జీవశాస్త్రాల వైపు రియల్‌ సంస్థలు

ఐటీ, ఫార్మా కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌పరంగా కమర్షియల్‌ స్పేస్‌లో మార్పులొస్తున్నాయి. ఇప్పటికీ ఐటీ కార్యాలయాల వాటానే అధికంగా ఉన్నప్పటికీ.. కొవిడ్‌ తర్వాత కొత్త అవకాశాల వైపు అంతర్జాతీయ సంస్థలు దృష్టి పెట్టాయి.

Published : 25 Feb 2023 01:08 IST

విస్తరణ దిశగా ప్రణాళికలు
ఈనాడు, హైదరాబాద్‌

టీ, ఫార్మా కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌పరంగా కమర్షియల్‌ స్పేస్‌లో మార్పులొస్తున్నాయి. ఇప్పటికీ ఐటీ కార్యాలయాల వాటానే అధికంగా ఉన్నప్పటికీ.. కొవిడ్‌ తర్వాత కొత్త అవకాశాల వైపు అంతర్జాతీయ సంస్థలు దృష్టి పెట్టాయి. జీవ శాస్త్రాలకు హబ్‌గా ఉన్న సిటీలో ఇటీవల కాలంలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఈ విభాగంలో కార్యాలయాలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్సేస్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. పదేళ్ల నుంచి ఈ రంగంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు విస్తరణపై దృష్టిపెట్టాయి. ప్రధానంగా జీనోమ్‌ వ్యాలీలో అభివృద్ధి చేస్తున్నాయి.

దేశంలోనే జీవశాస్త్రాల్లో అతిపెద్ద పరిశోధన, ఉత్పత్తి కేంద్రంగా శామీర్‌పేటలోని జీనోమ్‌ వ్యాలీ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి 200 కంపెనీలు  3 మిలియన్‌ చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో కొలువుదీరాయి. 15వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీటితో పాటూ మెడికల్‌ డివైజెస్‌, ఫార్మా, ఇతరత్రా కలిపి ఈ రంగం విలువ 50 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో ప్రస్తుతం ఉన్న 4 లక్షల ఉద్యోగాలకు అదనంగా మరో 4లక్షల మందికి కొలువులు వస్తాయని చెబుతోంది. పలు కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఆయా సంస్థలకు అవసరమైన కార్యాలయాలు, ల్యాబ్‌ల పార్క్‌లను తీర్చిదిద్దడంలో రియల్‌ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లో మొదలైన బయో ఆసియా సదస్సులో స్టాళ్లను ఏర్పాటు చేశాయి.


వచ్చే మూడేళ్లలో మరో మిలియన్‌ చదరపు అడుగులకు..
- సుబ్రత కేసీ శర్మ, సీఈవో, లైట్‌హౌజ్‌ కాంటన్‌  

హైదరాబాద్‌లో జీవశాస్త్రాల విభాగంలో 10 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 మిలియన్‌ చ.అ. ఆయా సంస్థల సొంత కార్యాలయాలే ఉన్నాయి. మరో 3 మి.చ.అ. విస్తీర్ణంలోనే తమలాంటి రియల్‌ ఎస్టేట్‌ వ్యవస్థీకృత సంస్థలకు కావాల్సిన కార్యాలయం, ల్యాబ్‌లు నిర్మించి ఇస్తున్నాయి. మా సంస్థ ఇప్పటివరకు 1 మి.చ.అ. విస్తీర్ణంలో ఉంది. 30 కంపెనీలు పనిచేస్తున్నాయి. 15వేల చ.అ నుంచి లక్ష చ.అ. వరకు  ఆయా సంస్థలు విస్తరించి ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో అదనంగా మరొక మి.చ.అ.కు విస్తరించనున్నాం. అంతగా జీవశాస్త్రాల్లో డిమాండ్‌ ఉంది. ఫార్మా హబ్‌గా ఉండటం, మౌలిక వసతులు మెరుగవడం, ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇతర నగరాల నుంచి సిటీకి తరలివస్తున్నాయి. అహ్మదాబాద్‌ నుంచి ఒక కంపెనీ తమ కేంద్రాన్ని హైదరాబాద్‌కు మార్చబోతోంది.ఇదివరకే ఉన్న సంస్థలు విస్తరిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ విభాగంలో స్పేస్‌కు డిమాండ్‌ ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని