సురక్షిత బాల్కనీల నిర్మాణమిలా

ఇల్లంటేనే భరోసా.. భద్రత.. అలాంటి చోట కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ముఖ్యంగా బాల్కనీల నుంచి, భవనం పిట్టగోడల పైనుంచి ప్రమాదవశాత్తూ పడిపోతున్నారు

Updated : 05 Mar 2024 16:50 IST

మోచేతుల వరకు రెయిలింగ్‌తో భద్రత అంటున్న ఇంజినీర్లు
ఈనాడు, హైదరాబాద్‌  


మెట్ల మార్గంలో...

  •  తక్కువ ఎత్తు గృహ సముదాయ భవనాల్లో మెట్ల రెయిలింగ్‌ కనీస ఎత్తు  మీటరు ఉండాలి. గరిష్ఠంగా 1.2 మీటరు ఎత్తు తప్పనిసరి.
  •  వాణిజ్య, ప్రజలు ఎక్కువ వినియోగించే భవనాల్లో 1.2 మీటర్లు ఎత్తును రెయిలింగ్‌ కోసం కచ్చితంగా పాటించాలి.
  • పిట్టగోడలను  మీటరు నుంచి గరిష్ఠంగా 1.5 మీటర్ల వరకు ఏర్పాటు చేసుకోవాలి.

     

  • ఇల్లంటేనే భరోసా.. భద్రత.. అలాంటి చోట కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ముఖ్యంగా బాల్కనీల నుంచి, భవనం పిట్టగోడల పైనుంచి ప్రమాదవశాత్తూ పడిపోతున్నారు. నగరంలో ఇటీవల రెండు మూడు సంఘటనలు జరిగాయి. డిజైనింగ్‌ లోపాలే కారణంగా కనబడుతున్నాయి. బాల్కనీ, మెట్ల రెయిలింగ్‌ ఎత్తు తగినంత లేకపోవడం, పిట్టగోడ ఎత్తు ప్రమాణాల మేరకు కట్టకపోవడం గమనించవచ్చు. కొత్తగా ఇల్లు కట్టుకునేవారు వీటిపైన దృష్టి పెట్టాలని ఇంజినీర్లు సూచిస్తున్నారు.
  • ఇల్లు అందంగా కన్పించేందుకు ఎన్నో హంగులు అద్దుతున్న గృహ యజమానులు భద్రతాపరంగా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నగరంలో ఏ ఇల్లు, ఫ్లాట్‌ చూసినా బాల్కనీలు కన్పిస్తుంటాయి. ఇటీవల కాలంలో గ్లాస్‌ బ్యాలస్ట్రేడ్స్‌తో ట్రెండీగా దర్శనమిస్తున్నాయి. వాటి ఎత్తు చూస్తుంటేనే ఒకింత ఆందోళన. పిల్లలు ఎవరైనా బాల్కనీలో ఆడుతున్నప్పుడు భయమేస్తోంది. ముఖ్యంగా వ్యక్తిగత ఇళ్లలో నిర్మించే బాల్కనీ రెయిలింగ్‌లు తక్కువ ఎత్తుతో ప్రమాదకరంగా ఉంటున్నాయి. బహుళ అంతస్తుల గృహ సుముదాయాల్లోనూ కొందరు తక్కువ ఎత్తులో రెయిలింగ్స్‌, బాల్కనీలు నిర్మిస్తున్నారు. ఈ రంగంలో అనుభవం ఉన్న బిల్డర్ల వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవగాహన లేకుండా ఈ రంగంలో గృహ నిర్మాణాలు చేపడుతున్నవారు.., వ్యక్తిగతంగా కట్టుకుంటున్నవారు.., మేస్త్రీ నిర్మాణాలు చేపడుతున్న వాటిలోనే లోపాలు కనబడుతున్నాయి.

  • ఎత్తు పెంచకపోతే ఎలా..?

  • భవనాల ఎత్తును బట్టి కూడా బాల్కనీ రెయిలింగ్‌ ఎత్తు మారుతుంది. ప్రస్తుతం వ్యక్తిగత ఇళ్లు సైతం ఐదు అంతస్తులకు తక్కువ కట్డడం లేదు. వంద గజాల్లో కట్టినా నాలుగైదు అంతస్తులు వేస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగినప్పుడు సహజంగానే బాల్కనీ రెయిలింగ్‌ ఎత్తు కూడా పెరగాలి. కానీ, ఈ జాగ్రత్తలేవీ లేకుండానే యజమానులు కట్టేస్తున్నారు.
  •  బాల్కనీల్లో సురక్షితంగా ఉండేందుకు అనుభవజ్ఞులైన బిల్డర్లు ఒక బండ గుర్తును సూచిస్తున్నారు. బాల్కనీలో నిలబడితే రెయిలింగ్‌ ఎత్తు మోచేతుల వరకు ఉండేలా చూసుకుంటే చాలా సురక్షితం అని చెబుతున్నారు.  
  •  జాతీయ భవన నిర్మాణ నిబంధనల ప్రకారం భవనం పిట్టగోడలు, బాల్కనీల్లో రెయిలింగ్‌ ఎత్తు మీటరు కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ఠంగా 1.2 మీటర్ల వరకు ఉండాలి.  
  •  రెండు మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తులో బాల్కనీ ఉన్నట్లయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాంక్రీట్‌ రెయిలింగ్‌లు పూర్తి సురక్షితం. మెటల్‌ గ్రిల్స్‌.. లేదంటే కాంక్రీట్‌, మెటల్‌ గ్రిల్స్‌ రెండూ కలిపి ఏర్పాటు చేసుకోవచ్చు.
  •  గాజు, మెటల్‌ గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లయితే కడ్డీల మధ్య ఎక్కువ ఖాళీ స్థలం లేకుండా చూడాలి. 10 సెం.మీ. కంటే మించకూడదు. లేదంటే పిల్లలు తల అందులో పెట్టే ప్రమాదం ఉంటుంది.
  •  బాల్కనీల్లో ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ చూస్తే పిల్లలు సులువుగా ఎక్కేలా ఉంటున్నాయి. వీటిని అడ్డంగా కాకుండా నిలువుగా ఏర్పాటు చేయడం.. దగ్గర దగ్గరగా బిగించడం సురక్షితం.
  •  పాత భవనమైతే అప్పట్లో బాల్కనీలు బయటికి కట్టేవారు. వీటిని స్ట్రక్చరల్‌ ఇంజినీర్లతో తనిఖీ చేయించుకోవాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని