మగర్‌పట్టా సిటీని చూసొద్దామా!

మగర్‌పట్టా సిటీ... పుణెలోని హడప్సర్‌ ప్రాంతంలో 440 ఎకరాల టౌన్‌షిప్‌ ఇది.. ఇక్కడ వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలు, అనేక సౌకర్యాలతో కూడిన ఆసుపత్రి, షాపింగ్‌, మాల్స్‌, రెస్టారెంట్లు, జిమ్‌, గార్డెన్‌, పాఠశాలలు వంటి సోషల్‌ ఇన్‌ఫ్రా కల్గి ఉంది.

Published : 02 Mar 2024 03:22 IST

మగర్‌పట్టా సిటీ... పుణెలోని హడప్సర్‌ ప్రాంతంలో 440 ఎకరాల టౌన్‌షిప్‌ ఇది.. ఇక్కడ వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలు, అనేక సౌకర్యాలతో కూడిన ఆసుపత్రి, షాపింగ్‌, మాల్స్‌, రెస్టారెంట్లు, జిమ్‌, గార్డెన్‌, పాఠశాలలు వంటి సోషల్‌ ఇన్‌ఫ్రా కల్గి ఉంది. దేశానికే రోల్‌ మోడల్‌గా ఈ గేటెడ్‌ కమ్యూనిటీని అభివృద్ధి చేశారని నిర్మాణ రంగ ప్రతినిధులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ ఇది. మన దగ్గర చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీహెచ్‌ఈఎల్‌, డీఆర్‌డీవో టౌన్‌షిప్‌లు వంటివి వందల ఎకరాల్లో ఎన్నో వచ్చాయి. ప్రైవేటు ఆధ్వర్యంలో చెప్పుకోతగ్గది ఒక్కటంటే ఒక్కటీ రాలేదు. టౌన్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. కొత్త సర్కారు సైతం శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు సుముఖంగా ఉంది. కొన్ని నిర్మాణ సంస్థలు.. టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ బిల్డర్ల నోటి వెంట వినపడే మగర్‌పట్టా సిటీని చూసొద్దామా!

పుణె నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ సిటీ ఉంటుంది. ఎవరో పెద్ద బిల్డర్‌ నిర్మించారు అనుకుంటే పొరపాటే. రాజకీయ కుటుంబంలో పుట్టిన సతీష్‌ మగర్‌కి 1993లో వచ్చిన ఆలోచన ఇది. ఆయన వ్యవసాయ విద్య చదివారు. కొన్నాళ్లు వ్యవసాయం చేశారు. లాభసాటిగా లేకపోవడంతో రైతులు భూములను కొద్దికొద్దిగా బిల్డర్లకు అమ్మడం గమనించారు. ఇది ఇలాగే కొనసాగితే రైతుల చేతుల్లో భూములు ఉండవని గ్రహించారు. అప్పటికే ఆ ప్రాంతాన్ని అర్బన్‌ జోన్‌ చేసేందుకు ముసాయిదా సిద్ధమైంది. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ వంటి భయాలు రైతుల్లో ఉండేవి. రైతులను ఒప్పించి, ప్రభుత్వం నుంచి అనుమతి పొంది 2000లో పనులు మొదలెట్టారు. రైతుల నుంచి భూములను ల్యాండ్‌పూలింగ్‌ చేసి చేపట్టిన ప్రాజెక్ట్‌ కావడంతో వారు కూడా సిటీకి యజమానులే. ఈ సిటీ 2008లో సిడ్నీ కాంగ్రెస్‌ ఆఫ్‌ మెట్రోపొలిస్‌ ప్రశంసలు అందుకుంది. అప్పట్లోనే మహారాష్ట్ర ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ రాష్ట్రంలోని టాప్‌ 10 విజయగాథల జాబితాలో ఈ నగరాన్ని చేర్చింది.

దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌  స్ఫూర్తితో..

సువిశాలమైన టౌన్‌షిప్‌లో 538 ఇళ్ల సముదాయాలు, 34 వాణిజ్య నిర్మాణాలు, పాఠశాలలు, ఆసుపత్రుల కోసం 8 భారీ భవనాలు ఉన్నాయి. ఈ నగరం వరకు ఒక బృహత్‌ ప్రణాళికను రూపొందించి సుస్థిరాభివృద్ధికి నిర్వచనంగా చేపట్టారు. ప్యారిస్‌ నగరం, దిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ మాస్టర్‌ప్లాన్‌ స్ఫూర్తితో డిజైన్‌ చేశారు.

నిధుల కోసం  తిప్పలు పడినా..

చేతిలో భూమి ఉంది కానీ నిర్మాణాలు చేపట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. నిధుల కోసం చాలా బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఆలోచన మంచిదే కానీ లాభసాటేనా? అనేవారు. ఇలాగే ఏడేళ్లు గడిచిపోయాయి. చివరికి ఎలాగోలా నిర్మాణాలు మొదలెట్టి విక్రయాలు చేపట్టారు. రైతుల పిల్లలు ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అయ్యారు. వారికి వచ్చిన పనిని చేసి ఆ మేరకు ప్రతిఫలం తీసుకునేవారు. ఒకరు మట్టిపని, ఇంకొకరు నిర్మాణం, గార్డెనింగ్‌ చూసేవారు. తర్వాత వీరంతా ఔత్సాహికవేత్తలుగా ఎదిగారు. ప్రాజెక్ట్‌లో మిగతా నిర్మాణాలను విక్రయించినా ఐటీ పార్క్‌ను రైతులే అట్టిపెట్టుకున్నారు. దీన్నుంచి వారికి స్థిరమైన ఆదాయం వస్తోంది.

నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్లేలా..

టౌన్‌షిప్‌లో నివాసం ఉండేవారి అన్ని అవసరాలు స్థానికంగా తీరేలా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. పిల్లల కోసం రెండు పాఠశాలలు ఉన్నాయి. వైద్యం కోసం సకల సౌకర్యాలు కల్గిన ఆసుపత్రి ఉంది. వినోదం, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, బ్యాంకింగ్‌ సేవలు చేరువలోనే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఉపాధి లేకపోతే మళ్లీ సిటీలోకి వెళ్లాల్సిందే కదా! అమెరికాలోని శాన్‌ జోస్‌ సిటీ, శాంతా క్లారా కౌంటి నుంచి వాక్‌ టు వర్క్‌ కాన్సెస్ట్‌ను తీసుకున్నారు. ఐటీ పార్క్‌లను టౌన్‌షిప్‌లో డిజైన్‌ చేశారు. వివిధ రంగాలకు చెందిన అన్ని కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఇంటి నుంచి నడుచుకుంటూ ఉద్యోగులు కార్యాలయానికి వెళతారు. పచ్చని చెట్ల నీడన కాలిబాటలు ఏర్పాటు చేశారు. వర్షం నీరు పడినచోటే ఇంకిపోయే విధంగా ఇంకుడుగుంతల తరహాలో తీర్చిదిద్దారు. ట్రాఫిక్‌ భయం లేకుండా నివాసితులు సైకిళ్లు ఎక్కువగా వాడతారు. కాలుష్య సమస్యకు తావుండదు.

సేద తీరేలా..

వేల మంది నివసించే టౌన్‌షిప్‌లో పచ్చదనానికి పెద్దపీట వేశారు. 30శాతం ఖాళీ జాగాలు వదిలి పార్క్‌లను అభివృద్ధి చేశారు. ఉదయం, సాయంత్రం వేళ అక్కడే హాయిగా సేద తీరవచ్చు. కసరత్తులు చేసేవారికి జిమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వేడుకల కోసం కన్వెన్షన్‌ హాల్స్‌ ఉన్నాయి.

అన్ని వర్గాలకు తగ్గట్టుగా..

టౌన్‌షిప్‌లో అన్ని వర్గాలకు తగ్గట్టుగా గృహ నిర్మాణాలు ఉన్నాయి. ఒక పడక గది నుంచి 3 పడక గదుల వరకు అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టారు. విల్లా క్లస్టర్లు ఉన్నాయి. ఇక్కడ రో హౌసెస్‌, గార్డెన్‌ బంగ్లాస్‌ పేరుతో భిన్న థీమ్‌లతో నిర్మించారు. కాస్మోపాలిటన్‌ వలె ఉన్నప్పటికీ సంప్రదాయ నివాసాల్లో మాదిరి ఫ్లాట్‌లను.. ముంబయిలోని చాల్స్‌ను పోలిన ఫ్లాట్‌ తరహాలో  డిజైన్‌ చేశారు. అపార్ట్‌మెంట్లలో ఇరుగుపొరుగు వారితో సంబంధాలు లేవనే భావన ఉండకూడదని ఇలా  రూపొందించారు. అక్కడ ఉంటున్న వారు ఎవరైనా 10 రోజులు మాట్లాడకుండా ఒకరినొకరు గడపవచ్చు.. కానీ, 11వ రోజు కనీసం నవ్వుతారని డిజైన్‌ చేసినప్పుడే చెప్పడం విశేషం.

ఈ టౌన్‌షిప్‌లో పలు సినిమాల షూటింగ్‌లు జరుగుతుంటాయి. తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ శివాజీ సినిమా పతాక సన్నివేశం ఇక్కడి సెజ్‌ టవర్లలోనే తీశారు. తెలుగు సినిమా మిర్చిలోని యాక్షన్‌ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. దేశంలోనే టౌన్‌షిప్‌లకు మగర్‌పట్టా రోల్‌ మోడల్‌ అని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు వి.రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని