పెరుగుతూనే ఉన్నాయ్‌

జనవరి, ఫిబ్రవరి మార్చి.. మూడు నెలల కాలం.. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఆశాజనకమైన వృద్ధి కన్పించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే చదరపు అడుగు ధరల్లో వార్షిక పెరుగుదల 13 శాతం నమోదైంది.

Updated : 06 Apr 2024 09:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: జనవరి, ఫిబ్రవరి మార్చి.. మూడు నెలల కాలం.. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఆశాజనకమైన వృద్ధి కన్పించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే చదరపు అడుగు ధరల్లో వార్షిక పెరుగుదల 13 శాతం నమోదైంది. ధరల పరంగా దేశంలోనే అత్యధిక పెరుగుదల ఇక్కడ నమోదైంది. ఇళ్లు కొన్నవాళ్లు ధరల వృద్ధితో ఆస్తి విలువ పెరిగిందని సంతోషిస్తుంటే.. సొంతింటి వేటలో ఉన్నవారు మాత్రం ఇంతలా పెరిగితే కొనేదెలా అంటున్నారు.

హైదరాబాద్‌, బెంగళూరు ఐటీ రంగంలో పోటీపడుతుంటాయి. రియల్‌ ఎస్టేట్‌ పోకడలు సైతం ఒకేలా ఉంటాయి. ఈ రెండు నగరాల్లో రూ.50 లక్షల లోపు విలువైన ఇళ్ల విక్రయాలు నిరాశజనకంగా ఉన్నాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. వీటి విక్రయాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. గత ఏడాది త్రైమాసికంతో పోలిస్తే హైదరాబాద్‌లో 30 శాతం, బెంగళూరులో 68 శాతం తగ్గాయి. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా కూడా వృద్ధి ప్రతికూలంగా మైనస్‌ 10 శాతంగా ఉంది. ముంబయిలో 13 శాతం, కోల్‌కతాలో 3 శాతం పెరగడం విశేషం.

  • ఈ విభాగంలో లభ్యత తక్కువగా ఉందని కొనుగోలుదారులు వాపోతుంటారు. కట్టిన ప్రాజెక్ట్‌లోనూ విక్రయాలు నిరాశజనకంగా ఉన్నాయని బిల్డర్లు అంటున్నారు. ఇరువురికీ ఇప్పుడు మంచి అవకాశం.

అధిక ధరలవే కొంటున్నారు

స్థిరాస్తి మార్కెట్‌లో కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన ఇళ్లనే కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలల్లో ఈ విభాగంలోనే 6,112 ఇళ్లను విక్రయించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 65 శాతం పెరిగాయి. బెంగళూరులో 62 శాతం పెరిగాయి. ముంబయిలో 259 శాతం, పుణెలో 120 శాతం పెరగగా... అహ్మదాబాద్‌లో 85 శాతం వృద్ధి నమోదైంది. కోల్‌కతా, దిల్లీలో మాత్రమే రూ.కోటి కంటే ఎక్కువ విలువైన ఇళ్ల విక్రయాలు గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే తగ్గాయి.

మూడు నెలల్లో..

అందుబాటు, విలాసవంతం.. ఇలా అన్ని విభాగాల్లో కలిపి తొలి మూడు నెలల్లో 9550 ఇళ్లు హైదరాబాద్‌లో విక్రయించారు. గత ఏడాది ఇదే సమయంలోని విక్రయాలతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది.  

  • కొత్త ప్రాజెక్టుల ప్రారంభాల్లో కూడా 10 శాతం వృద్ధి నమోదైంది. 4350 యూనిట్లను వేర్వేరు ప్రాజెక్ట్‌ల్లో ప్రారంభించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని