అలా.. విలాసపురంలో..!

సాధారణ అపార్ట్‌మెంట్ల(స్టాండలోన్‌) నుంచి గేటెడ్‌ కమ్యూనిటీలు... ప్రీమియం గేటెడ్‌ దాటి ఇప్పుడు అల్ట్రా ప్రీమియం కమ్యూనిటీలు వస్తున్నాయి. ఇవన్నీ విల్లా ప్రాజెక్టులు కాదు.. అపార్ట్‌మెంట్లే. ఒక్కోటి 5వేల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.

Updated : 12 Aug 2023 10:12 IST

హైదరాబాద్‌లో అల్ట్రా ప్రీమియం   ప్రాజెక్టుల సందడి
5 వేల నుంచి 15 వేల చదరపు   అడుగుల వరకు
ఐటీ కారిడార్‌ నుంచి క్రమంగా    ఇతర ప్రాంతాలకు విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌ : సాధారణ అపార్ట్‌మెంట్ల(స్టాండలోన్‌) నుంచి గేటెడ్‌ కమ్యూనిటీలు... ప్రీమియం గేటెడ్‌ దాటి ఇప్పుడు అల్ట్రా ప్రీమియం కమ్యూనిటీలు వస్తున్నాయి. ఇవన్నీ విల్లా ప్రాజెక్టులు కాదు.. అపార్ట్‌మెంట్లే. ఒక్కోటి 5వేల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 10వేల నుంచి 15వేల అడుగుల విస్తీర్ణంలోనూ కొన్ని సంస్థలు చేపడుతున్నాయి. ఇదివరకు ఐటీ కారిడార్‌లో ఒకటో రెండో ఈ తరహా ప్రాజెక్టులు ఉండేవి. ఇటీవల ఎకరం రూ.వందకోట్లు పలికిన కోకాపేటలో అత్యధికం ఈ తరహా అపార్ట్‌మెంట్లే వస్తున్నాయి. ఐటీ కారిడార్‌లోనే కాదు ఈ ట్రెండ్‌ నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది.

నగరవాసులు కొవిడ్‌ అనంతరం విశాలమైన ఇళ్లవైపు మొగ్గుచూపడం కన్పించింది. కుటుంబ అవసరాల రీత్యా రెండు పడక గదుల నుంచి మూడు పడక గదులవైపు మారారు. ఇవన్నీ కూడా రెండువేల లోపు చ.అ. విస్తీర్ణంలోనివే. తమ కలల గేటెడ్‌ కమ్యూనిటీల్లో కొనడం మొదలెట్టారు. మధ్య తరగతి వర్గాల ఆలోచన ఇలా ఉంటే... మరి అప్పటికే రెండుమూడు వేల చ.అ. విస్తీర్ణంలోని నివాసాల్లో ఉంటున్న ఎగువ మధ్యతరగతి, శ్రీమంతులు.. మరింత విలాసవంతమైన ఇళ్ల వైపు చూడటం మొదలైంది. ఇదివరకైతే వీరంతా విల్లాలకు మొగ్గు చూపేవారు. సిటీ నుంచి చాలాదూరం వెళ్లాల్సి వస్తుండటంతో.. సిటీలోనే విల్లా సదుపాయాలు ఉండే విల్లామెంట్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. స్కైవిల్లాలు కొంటున్నారు.

సిటీలో ఇతర ప్రాంతాలకు...

మొదట గచ్చిబౌలి చుట్టుపక్కల అల్ట్రా ప్రీమియం నివాసాలు వచ్చాయి. రాయదుర్గం, కొండాపూర్‌, పుప్పాలగూడ, నార్సింగిలో ఈ తరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా కోకాపేటలో పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని మొదలైన ప్రాజెక్టులు ఉన్నాయి. కిస్మత్‌పూర్‌లో ఒక సంస్థ 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఫ్లాట్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఎల్బీనగర్‌లో మరో సంస్థ ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. బుద్వేల్‌లోనూ రాబోతున్నాయి. ఇక్కడ ఎకరం గరిష్ఠంగా రూ.40 కోట్లపైన పలికింది.  ఇక్కడ వచ్చేవన్నీ కూడా అల్ట్రా ప్రీమియం ప్రాజెక్టులే అంటున్నారు బిల్డర్లు.

రూ.25 కోట్ల వరకు..

హైదరాబాద్‌లో పాతిక కోట్ల రూపాయలు అంటే విలాసవంతమైన విల్లా వచ్చేది. ఇప్పుడు ఈ ధరలకు ఫ్లాట్లను అమ్ముతున్నారు. వీటి విక్రయాలు కూడా బాగానే ఉన్నాయి. అల్ట్రా ప్రీమియం ప్రాజెక్టుల్లో రూ.5 కోట్ల నుంచి పాతిక కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు, ఐటీలో ఉన్నత ఉద్యోగులు, వైద్యులు, సినిమా తారలు, ప్రవాస భారతీయులు, ఇతర నగరవాసులు వీటిని కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు. ప్రస్తుతం మిగతా విభాగాల కంటే ప్రీమియం విభాగమే బాగుందని చెబుతున్నారు.  

ఎందుకు కొంటున్నారు...

కొందరు విశాలమైన నివాసంలో ఉండేందుకు కొనుగోలు చేస్తుంటే... పెట్టుబడి కోణంలో మరికొందరు కొంటున్నారు. ఈ తరహా ఆకాశహర్మ్యాల నిర్మాణం పూర్తికి నాలుగేళ్లు పడుతుండటంతో డబ్బుల చెల్లింపునకు వెసులుబాటు కూడా కొందర్ని పెట్టుబడి పెట్టేలా చేస్తోంది. ఐటీ కారిడార్‌లోని ప్రాజెక్టులైతే అద్దెలు సైతం భారీగా వస్తుండటం ఆకర్షణీయంగా మారింది. ఐటీ సంస్థలు సైతం వారి అవసరాల రీత్యా ఫ్లాట్లను బుక్‌ చేస్తున్నాయి. వీటికి మార్కెట్లో స్పందన బాగుండటంతో బిల్డర్లు వీటిని చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. భూముల ధర ఎంతైనా వెనకాడక కొనుగోలు చేసి మరీ కట్టేందుకు సిద్ధపడుతున్నారు.

బంజారాహిల్స్‌ను మించి...

ఒక కన్సల్టెన్సీ తాజాగా జులై నెలకు సంబంధించిన హైదరాబాద్‌ లావాదేవీల గురించి నివేదిక వెల్లడించింది. రూ.5 కోట్లు అంతకు మించిన లావాదేవీల గురించి కూడా ప్రస్తావించింది. ః బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 2లోని గత నెల రిజిస్టర్‌ అయిన ఫ్లాట్‌ మార్కెట్‌ ధర రూ.5.16 కోట్లు ఉంటే.. పుప్పాలగూడలో రిజిస్ట్రేషన్‌ జరిగిన స్థిరాస్తి విలువ రూ.25.19 కోట్లు. ః కోకాపేటలో రూ.12.98 కోట్లతో ఒక ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ జరిగింది. హాఫీజ్‌పేటలో రూ.6.60 కోట్లు, పుప్పాలగూడలో మరో ఇల్లు రూ.6.41 కోట్ల విలువ పలికింది.

ఎత్తు పెరిగేకొద్దీ.. విస్తీర్ణం పెంచుతూ..

నగరంలో పెద్ద ఎత్తున ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. 58 అంతస్తుల వరకు ఇప్పటివరకు అనుమతులు పొందారు. ఈ తరహా నిర్మాణాల్లో వెయ్యి, రెండువేల చదరపు అడుగుల్లో ఫ్లాట్లు నిర్మిస్తే ఆర్థికంగా లాభసాటి కాదు. దీంతో ప్రారంభంలో దిగువ అంతస్తుల్లో తక్కువ విస్తీర్ణం కల్గిన ఫ్లాట్లు నిర్మించి.. చివరి అంతస్తుల్లో స్కైవిల్లాలను చేపట్టారు. డ్యూప్లెక్స్‌ తరహాలో కట్టిన 4వేల చదరపు అడుగుల వరకు ఉండేవి. అప్పటి భూముల ధరలకు అనుగుణంగా వీటిని చేపట్టారు. ఇటీవల ఎకరం వంద కోట్లు దాటింది. సగటున రూ.70 కోట్ల స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. దీంతో మొదటి అంతస్తుల నుంచి చివరి అంతస్తు వరకు కనీసం విస్తీర్ణం 5వేలు చ.అ. అంటున్నారు. గరిష్ఠంగా 15వేల వరకు వెళుతున్నారు. కొందరు ఒక అంతస్తుకు ఒకటే ఫ్లాట్‌ను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు గీయిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని