కట్టుబడిలో మార్పులు చేర్పులు

కాలంతో పాటు గృహ కొనుగోలుదారుల అవసరాలు మారుతున్నాయి. వీటిని గుర్తించి ఎప్పటికప్పుడు తమ ప్రాజెక్టులను మెరుగు పర్చేందుకు బిల్డర్లు ఉత్సాహం చూపిస్తుంటారు. కొత్త సదుపాయాల కల్పన దగ్గర్నుంచి.. నూతన సాంకేతికతల వినియోగం దాకా వీటిలో ఉంటున్నాయి.

Published : 16 Mar 2024 04:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాలంతో పాటు గృహ కొనుగోలుదారుల అవసరాలు మారుతున్నాయి. వీటిని గుర్తించి ఎప్పటికప్పుడు తమ ప్రాజెక్టులను మెరుగు పర్చేందుకు బిల్డర్లు ఉత్సాహం చూపిస్తుంటారు. కొత్త సదుపాయాల కల్పన దగ్గర్నుంచి.. నూతన సాంకేతికతల వినియోగం దాకా వీటిలో ఉంటున్నాయి.

అవసరమైనప్పుడు మార్చుకునేలా...: నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణాల్లో మెవాన్‌ సాంకేతికతతో నిర్మాణాలు చేపడుతున్నారు. శ్లాబులే కాదు బయటి, లోపలి గోడలు సైతం కాంక్రిట్‌తోనే నిర్మిస్తారు. దీంతో పనులను వేగంగా పూర్తిచేయవచ్చు. ఇటీవల విల్లాలను సైతం ఇదే పద్ధతిలో కడుతున్నారు. సిమెంట్‌ ఇటుకలతో సరైన నాణ్యత రావడం లేదనే ఫిర్యాదులతో మెవాన్‌ సాంకేతికతను వినియోగిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఇంటిలోపల మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఎలా? అందుకే బిల్డర్లు కొత్త ఆలోచన చేస్తున్నారు. బయటి గోడల వరకు మెవాన్‌ సాంకేతికతతో కాంక్రీట్‌ గోడలను నిర్మించి.. లోపలి గోడలను ఇటుకలతో కట్టాలనే నిర్ణయానికి వస్తున్నారు. తుక్కుగూడ సమీపంలో చేపడుతున్న ఒక విల్లా ప్రాజెక్ట్‌లో ఈ తరహా నిర్మాణాలు చేపట్టబోతున్నారు.  

హైబ్రీడ్‌  హోమ్స్‌.. : ఇటీవల కాలంలో హైబ్రీడ్‌ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్‌ రంగంలో బాగా ప్రాచుర్యం పొందింది. పెట్రోలు, డీజిల్‌తో పాటు విద్యుత్తు బ్యాటరీతోనూ నడుస్తోంది. ఎక్కువ మైలేజీ వస్తుంది. పూర్తి విద్యుత్తు బ్యాటరీతో నడిచే వాహనాలతో పోలిస్తే హైబ్రీడ్‌ వాహనాలకు ఎక్కువ ఆదరణ ఉంది. ఇంటి నిర్మాణంలోనూ కొందరు బిల్డర్లు హైబ్రీడ్‌ హోమ్స్‌ నిర్మాణం చేస్తున్నారు. పార్కింగ్‌ కేంద్రాల్లో భవిష్యత్తు కోసం విద్యుత్తు ఛార్జింగ్‌ పాయింట్లు ఇస్తున్నారు. ఈ తరహాలో పలు కొత్త సౌకర్యాలతో హైబ్రీడ్‌ హోమ్స్‌ నిర్మిస్తున్నట్లు నల్లగండ్లలోని ఒక నిర్మాణ సంస్థ తెలిపింది.

ప్రతిస్పందన ఆధారంగా ..

గేటెడ్‌ కమ్యూనిటీల్లో వందల రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. వేటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు? ఇప్పుడు ఉన్న వాటిలో ఉపయోగంలో లేనివి ఏవి? వీటి గురించి బిల్డర్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కట్టామా.. అసోసియేషన్లకు అప్పగించామా అనే ధోరణిలోనే ఉండేవారు. ఇటీవల కాలంలో వీరు నివాసితుల నుంచి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పాలంటే పరిశోధననే చేస్తున్నారు. ఇంటిలోపల పడక గది పెద్దగా ఉండాలా? లివింగ్‌రూమ్‌ విశాలంగా ఉండాలా? తలుపులు, కిటికీల ఎత్తు ఎంత ఉండాలి వరకు ప్రతి చిన్న  విషయంపై ఆరాతీస్తున్నారు. వీటి ఆధారంగా కొత్త ప్రాజెక్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లో ఒక నిర్మాణ సంస్థ ఈ విషయంలో ఎక్కువ కసరత్తు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని