పొరుగు నగరాలు పోటాపోటీ

కార్యాలయాల నిర్మాణాల్లో హైదరాబాద్‌, బెంగళూరు.. నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నాయి.

Updated : 14 Oct 2023 02:41 IST

హైదరాబాద్‌లో 2025 నాటికి 3.3 కోట్ల చ.అ. కార్యాలయాల నిర్మాణం
బెంగళూరులో 4.78 కోట్ల చ.అడుగులు

కార్యాలయాల నిర్మాణాల్లో హైదరాబాద్‌, బెంగళూరు.. నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నాయి. ఈ రెండు నగరాల్లో ఆకాశాన్ని తాకేలా కార్యాలయ భవనాల నిర్మాణం దూకుడు మరో రెండేళ్ల పాటు కొనసాగనుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో చేపట్టే మొత్తం ఆఫీసు స్పేస్‌లో ఈ రెండు నగరాల వాటానే సగం దాకా ఉందని సీబీఆర్‌ఈ నివేదికలో పేర్కొంది. పెద్ద ఎత్తున వస్తున్న గ్లోబల్‌ కేపబులిటీ కేంద్రాలకు ఈ కార్యాలయాలు స్వాగతం పలుకుతున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌లో చుక్కలను అందుకునే స్థాయిలో యాభై అంతస్తుల వరకు కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లన్నీ వేర్వేరు దశల్లో ఉన్నాయి. 2023-25 నాటికి హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 165 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలోని కార్యాలయాలు పూర్తికానున్నాయి. ఇది 2020-22 కాలంలో పూర్తైన 142 మి.చ.అ. కంటే అధికం.

అగ్రస్థానంలో బెంగళూరు..

కార్యాలయాల కొత్త నిర్మాణాల్లో బెంగళూరు ఆధిపత్యం కొనసాగుతోంది. 4.78 కోట్ల.చ.అ. విస్తీర్ణంలో భవనాలు వస్తున్నాయి. దేశవ్యాప్త నిర్మాణాల్లో ఈ నగరం వాటా 29 శాతం. కొత్త కార్యాలయాలు అవుటర్‌ రింగ్‌రోడ్డు, నార్త్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో వస్తున్నాయి.

  • హైదరాబాద్‌ నగరంలో వచ్చే రెండేళ్లలో 3.3 కోట్ల చ.అ. కార్యాలయాలు పూర్తి కానున్నాయి. సగటున ఏటా కోటి చ.అ.పైగానే ఆఫీసు స్పేస్‌ అందుబాటులోకి రానుంది. మన వాటా దేశీయంగా 20 శాతంగా ఉంది. ఐటీ కారిడార్‌లోనే అత్యధికం ఉన్నాయి.

ప్రపంచ కార్యాలయాలకు నిలయం

భారత్‌లో ఆఫీస్‌ స్పేస్‌ రంగం మంచి వృద్ధి సాధిస్తోంది. మూడు సంవత్సరాల వ్యవధిలో సగటు వార్షిక కార్యాలయాల సరఫరా 17 శాతం పెరగడం సానుకూలతను సూచిస్తోంది. మూడేళ్ల వ్యవధిలో భవనాల సగటు విస్తీర్ణం 18 శాతం పెరిగింది. కార్పొరేట్లు, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలకు నిలయంగా భారత్‌ మరింతగా విస్తరిస్తోంది. వ్యయం, ఇతర ప్రయోజనాల రీత్యా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపేలా చేస్తున్నాయి. 

అన్షుమాన్‌ మ్యాగజైన్‌, ఛైర్మన్‌, సౌత్‌ ఈస్ట్‌ ఆసియా, సీబీఆర్‌ఈ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని