పెట్టుబడి.. కట్టుబడి ఇక్కడే

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారింది. నివాసం ఉండేందుకు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు, స్థలాలతో పాటు భవిష్యత్తు దృష్ట్యా భూములపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు.

Updated : 01 May 2023 11:56 IST

నగరం నలుదిశలా స్థిరాస్తి వ్యాపారం
ఈనాడు, హైదరాబాద్‌:  

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారింది. నివాసం ఉండేందుకు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు, స్థలాలతో పాటు భవిష్యత్తు దృష్ట్యా భూములపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. మార్కెట్‌ ప్రస్తుతం స్తబ్ధుగా ఉండటంతో ఇదే అనువైన సమయంగా భావించి కొనుగోళ్లు జరుపుతున్నారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారు, ప్రవాస భారతీయులు స్థిరాస్తుల వైపు చూస్తున్నారు. వృద్ధికి అవకాశం ఉండటం, మెరుగైన రాబడి అంచనాలతో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సైతం హైదరాబాద్‌ భారీగా ఆకర్షిస్తోంది.  

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల ఎక్కువగా స్థిరాస్తి వ్యాపారం కేంద్రీకృతమైనా క్రమంగా నగరవ్యాప్తంగా విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అపార్ట్‌మెంట్లు, లేఅవుట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు భారీగా వెలుస్తున్నాయి. ప్రభుత్వం సైతం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పలు మౌలిక ప్రాజెక్టులను నగర నలుదిశలా చేపడుతోంది. ఇవన్నీ కూడా అవుటర్‌ బయటనే వస్తున్నాయి. దక్షిణం వైపు బుద్వేల్‌లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లేఅవుట్‌ వేయబోతుంది. కోకాపేట మాదిరి ఇక్కడ ఎకరాల విస్తీర్ణంలో భూములను వేలం వేయాలనేది ప్రణాళిక. నివాస భవనాలతో పాటు పలు సంస్థలు ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ఈ భూముల వైపు అందరి చూపు పడింది. సిటీ మధ్యలో మలక్‌పేటలో ఐటీ టవర్‌ను ప్రభుత్వం గతంలో ప్రకటించింది. పోచారంలో ఐటీ మరింతగా విస్తరిస్తోంది. ఉప్పల్‌ పారిశ్రామికవాడల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వీటిలో గృహ నిర్మాణాలు, ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆకాశహర్మ్యాలు కడుతున్నారు. కండ్లకోయలో ఐటీ పార్క్‌ సైతం ఆ చుట్టుపక్కల వృద్ధికి కేంద్రంగా మారింది.  ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ వేర్వేరు దశల్లో ఉన్నాయి. నిర్మాణాలు పూర్తిచేసుకునే సరికి ఆ ప్రాంతాల రూపురేఖలే మారిపోనున్నాయి. కాబట్టి ఒకవైపే కాకుండా అన్నివైపుల స్థిరాస్తుల కొనుగోళ్లు జరుగుతున్నాయి.

మున్ముందు కొనుగోలు చేయలేమని.. : ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నుంచి పది కిలోమీటర్ల వరకు అపార్ట్‌మెంట్ల సంస్కృతి వచ్చేసింది. ఒకప్పుడు ఇక్కడ వ్యక్తిగత ఇళ్లు అందుబాటులో ఉండేవి. అప్పుడు కొనలేకపోయినవారు ఇక ఆలస్యం చేస్తే అపార్ట్‌మెంట్లలో సైతం కొనలేనంత ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అవుటర్‌కు లోపల, బయట విల్లాల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రాంతీయ వలయ రహదారి వస్తుండటంతో వాటి చుట్టుపక్కల లెక్కకుమించి వెంచర్లు వెలిశాయి. ఇక్కడ స్థలాలు, ఫామ్‌ల్యాండ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. ఫార్మాసిటీ, ఏరోసెజ్‌లు, మెడికల్‌ డివైజెస్‌ పార్కులు, ఈ-సిటీ, ఈ-మొబిలిటీ క్లస్టర్లు, డేటా కేంద్రాలు ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల వస్తుండటంతో హైదరాబాద్‌ రియాల్టీ అక్కడిదాకా విస్తరించింది.  

పెద్ద దూరం కాదులే... : సిటీకి ఎనిమిది వైపుల జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధితో అన్నివైపులా ముఖ్యంగా రహదారుల మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. నగరంలో ట్రాఫిక్‌లో అవుటర్‌ దాటడమే కష్టం. ఒక్కసారి ఓఆర్‌ఆర్‌ దాటితే గంటలో యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరం వరకు వెళ్లొచ్చు. అక్కడిదాకా రియాల్టీ విస్తరించింది. ఇక్కడ భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, క్రీడా కేంద్రాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లను (ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌ వృద్ధికి మరికొన్ని సంవత్సరాలు ఢోకా లేదనే భరోసాతో నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఫామ్‌ల్యాండ్స్‌ లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి.

సిటీలోనూ అవకాశాలు.. : నగరం బయట స్థలాలు, విల్లాలు, భూములపై పెట్టుబడులు పెడుతుంటే సిటీ లోపల ఫ్లాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. పిల్లల కోసం ఐటీ కారిడార్‌లో కొనుగోలు చేస్తున్నారు. నగరంలో ఎంతోకాలంగా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినవారు సైతం ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల ఫ్లాట్‌ కొనుగోలు చేసి అక్కడికి మారిపోతున్నారు. కొందరు పెట్టుబడి దృష్ట్యా కొనుగోలు చేసి అద్దెలకు ఇస్తున్నారు. ఆదాయ పన్ను ప్రయోజనాల దృష్ట్యా రెండో ఇల్లుపై మదుపు చేస్తున్నారు. వాణిజ్య, కార్యాలయ భవనాల్లోనూ స్పేస్‌ను కొనుగోలు చేస్తున్నారు.

సీబీఆర్‌ఈ నివేదిక ప్రకారం.. :  హైదరాబాద్‌లో గత నాలుగేళ్లలో విదేశీ సంస్థాగత మదుపర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 0.9 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

* వ్యక్తిగత కొనుగోలుదారులు, చిన్న ఇన్వెస్టర్లు, బ్యాంకులు స్థిరాస్తి రంగంపై పెట్టిన పెట్టుబడులు ఇందుకు కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

తగ్గింపులు, ఆఫర్లు..

గృహరుణ వడ్డీరేట్లు ఇటీవల కాలంలో పెరగడంతో స్థిరాస్తి కొనుగోళ్లలో కొంత స్తబ్ధత ఏర్పడింది. కొనుగోళ్లు ఆశాజనకంగా ఉన్నా ఇదివరకు మాదిరి దూకుడు లేదు. డిమాండ్‌, సరఫరాలో తేడాతో అమ్ముడుపోకుండా మిగిలిపోయే ఫ్లాట్ల (ఇన్వెంటరీ) సంఖ్య కొంత కలవరపాటుకు గురిచేస్తోంది. దీనికి తోడు మార్కెట్లో నగదు లభ్యత తగ్గిపోవడంతో ప్రాజెక్టులకు నిధులు పెద్ద సమస్యగా మారింది. బ్యాంకులు నిబంధనలు కఠినతరం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులనే నమ్ముకున్నాయి. అందుకోసం పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తమ ఇన్వెంటరీని తగ్గించుకునేందుకు పలు రాయితీలను ఇస్తున్నాయి. సాధారణంగా అపార్ట్‌మెంట్లలో పది అంతస్తులు దాటితే ఫ్లోరింగ్‌ రైజింగ్‌ ఛార్జీలంటూ బేసిక్‌ ధరకు అదనంగా చదరపు అడుగుకు వసూలు చేస్తుంటాయి. కానీ ఇప్పుడు ఇలాంటి అదనపు ఛార్జీలేవి ఉండవని కొన్ని సంస్థలు ప్రకటిస్తున్నాయి. స్థలాలు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కూడా తమవే అని అంటున్నాయి. రెండేళ్ల క్రితం ప్రాజెక్ట్‌ ఆరంభంలో ఇచ్చిన ధరకే ఇప్పుడూ ఇస్తున్నామని మరికొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. జీఎస్టీ భారం తామే భరిస్తామని చెబుతున్న నిర్మాణ సంస్థలూ ఉన్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా బుకింగ్‌లపై బంగారు నాణేలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఇంటి విలువలో ఐదు శాతం చెల్లించి మిగతావి నిర్మాణం పూర్తయ్యాక కట్టేలా పలు ఆఫర్లు కొనుగోలుదారులను ఊరిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు