైన రద్దీ ప్రాంతాలకు మెట్రో విస్తరణ.. ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారిని మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యం.. ఫార్మా క్లస్టర్లు.... డ్రైపోర్ట్‌.. శాటిలైట్‌ టౌన్‌షిప్పుల అభివృద్ధికి ప్రోత్సాహం.. కొత్తగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి సర్కారు.. తమ విధానాలను ఒక్కోటి స్పష్టం చేస్తోంది.. సిటీ అన్నివైపులా అభివృద్ధి చెందేలా.. ప్రజల భవిష్యత్తు అవసరాలను తీర్చేలా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్‌ పోటీపడేవిధంగా తీర్చిదిద్దేందుకు 2050 మెగా మాస్టార్‌ప్లాన్‌ వంటి ప్రభుత్వ ఆలోచనలతో హైదరాబాద్‌ రియాల్టీ రంగంలో భరోసా పెరుగుతోంది. పరిశ్రమ వర్గాలు ప్రభుత్వ విధాన నిర్ణయాలను స్వాగతిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రణాళికలన్నీ ఆచరణలోకి వస్తే స్థిరాస్తి రంగానికి ఢోకా ఉండదని.. మరింతగా పరుగు పెడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అన్నివర్గాలు తమ బడ్జెట్‌లో ఇళ్లు కొనుక్కునేందుకు అవకాశం ఉంటుందని.. భవిష్యత్తు అవసరాల రీత్యా పెట్టుబడులతో రాబడులు అందుకోవచ్చనే ధీమా వారు వెలిబుచ్చారు. నగరంలో నిర్మాణ రంగం ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం అయ్యింది. ఇక్కడే ఎకరం భూమి ధర రూ.100 కోట్లకు పలికింది. 60 అంతస్తుల వరకు ఆకాశహర్మ్యాలను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. అత్యధికమందికి ఉపాధినిచ్చే ఐటీ సంస్థలన్నీ ఈ ప్రాంతంలో ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలు, నివాస కేంద్రాలు అభివృద్ధి చెందాయి. గత ప్రభుత్వం లుక్‌ఈస్ట్‌, గ్రిడ్‌ పాలసీతో సిటీలోని ఇతర ప్రాంతాలకు ఐటీ సంస్థలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టినా అనుకున్నంత స్థాయిలో అది జరగలేదు. కొత్తగా వచ్చిన సర్కారు తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నట్లు సీఎం, మంత్రుల మాటలు స్పష్టం చేస్తున్నాయి. తూర్పు వైపు విజయవాడ జాతీయ రహదారి మార్గంలో డ్రైపోర్ట్‌ నిర్మించే ఆలోచనలో సర్కారు ఉందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్గాన్ని పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు 8 కి.మీ. వరకు మెట్రో విస్తరణ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటన్నింటితో ఉపాధి అవకాశాలు లభించనుండటంతో రవాణా మెరుగుదలతో సరసమైన గృహాలకు ఈ ప్రాంతం అనువుగా మారనుందని రియల్టర్లు అంచనా వేస్తున్నారు.

ప్రాంతీయ వలయ రహదారి..

రియల్‌ఎస్టేట్‌లో ముఖ్యంగా ప్లాటింగ్‌ వెంచర్లన్నీ ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కలనే జరుగుతున్నాయి. డీటీసీపీ, ఫామ్‌ల్యాండ్‌ వెంచర్లకు ఈప్రాంతం కేంద్రంగా ఉంది. గత ఏడాదికాలంగా ప్లాటింగ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లన్నీ నెమ్మదించాయి. ప్రభుత్వం త్రిపుల్‌ఆర్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మూడేళ్లలో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉండటంతో మళ్లీ ఒక్కసారిగా సందడి పెరిగింది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు మొదటి దశ త్రిపుల్‌ఆర్‌ ఉత్తరభాగానికి కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. భూసేకరణ ప్రక్రియ వేర్వేరు దశల్లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నాయి. చౌటుప్పల్‌, ఆమనగల్లు, షాద్‌నగర్‌, చేవేళ్ల, సంగారెడ్డి వరకు దక్షిణ భాగానికి జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

శాటిలైట్‌  టౌన్‌షిప్పులు..

సకల సదుపాయాలు ఉండేలా నిర్మించే శాటిలైట్‌ టౌన్‌షిప్పుల నుంచి ఎంతోకాలంగా వినపడుతోంది. ఇప్పటివరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. కొత్త ప్రభుత్వం శాటిలైట్‌ టౌన్‌షిప్పుల ఆలోచనలు చేస్తోంది. ఓఆర్‌ఆర్‌, ట్రిపుల్‌ ఆర్‌ మధ్యన వీటిని ప్రోత్సహించనున్నట్లు చెబుతోంది. ఇక్కడ ప్రత్యేక థీమ్‌లతో సిటీల ఏర్పాటు ఆలోచనను సర్కారు చేస్తోంది. ఈ ప్రాంతాల నుంచి సిటీకి సులువుగా చేరుకునేలా రవాణా సదుపాయాలు కల్పిస్తామంటోంది. ఫార్మాసిటీ కోసం ముచ్చర్ల, యాచారంలో సేకరించిన 20 వేలకు పైగా ఎకరాల భూముల్లో రెండు మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా విలేజ్‌, 15 ఎకరాల్లో డ్రోన్‌ఫోర్ట్‌, కాలుష్యరహిత పరిశ్రమలు, ఐటీ సంస్థలను ప్రోత్సహించే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. విమానాశ్రయం నుంచి ఈ ప్రాంతానికి మెట్రో అనుసంధానాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. మౌలిక వసతుల కల్పనతో ఆయా ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్‌ గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు.

అన్నివైపులకు విస్తరించేలా..

నివాసాలకు కేంద్రంగా మారిన పటాన్‌చెరు నుంచి ఐటీ కారిడార్‌కు ఓఆర్‌ఆర్‌ అనుసంధానం మెరుగ్గా ఉంది. మెట్రోని మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు 14 కి.మీ. మేర పొడిగించే ప్రతిపాదనను కొత్త సర్కారు ఆమోదించింది. దీంతో ఈ ప్రాంతంలో మరింతగా నివాసాలు రానున్నాయి. నిర్మాణ రంగం మరింతగా పుంజుకుంది. ఐఐటీ కంది వరకు విస్తరించిన సిటీ సంగారెడ్డిని కూడా త్వరలోనే కలిపేసుకోనుంది.

  • దక్షిణం వైపు బుద్వేల్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టుకు భూ కేటాయింపు అనగానే ఆ ప్రాంతంలో స్థలాల ధరలు పెంచేశారు. గజం మొన్నటివరకు రూ.70వేలు ఉండగా.. ఇప్పుడు లక్ష చెబుతున్నారని  ఆ ప్రాంత వాసి ఒకరు తెలిపారు. జల్‌పల్లి మార్గంలోనూ భూముల ధరలు అమాంతం పెరిగాయి. నాగోల్‌ నుంచి వచ్చే మెట్రో చంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఒకటి జల్‌పల్లి మీదుగా విమానాశ్రయం వెళితే.. మరొకటి మైలార్‌దేవ్‌పల్లి నుంచి దుర్గానగర్‌, ఆరాంఘర్‌ మీదుగా కొత్త హైకోర్టు వరకు వస్తుంది. దక్షిణంలో ఇటీవల మొదలైన ఆకాశహర్మ్యాల భవనాల పోకడ.. మెట్రోతో మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం రెసిడెన్షియల్‌ హబ్‌గా మారబోతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని