ఆహ్వానితులకు మాత్రమే

కోకాపేటలోని నియోపోలీసు లేఅవుట్‌లో ప్రస్తుతం పలు బడా సంస్థలు 40 నుంచి 59 అంతస్తుల వరకు భవనాలు కడుతున్నాయి. కార్యాలయాలు, గృహ నిర్మాణాలు పక్కపక్కనే రాబోతున్నాయి. ఇక్కడ కడుతున్న నివాసాల్లో అత్యధికం నాలుగువేల నుంచి ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.

Updated : 28 Oct 2023 04:19 IST

విలాసవంతమైన నివాసాల్లోనయా పోకడ
ఈనాడు, హైదరాబాద్‌

కోకాపేటలో ఇటీవల ఎకరాకు వంద కోట్ల రూపాయల వరకు వేలంలో పాడి నిర్మాణ సంస్థలు భూములు దక్కించుకున్నాయి. ప్రీమియం ప్రాజెక్టులు చేపట్టేందుకు, కార్యాలయాల భవనాలను నిర్మించాలనే ప్రణాళికల్లో ఆయా సంస్థలు ఉన్నాయి. ఇక్కడ కట్టే విలాసవంతమైన ఇళ్లు ఆహ్వానితులకు మాత్రమే అంటున్నారు బిల్డర్లు. ఐకానిక్‌ టవర్లను నిర్మించేలా అంతర్జాతీయ ఆర్కిటెక్చర్లతో డిజైన్లు గీయిస్తున్నామని చెబుతున్నారు.

కోకాపేటలోని నియోపోలీసు లేఅవుట్‌లో ప్రస్తుతం పలు బడా సంస్థలు 40 నుంచి 59 అంతస్తుల వరకు భవనాలు కడుతున్నాయి. కార్యాలయాలు, గృహ నిర్మాణాలు పక్కపక్కనే రాబోతున్నాయి. ఇక్కడ కడుతున్న నివాసాల్లో అత్యధికం నాలుగువేల నుంచి ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ఇతర నగరాలకు చెందినవారు, ఐటీ, వ్యాపార, రాజకీయ వర్గాలు, వైద్యులు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఆర్థిక స్తోమతను బట్టి ఎవరైనా వీటిని కొనుగోలు చేయవచ్చు.

ప్రొఫైల్‌ చూసి..

కొన్ని సంస్థలు 14వేల నుంచి 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో ఫ్లాట్‌ కట్టేలా ప్రణాళికలు వేస్తున్నాయి. ఒక్కో పడక గది.. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. విశాలంగా ప్రతి గదికి బాల్కనీ ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. ఇంట్లోనే పిల్లలు, పెద్దలు ఆడుకునేందుకు విశాలమైన గది.., వ్యాయామానికి ఒక గది ఇలా ప్రతిదీ ఇంట్లోనే ఉండేలా కట్టబోతున్నారు. పైగా వీటిని ఎంపిక చేసిన ఆహ్వానితులకు మాత్రమే విక్రయిస్తామని వేలంలో భూములు కొనుగోలు చేసిన ఒక బిల్డర్‌ తెలిపారు. కొనుగోలుదారుల ప్రొఫైల్‌ చూసి మరీ వీటిని విక్రయించనున్నారు. ముంబయిలో ఎప్పటి నుంచో ఉన్న ఈ సంస్కృతి ఇప్పటివరకూ పెద్దగా లేని మన హైదరాబాద్‌లో కొన్ని ప్రాజెక్టులకే పరిమితం అయ్యింది. ఆ జాబితాలో నియోపోలీస్‌లోని కొన్ని ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు చేరబోతున్నాయి.

ఐకానిక్‌గా ఉండేలా..

కోకాపేట ప్రాంతం హైదరాబాద్‌ రియాల్టీలో అత్యంత ఖరీదైన, ఆకర్షణీయ ప్రదేశంగా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అవుటర్‌ రింగ్‌రోడ్డు సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రాంతం.. నియోపోలీస్‌తో అందుకోలేని స్థాయికి చేరింది. ఇక్కడ చేపట్టే భవనాలు, వాటి ఎలివేషన్‌ ప్రత్యేకంగా ఉండాలని.. నగర ఖ్యాతిని చాటేలా, అర్బన్‌ ల్యాండ్‌స్కేప్‌ను మరింత గుర్తింపు తెచ్చేలా ఉండాలని నిర్మాణదారులు భావిస్తున్నారు. అందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తమ సంస్థకు పేరు తెచ్చేలా.. సిటీకి ఐకానిక్‌గా నిలిచేలా కోకాపేటలో చేపట్టే తమ ప్రాజెక్ట్‌ ఉంటుందని ఒక బిల్డర్‌ తెలిపారు.


ధరలు సైతం అదే స్థాయిలో..

హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు ఐటీ కారిడార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఉప్పల్‌, అబిడ్స్‌, ఐఎస్‌సదన్‌, ఉందానగర్‌, కొంపల్లితో పాటు అనేక ప్రాంతాల్లో వీటిని కడుతున్నారు. కోకాపేటలో వీటన్నింటిని మించిన ఎత్తులో భవనాలు వస్తున్నాయి. ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) ఆంక్షలు లేకపోవడంతో భూమిని రూ.వందకోట్లకు కొనుగోలు చేసినా.. అంతస్తులు పెంచుకోవడం ద్వారా ప్రాజెక్ట్‌ను లాభసాటిగా మార్చుకోవచ్చనే విశ్వాసం బిల్డర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పాత ప్రాజెక్టుల్లో చదరపు అడుగు రూ.10 వేల లోపే విక్రయించారు. కొత్తవాటిలో మరో రెండుమూడు వేలు అధికంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్కో ఫ్లాట్‌ ఖరీదు రూ.15-20 కోట్ల వరకు ఉంటుంది. ఎంపిక చేసిన ఆహ్వానితులకు మాత్రమే వీటిని అమ్ముతారు కాబట్టి విక్రయాలు పెద్ద సమస్య కాదనేది వారి వాదన. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లను చూస్తే సిటీలో రూ.7కోట్ల విలువైన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు 4 జరిగాయి. దీన్ని బట్టి ప్రీమియం ఇళ్లకు హైదరాబాద్‌లో మార్కెట్‌ ఉందని వారు విశ్వసిస్తున్నారు.


భవిష్యత్తులో మరింతగా..

రాబోయే రోజుల్లో కోకాపేట ఉపాధికి హబ్‌గా మారనుందని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ ఐదు నుంచి పదేళ్ల వ్యవధిలో ఐదు లక్షల మంది ఉద్యోగాలకు కేంద్రంగా ఉండనుందని సర్కారు ప్రణాళికలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి మున్ముందు ఈ ప్రాంతంలో భూములు, ఫ్లాట్ల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని.. అందుకే అంత ధరలు పెట్టి భూములు కొంటున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.


ఎలివేషన్‌లో మార్పులు..

కోకాపేట ఆకాశహర్మ్యాల ఎలివేషన్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు సిటీలో కట్టిన నివాస అపార్ట్‌మెంట్లు, ఆకాశహర్మ్యాల వరకు అన్నీ డబ్బాలను తలపిస్తున్నాయి. కార్యాలయాల పరంగా సైబర్‌టవర్స్‌, కొత్త సచివాలయంతో పాటు మరికొన్ని భవనాల ఎలివేషన్స్‌ సిటీకి ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయాయి. గృహ నిర్మాణంలో మాత్రం ఆ స్థాయిలో చెప్పుకోదగిన ఎలివేషన్‌ ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడిప్పుడే ఆర్కిటెక్చర్లు, బిల్డర్లు వీటిపై దృష్టి పెట్టారు. ప్రీమియం ప్రాజెక్టుల్లోనే వీటిని చేపట్టేందుకు అవకాశం ఉండటంతో ఔరా అన్పించే ఎలివేషన్లు వస్తున్నాయి. కోకాపేట, రాయదుర్గం ప్రాంతాల్లో ఈ తరహా ఒకటిరెండు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా వస్తున్న గూగుల్‌ క్యాంపస్‌ ఎలివేషన్‌ సైతం ఆకట్టుకునేలా డిజైన్‌ చేశారు. ఈ తరహా మార్పులు రియాల్టీలో వస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని