ఇల్లు నచ్చాలంటే ఏం ఉండాలి?

ఇంటి ఎంపికలో కొనుగోలుదారులు ఏం చూస్తున్నారు? వేటికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు? నగరానికి చెందిన నిర్మాణ సంస్థ యూ/డిజైన్‌ పేరుతో ఏడాది పాటు నిర్వహించిన సర్వేలో సొంతింటిపై నవతరం తమ ఆలోచనలు పంచుకున్నారు.

Updated : 13 Jan 2024 07:40 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ఇంటి ఎంపికలో కొనుగోలుదారులు ఏం చూస్తున్నారు? వేటికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు? నగరానికి చెందిన నిర్మాణ సంస్థ యూ/డిజైన్‌ పేరుతో ఏడాది పాటు నిర్వహించిన సర్వేలో సొంతింటిపై నవతరం తమ ఆలోచనలు పంచుకున్నారు. వాటి సారాంశం..

పిల్లలను చూసుకోవడం.. : భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పిల్లల ఆలనాపాలన చూసుకునే సౌకర్యాలు కమ్యూనిటీలోనే ఉండాలని 32 శాతం మంది కోరుకుంటున్నారు. పెద్దవాళ్లు అందుబాటులో లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామని.. డేకేర్‌ కేంద్రాలు ఉంటే వృత్తి, ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారు.

ఇంటి నుంచే పని : కంపెనీలు ప్రస్తుతం హైబ్రిడ్‌ పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. వారంలో రెండు రోజులు కార్యాలయానికి వెళితే.. మూడు రోజులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. అయితే 36.7 శాతం మంది తాము పూర్తిగా ఇంటి నుంచే పనిచేస్తున్నామని.. అందుకు తగ్గ సౌకర్యాలు ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది, ప్రత్యేకంగా ఆఫీస్‌ పని కోసం కమ్యూనిటీలో సదుపాయాలు ఉంటే మేలనే భావనలో ఉన్నారు.

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం : ఉరుకులు, పరుగుల జీవితంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామం ఉత్తమమైన మార్గం. అందుకే కమ్యూనిటీలోనే వీలైతే తమ ఫ్లోర్‌లోనే ఒక జిమ్‌ ఉండాలని కోరుకునేవారు 34 శాతం మంది కన్పించారు. ఉదయం, సాయంత్రం ఎప్పుడు కుదిరితే అప్పుడు వ్యాయామం చేస్తామంటున్నారు.
పచ్చదనానికి పెద్దపీట : కమ్యూనిటీలో పచ్చదనానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతి పదిమందిలో 9 మంది కోరుకుంటున్నారు. అందరూ కలుసుకునేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.


లివింగ్‌ రూమ్‌ ఇష్టం

ఇంట్లో ఏ గదికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అన్న ప్రశ్నకు 34 శాతం మంది లివింగ్‌ రూంకు ఓటేశారు. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడిపేది ఇక్కడే అంటున్నారు.  వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్మాణ సంస్థలు తమ కొత్త ప్రాజెక్ట్‌లను డిజైన్‌ చేస్తున్నాయి. ‘ఆధునిక గృహ కొనుగోలుదారుల డిజైన్‌ ప్రాధాన్యతలను అర్ధం చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే యూ/డిజైన్‌ సర్వే’ అని ఏఎస్‌బీఎల్‌ సీఈవో అజితేష్‌ కొరుపొలు అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని