ఇల్లు అయినా.. కార్యాలయమైనా.. ఆరోగ్యమే ప్రధానం

రియల్‌ ఎస్టేట్‌ రంగం.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విక్రయాలు, కొత్త ప్రాజెక్టులతో దూసుకెళుతోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి విక్రయాలు 3 లక్షల యూనిట్ల మార్క్‌ను దాటుతాయని సీబీఆర్‌ఈ అంచనా వేసింది.

Published : 30 Sep 2023 02:14 IST

ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ రంగం.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విక్రయాలు, కొత్త ప్రాజెక్టులతో దూసుకెళుతోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి విక్రయాలు 3 లక్షల యూనిట్ల మార్క్‌ను దాటుతాయని సీబీఆర్‌ఈ అంచనా వేసింది. మొదటి ఆరు నెలల్లో 1.50 లక్షల యూనిట్లను దాటేశాయి. గత ఏడాది ప్రథమార్ధం కంటే 4 శాతం, ద్వితీయార్ధం కంటే 6 శాతం ఎక్కువగా విక్రయాలు జరిగాయి. మొత్తంగా పదేళ్ల గరిష్ఠ స్థాయిని ఈ ఏడాది తాకుతుందని భావిస్తున్నారు. ఇంటి ఎంపికలో భారతీయులు.. ఆరోగ్యకర జీవనం గడిపేందుకు అనువుగా ఉండాలని అత్యధిక శాతం మంది కోరుకుంటున్నారు. కార్యాలయాల్లో ఉద్యోగులు సైతం ఆహ్లాదకర పరిసరాల్లో పనిచేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నాయి.

హరిత కార్యాలయాల్లో..

  • బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాల కోసం హరిత భవనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో నిర్మాణ సంస్థలు సైతం కొత్త ప్రాజెక్టులను చాలావరకు పర్యావరణహితంగా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో వీటి సరఫరా 2019తో పోలిస్తే 36 శాతం పెరిగినట్లు సీఐఐ-సీబీఆర్‌ఈ నివేదికలో వెల్లడించింది.
  • ప్రధానమైన ఆరు నగరాల్లో కలిపి 342 మిలియన్‌ చదరపు అడుగుల్లో హరిత కార్యాలయాలు విస్తరించగా.. బెంగళూరు, దిల్లీ, ముంబయి నగరాల వాటానే 68 శాతంగా ఉంది.
  • బెంగళూరు అన్ని నగరాల కంటే ముందు వరసలో ఉంది. మొత్తం హరిత కార్యాలయాల్లో ఇక్కడ ఒక్కచోటనే 30 శాతం ఉన్నాయి. దిల్లీలో 21 శాతం, ముంబయిలో 17 శాతంగా ఉంది. చెన్నై 9 శాతం, పుణేలో 8 శాతం కార్యాలయాలు ఉన్నాయి.

హైదరాబాద్‌లో 15 శాతం దాకా..

హైదరాబాద్‌లో 2019లో హరిత భవనాల విస్తీర్ణం 25.9 మిలియన్‌ చ.అ. అడుగులు ఉండగా... 2020లో 29.3 మి.చ.అ., 2021లో 36.7 మి.చ.అ.,  గత ఏడాది 45.9 మి.చ.అ. ఉండగా.. 2023 జూన్‌ వరకు 51.9 మి.చ.అ.కు  పెరిగింది. హైదరాబాద్‌ వాటా 15 శాతంగా ఉంది.

పెట్టుబడులు...

రియల్‌ ఎస్టేట్‌లోకి ఈ ఏడాది ప్రథమార్ధంలో 4.4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. కార్యాలయాల నిర్మాణాల్లో అత్యధికంగా 47 శాతం పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత గృహ నిర్మాణం 18 శాతం, ఆసుపత్రి భవనాలు 18 శాతం, డాటా సెంటర్లలో 13 శాతం, ఇండస్ట్రీయల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌లో 5 శాతం పెట్టుబడులు వచ్చాయి.

  • జులై-డిసెంబరు 23లో పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేసింది. 2023లో 6 నుంచి 6.6 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు వస్తాయని అంచనా.
  • వచ్చే రెండేళ్లపాటు పెట్టుబడులు రావడం స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. 16నుంచి 17 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు వస్తాయని అంచనా.

డాటా సెంటర్లు..

ఈ ఏడాది ఆఖరు నాటికి 1048 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా. వార్షికంగా 35 శాతం వృద్ధి ఉంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో కొత్తగా 170 మెగావాట్లు జత కూడబోతుంది.

రిటైల్‌ విభాగంలో..

మాల్స్‌, వాణిజ్య భవనాల నిర్మాణాలు పెరుగుతున్నాయి. రిటైల్‌ లీజింగ్‌ వార్షిక వృద్ధి 24 శాతంగా ఉంది. జనవరి నుంచి జూన్‌ వరకు 2.9 మిలియన్‌.చ.అ. విస్తీర్ణంగా నమోదైంది. ద్వితీయార్ధంలోనూ ఇది కొనసాగి.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తుంది.

ఇండస్ట్రియల్‌, లాజిస్టిక్స్‌(ఐ అండ్‌ ఎల్‌) విభాగంలోనూ వార్షిక వృద్ధి 35 శాతంగా ఉంది. జనవరి-జూన్‌ 23లో 19.1 మిలియన్‌.చ.అ.గా నమోదైంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 36 నుంచి 38 మిలియన్‌ చ.అ.చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని