రెరా మరింత బలోపేతం

రెరాలో ఫిర్యాదుల స్వీకరణ, మధ్యవర్తిత్వం కోసం ఇటీవలే ఐఏఎంసీతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలంగాణ రియల్‌ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ పేర్కొన్నారు.

Published : 28 Oct 2023 03:28 IST

ఫిర్యాదుల స్వీకరణ, మధ్యవర్తిత్వానికి చర్యలు
సంస్థ తెలంగాణ ఛైర్మన్‌ ఎన్‌.సత్యనారాయణ
ఈనాడు, హైదరాబాద్‌

రెరాలో ఫిర్యాదుల స్వీకరణ, మధ్యవర్తిత్వం కోసం ఇటీవలే ఐఏఎంసీతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలంగాణ రియల్‌ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ పేర్కొన్నారు. పటిష్టమైన సాంకేతిక బృందం, ఆర్థిక విభాగాలతో రెరాను మరింత బలోపేతం చేసే పనులను వేగవంతం చేశామన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన గచ్చిబౌలిలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఆధ్వర్వంలో ‘రెరా లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం’ ప్రారంభ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెరా చట్టం అమలుతో కొనుగోలుదారుల నమ్మకానికి భరోసా వచ్చిందన్నారు. రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్రకటనలు, మార్కెటింగ్‌ చేయడం గణనీయంగా తగ్గిందన్నారు. ఈ మేరకు బిల్డర్లు, ప్రమోటర్లు, డెవలపర్లలో మార్పులు తీసుకొచ్చామన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపిస్తే జీవితకాలం కష్టపడి కూడబెట్టిన సొమ్మును కొనుగోలుదారులు కోల్పోయే ప్రమాదముందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలకు నోటీసులు జారీచేసి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏజెంట్ల కోసం సర్టిఫికెట్‌ ప్రోగ్రాం నిర్వహించి వారిలో జవాబుదారీతనం పెంపొందించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రెరాలో సీఏలో పాత కీలకమైనందున బిల్డర్లకు సరైన సమాచారం అందించి పాటుపడాలని సూచించారు. ఐసీఏఐ అధ్యక్షుడు సునీల్‌ తలాట్‌, ఉపాధ్యక్షుడు రంజిత్‌కుమార్‌ అగర్వాల్‌, నరెడ్కో అధ్యక్షుడు జి.హరిబాబు, తెలంగాణ రెరా సభ్యులు కె.శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని