తుక్కుగూడ.. శ్రీశైలం దారిలో..

గంట వ్యవధిలో విమానాశ్రయానికి చేరుకునే రవాణా సదుపాయం.. పేరున్న విద్యాసంస్థలకు నిలయం.. ఫార్మాసిటీ స్థానంలో టౌన్‌షిప్‌ల అభివృద్ధికి సర్కారు ప్రణాళికలు.. ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారితో మున్ముందు మరింత అభివృద్ధి.. ఉపాధి కల్పించే పలు పరిశ్రమలు..

Updated : 13 Apr 2024 10:22 IST

గంట వ్యవధిలో విమానాశ్రయానికి చేరుకునే రవాణా సదుపాయం.. పేరున్న విద్యాసంస్థలకు నిలయం.. ఫార్మాసిటీ స్థానంలో టౌన్‌షిప్‌ల అభివృద్ధికి సర్కారు ప్రణాళికలు.. ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారితో మున్ముందు మరింత అభివృద్ధి.. ఉపాధి కల్పించే పలు పరిశ్రమలు.. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే క్లస్టర్లతో శ్రీశైలం రహదారి మార్గంలో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు ఇటీవల పుంజుకున్నాయి. విల్లా ప్రాజెక్ట్‌లకు ఈ ప్రాంతం చిరునామాగా మారింది. ఫామ్‌ ల్యాండ్లు, పెద్ద ఎత్తున లేఅవుట్లు వచ్చాయి. ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల బహుళ అంతస్తుల నిర్మాణాలు మొదలయ్యాయి. భవిష్యత్తు అవసరాలకు ఈ మార్గంలో కొనుగోలుదారులు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రియల్టర్లు అంటున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

బాహ్య వలయ రహదారి ఎగ్జిట్‌ నంబరు 14 తుక్కుగూడ నుంచి శ్రీశైలం మార్గం మొదలవుతుంది. శంషాబాద్‌ తర్వాత విమానాశ్రయానికి చేరువలో ఉన్న పట్టణం ఇదే కావడం.. ఫ్యాబ్‌ సిటీతో ఉపాధి అవకాశాలు పెరగడం.. తదితర కారణాలతో ఇటీవల గృహాలకు డిమాండ్‌ పెరిగింది. వ్యక్తిగత ఇళ్లే తప్ప బహుళ అంతస్తుల భవనాలు ఇటీవల వరకు లేవు. ఇప్పుడే ఏకంగా ఆకాశహర్మ్యాలే వస్తున్నాయి. విల్లా ప్రాజెక్ట్‌లు కనిపిస్తున్నాయి. భూముల ధరలు పెరగడంతో పలు సంస్థలు అపార్ట్‌మెంట్ల నిర్మాణాలను చేపట్టాయి.

మహేశ్వరం మార్గంలో.. : తుక్కుగూడ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఎడమవైపు టౌన్‌షిప్పులు, పేరున్న విద్యాసంస్థలు ఉన్నాయి. విల్లా ప్రాజెక్టులు వచ్చాయి. లేమూరులో హెచ్‌ఎండీఏ వెంచర్లతో ప్రైవేటు సంస్థలు.. పెద్ద ఎత్తున లేఅవుట్లు చేశాయి. ఇక్కడి నుంచి రంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకోవచ్చు. భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతంగా రియల్టర్లు చెబుతున్నారు.

శ్రీశైలం రహదారి గేటు నుంచి మహేశ్వరం వరకు గతంలోనే పెద్ద ఎత్తున వెంచర్లు వెలిశాయి. ఇటీవల ఆయా స్థలాల్లో నిర్మాణాలు మొదలవుతున్నాయి. చుట్టుపక్కల పలు పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరిగాయి.

ఫార్మాసిటీ దారిలో...

కందుకూరు చుట్టుపక్కల ఫార్మా సిటీ పేరుతో వెంచర్లు, టౌన్‌షిప్‌ ప్రాజెక్ట్‌లు వచ్చాయి. ఇటీవల వీటికి మరిన్ని జతయ్యాయి. ఫార్మాసిటీ రద్దుతో కొంత డీలా పడినా, ఆ స్థలాల్లో టౌన్‌షిప్పులు అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో మళ్లీ మార్కెట్‌లో కదలిక వచ్చింది.

  • ప్రాంతీయ వలయ రహదారి ప్రతిపాదనలు ఉండటంతో దీని ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై ఎక్కువగా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రంగానే భూ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. కడ్తాల, మైసిగండి, ఆమన్‌గల్‌ చుట్టుపక్కల ఇప్పటికే పలుచోట్ల లేఅవుట్లు రాగా, మున్ముందు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. 
  • శ్రీశైలం జాతీయ రహదారిని నంద్యాల వరకు పొడిగిస్తుండటంతో జాతీయ రహదారి విస్తరణ ప్రభావం కల్వకుర్తి వరకు ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెడుతున్నారు.

సమీకృత పట్టణాలుగా...

లేఅవుట్లను ఇటీవల కాలంలో సాదాసీదా కాకుండా సమీకృత పట్టణాలుగా అభివృద్ధి చేస్తున్నారు. 300 నుంచి వెయ్యి ఎకరాల పైగా విస్తీర్ణంలో ఒక్కో వెంచర్‌ ఉంటుంది. ఇందులో ఓపెన్‌ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వాణిజ్య నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ప్రత్యేకంగా విభజించి విక్రయిస్తున్నారు. అక్కడే పాఠశాల, ఆసుపత్రి ఉండేలా, క్రీడా సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టి అమ్ముతున్నారు. వినోద కేంద్రాలు, కమ్యూనిటీ లివింగ్‌కు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో గడిపేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నారు. శ్రీశైలం రహదారిలోనే బాహ్యవలయ రహదారి నుంచి ప్రాంతీయ వలయ రహదారి వరకు ఈ తరహాలో నాలుగైదు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. సాధారణ వెంచర్లతో పోలిస్తే.. వీటిలో భూముల ధరలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. ఇక్కడి జీవనశైలి, రాబడి కూడా అదే స్థాయిలో ఉంటుందని డెవలపర్లు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని