ఇల్లు కొనుగోలుకుఉప్పల్‌, ఎల్బీనగర్‌ వైపు చూపు

సిటీలో మధ్యతరగతి వర్గాలు అందుకోగల ధరల స్థాయిలో గృహ నిర్మాణం ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఈస్ట్‌ హైదరాబాద్‌ ఒకటి. అన్ని వర్గాలకు తగ్గ బడ్జెట్‌లో ఉప్పల్‌, ఎల్బీనగర్‌ చుట్టుపక్కల బహుళ అంతస్తుల ఆవాసాలు, విల్లాలు కడుతున్నారు. మెట్రో రాకతో రవాణా సదుపాయాలు మెరుగయ్యాయి.

Updated : 30 Mar 2024 12:24 IST

అన్ని వర్గాలకు తగ్గ గృహ నిర్మాణాల లభ్యత
తూర్పున రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ వేగంగా అభివృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: సిటీలో మధ్యతరగతి వర్గాలు అందుకోగల ధరల స్థాయిలో గృహ నిర్మాణం ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఈస్ట్‌ హైదరాబాద్‌ ఒకటి. అన్ని వర్గాలకు తగ్గ బడ్జెట్‌లో ఉప్పల్‌, ఎల్బీనగర్‌ చుట్టుపక్కల బహుళ అంతస్తుల ఆవాసాలు, విల్లాలు కడుతున్నారు. మెట్రో రాకతో రవాణా సదుపాయాలు మెరుగయ్యాయి. శిల్పారామం వంటి సామాజిక వసతులు సమకూరాయి. పేరున్న పాఠశాలలు, విద్యాసంస్థలు చేరువలోనే ఉన్నాయి. ట్రాఫిక్‌ సమస్యల నుంచి బయటపడేసే ఫ్లైఓవర్లు వచ్చాయి. ఎక్స్‌ప్రెస్‌ వేలు నిర్మాణంలో ఉన్నాయి. అధునాతన టర్మినల్‌ రైల్వే స్టేషన్‌తో రవాణా వ్యవస్థ మరింత చేరవ కానుంది. ఇప్పటికే కొన్ని మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు ప్రారంభం కాగా.. మరిన్ని నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాయి. వరంగల్‌, విజయవాడ, సాగర్‌ రహదారులకు అటుఇటుగా తూర్పు హైదరాబాద్‌లో రియల్‌ ఊపందుకుంటోంది.

పలు మైక్రో మార్కెట్లు

తూర్పు హైదరాబాద్‌లో గృహ నిర్మాణాలకు పలు మైక్రో మార్కెట్‌లు అభివృద్ధి చెందాయి. ఇక్కడ అన్ని వర్గాల బడ్జెట్‌కు తగ్గా ఫ్లాట్‌లు, సమీపంలో విల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. గృహ  ప్రవేశానికి సిద్ధంగా ఉన్న స్థిరాస్తులు అందుబాటులో ఉన్నాయి.స్థలాల లభ్యత ఉంది.

  • మైక్రోమార్కెట్‌లో చెప్పుకోతగ్గ వాటిలో పోచారం, ఘట్‌కేసర్‌ ఒకటి. ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం పూర్తయితే ఆటంకాలు లేకుండా నేరుగా సిటీలోకి చేరుకోవచ్చు. మెట్రోలో గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. పక్కనే ఉండే అవుటర్‌తో దూరప్రాంతాలకు చేరుకోవచ్చు.
  • తూర్పులో ఉన్న మరో మార్కెట్‌ ఆదిభట్ల. ఇక్కడ సైతం మధ్యతరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో ఫ్లాట్‌లు ఉన్నాయి. చుట్టుపక్కల విల్లాల నిర్మాణం జరుగుతోంది. వెంచర్లలో స్థలాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అవసరాలు, బడ్జెట్‌ను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. అవుటర్‌ పక్కనే ఉండటం, ఐటీ, ఏరో సెజ్‌లు ఉండటం ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. విద్యాసంస్థలు చేరువలో ఉన్నాయి.

గేటెడ్‌ కమ్యూనిటీలు పెరిగాయ్‌

తూర్పు హైదరాబాద్‌లో కొందామంటే ఇదివరకే గేటెడ్‌ కమ్యూనిటీల లభ్యత తక్కువగా ఉండేది. ఇటీవల వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉప్పల్‌లో స్టేడియం చుట్టుపక్కల, ఉప్పల్‌ భగాయత్‌లో ఆకాశహార్మ్యాలే వస్తున్నాయి. బడ్జెట్‌ను బట్టి ఎంపికకు ఇక్కడ అవకాశం ఉంది.

  • ఎల్బీనగర్‌, కర్మన్‌ఘాట్‌, వనస్థలిపురం, సాగర్‌రోడ్డులోనూ గేటెడ్‌ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి. చెప్పుకోతగ్గ సంఖ్యలో విల్లా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. జనావాసాలకు కాస్త దూరంగా ఉన్నా.. చుట్టూ ఇళ్లు వచ్చేందుకు ఎంతోకాలం పట్టదని రియల్టర్లు అంటున్నారు.
  • ఇదివరకే పేరున్న సంస్థలు ఒకటి రెండు మినహా పెద్దగా లేవు. ఇప్పుడు గేటెడ్‌ కమ్యూనిటీలను కడుతున్నవాటిలో అత్యధికం బడా సంస్థలే. ఇతర ప్రాంతాలతో పాటూ తూర్పులో డిమాండ్‌ ఉండటంతో ఇక్కడ తమ ప్రాజెక్ట్‌ల విస్తరణ చేపట్టారు.

మున్ముందు మరింత విస్తరణ

తూర్పులోనూ అందుబాటు ధరల్లో ఇళ్లు కావాలంటే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి అవుటర్‌ దాకా వెళ్లొల్సి వస్తోంది. మార్కెట్‌ ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ సమయంలో ఇల్లు అవసరం ఉన్న వారు కొనుగోలు చేయడం ఉత్తమం అని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. బిల్డర్‌తో బేరమాడేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మార్కెట్‌లో పరుగు మొదలైతే అది ధరలపైన ప్రభావం ఉంటుంది. కాబట్టి మీ బడ్జెట్‌కు తగ్గ స్థలం, ఫ్లాట్‌, విల్లా అన్వేషణ మొదలెట్టవచ్చు. సౌకర్యాలు, సదుపాయాలు, నిర్మాణాలు, సెట్‌బ్యాక్‌లను బట్టి ఫ్లాట్‌ల ధరలు రూ.40 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు చెబుతున్నారు. ఇంతకంటే ఖరీదైనవి ఉన్నా చాలా పరిమితం.

ప్రీమియం వస్తున్నాయ్‌

బడ్జెట్‌ అవాసాలే కాదు కొత్తగా ప్రీమియం ప్రాజెక్ట్‌లను కొన్ని సంస్థలు ఇక్కడ చేపట్టాయి. ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకటే ఫ్లాట్‌ వచ్చేలా కూడా కడుతున్నారు. ఈ ప్రాంతంలోనూ ప్రీమియం గృహ నిర్మాణానికి మంచి స్పందనే వస్తోందని విలాసవంతమైన ప్రాజెక్ట్‌ను ఇటీవలే మొదలెట్టిన బిల్డర్‌ ఒకరు ‘ఈనాడు’తో అన్నారు.

కొనుగోలుదారుల్లోనూ సానుకూలత

పశ్చిమ హైదరాబాద్‌లో రెండు పడకల గదుల ఫ్లాట్‌ ధరకే తూర్పులో విలాసవంతమైన, విశాలమైన ఫ్లాట్‌ వస్తుండటంతో కొనుగోలుదారులు సైతం ఇటువైపు చూస్తున్నారు.

స్థానికులు, చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి ఉప్పల్‌, ఎల్బీనగర్‌ చుట్టుపక్కల స్థిరపడినవారే కాదు ఇతర ప్రాంతాల చెందినవారు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు.

చాలా ప్రాజెక్ట్‌లు వస్తున్నాయ్‌

ఇప్పటికే సదుపాయాలన్నీ ఉన్న చోట నిర్మిస్తున్న ఆవాసాల ధరలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. అలాంటి చోట కొనడానికి తమ బడ్జెట్‌ సహకరించడం లేదని భావించేవారు.. కాస్త దూరం వెళితే మంచి స్థిరాస్తిని సొంతం చేసుకోవచ్చు.

  • మూసీపై పలు వంతెనలు రాబోతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వేలు, చర్లపల్లి రైల్వే టర్మినల్‌ స్టేషన్లు, మూసీ అభివృద్ధి, మెట్రోరైలు విస్తరణ వంటివాటి చుట్టుపక్కల పరిశీలించవచ్చు.
  • ఒకప్పటి పారిశ్రామిక ప్రాంతాలు క్రమంగా నివాస కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎక్కడెక్కడ ఇవి వస్తున్నాయో గమనించవచ్చు.
  • కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సిటీ అన్నివైపుల అభివృద్ధి చేయాలనే ఆలోచన చేస్తోంది. తూర్పు హైదరాబాద్‌ పైన తమకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయని..వాటిని అమలు చేస్తామని చెబుతోంది. ఇవన్నీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటూ నివాస ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని