ఇల్లు కొనే ముందు థర్డ్‌ పార్టీ తనిఖీలు

కొత్త ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు మట్టి ఇటుకతో కట్టారా.. సిమెంట్‌ ఇటుక వాడారా? గోడలకు పగుళ్లు ఉన్నాయా? వాస్తు ప్రకారంగా ఉందా? ఆ ప్రదేశానికి రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో వృద్ధి ఎలా ఉంటుందనే కొన్ని విషయాల వరకే కొనుగోలుదారులు పరిమితం అవుతుంటారు.

Updated : 31 Jan 2024 17:29 IST

సాంకేతికత వినియోగంతో లోపాల గుర్తింపు
కొనుగోలుదారు, పరిశ్రమకు మేలంటున్న నిర్మాణ రంగ నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌ : కొత్త ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు మట్టి ఇటుకతో కట్టారా.. సిమెంట్‌ ఇటుక వాడారా? గోడలకు పగుళ్లు ఉన్నాయా? వాస్తు ప్రకారంగా ఉందా? ఆ ప్రదేశానికి రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో వృద్ధి ఎలా ఉంటుందనే కొన్ని విషయాల వరకే కొనుగోలుదారులు పరిమితం అవుతుంటారు. పైకి కన్పించే విషయాలను గమనిస్తుంటారు. ఇంట్లో ఫిట్టింగ్స్‌ ఎలా ఉన్నాయి? ఇన్సులేషన్‌ ఎలా ఉంది? కిటికీల ఫ్రేమ్‌లు నాణ్యమైనవేనా? రూఫ్‌ స్ట్రక్చర్‌ మాటేమిటి? అంటే పెద్దగా తెలియదు అంటారు. వాస్తవానికి ఇవి సాంకేతిక అంశాలు కావడంతో ఈ రంగంలోని నిపుణులే వాటి లోటుపాట్లు చెప్పగలరు. ఇందుకు మార్కెట్లో హోమ్‌ ఇన్‌స్పెక్షన్‌ అంకుర సంస్థలు వచ్చాయి. వీరి సేవలను కొన్ని నిర్మాణ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. కొనుగోలుదారుడికి ఫ్లాట్‌ అందించడానికి కంటే ముందు సివిల్‌ ఇంజినీర్లు పరిశీలించి నివేదిక ఇస్తారు. ఏమైనా లోపాలు ఉంటే సరిచేసి అందజేస్తారు ఇప్పటికీ ఇలాంటి థర్డ్‌పార్టీ తనిఖీలకు చాలా నిర్మాణ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులే కొనబోయే స్థిరాస్తిని తనిఖీ చేయించుకుంటున్న పరిస్థితులు మార్కెట్లో కనిపిస్తుంటాయి. విదేశాల్లో ఎప్పటి నుంచో ఈ విధానాన్ని అనుసరిస్తుండగా.. మన దగ్గర ఇప్పుడిప్పుడే ఈ పోకడ మొదలైంది.

కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లోకి దిగగానే కొన్ని సమస్యలు చికాకు పెడుతుంటాయి. కిటికీల ఫ్రేమ్‌లు సరిగ్గా లేక వర్షం పడితే ఇంట్లోకి నీళ్లు రావడం, స్నానాల గదిలో లీకేజీలు.. ఆలస్యంగా బయటపడే పగుళ్లు... ఇలా ఒక్కోటి నిదానంగా బయటపడేసరికి బాధపడటం మినహా మరేం చేయలేని పరిస్థితి. రెరా వచ్చాక నిర్మాణ లోపాలకు ఐదేళ్ల వరకు బిల్డర్‌దే బాధ్యత కావడంతో థర్డ్‌ పార్టీ తనిఖీలు తెరమీదకు వచ్చాయి. ఈ తరహా సంస్థలు అత్యాధునిక పరికరాలు ఉపయోగించి క్షుణ్నంగా పరిశీలించి, గుర్తించిన లోపాలపై సమ్రగమైన నివేదికను ఫొటోలతో సహా అందజేస్తాయి. దాదాపుగా 400 అంశాలను వీరు పరిశీలిస్తారు. ఇంటి గచ్చు, గోడలు, పైకప్పు, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, తలుపులు, కిటికీలు, వంటగది క్యాబినెట్‌తో సహా ప్రతిదీ జాగ్రత్తగా చూస్తారు. ఫలితంగా కొత్త ఇంటి వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తుంది.


బిల్డర్లు ముందుకు రావాలి

15 ఏళ్లుగా ఈ పరిశ్రమలో ఉన్నాను. రెండో తరం బిల్డర్‌ని. రెండువేల ఇళ్లు అమ్మిన తర్వాత, అందులో నివసిస్తున్న పదివేల మందితో మాట్లాడిన తర్వాత ఒక విషయాన్ని గ్రహించాను. ఇల్లు కొనడం చాలా కష్టంగా భావిస్తున్నారు. కొనడానికి భయపడుతున్నారు. నాణ్యత దగ్గర్నుంచి ఎన్నో విషయాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దురదృష్టవశాత్తు నిర్మాణ నాణ్యత ఆశించిన ప్రమాణాల మేరకు లేదు. నైపుణ్యం కలిగిన నిర్మాణ కూలీల లభ్యత సమస్యగా ఉంది. ఇదివరకు అనుభవం కలిగిన మేస్త్రీలు ఉండేవారు. ఇప్పుడు దొరకడం లేదు. సాంకేతికతను వినియోగించడం ద్వారా ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. లావాదేవీ జరగడానికి ముందే స్థిరాస్తి ఎలా ఉంది అనేది పారదర్శకంగా తెలిసేలా ఉంటే నిర్ణయం తీసుకోవడం తేలిక అవుతుంది. దీనివల్ల కొనుగోలుదారులకే కాదు పరిశ్రమకూ మేలు జరుగుతుంది. ఫ్లాట్‌ అందజేయడానికి ముందు ఇంటి తనిఖీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా సహజం. మన దగ్గర ఇది పెద్దగా లేదు. ఈ క్రమంలోనే ప్రాప్‌ టెక్‌ సంస్థను ఏర్పాటు చేశాను. కొనుగోలుదారులు తనిఖీ చేయించుకోవడం కంటే.. బిల్డర్లే ముందుకొచ్చి అన్నింటిని పరిశీలించి కొనుగోలుదారులకు అందజేయడం మేలు. తనిఖీ అనంతరం రేటింగ్‌ ఇస్తాం. 95 శాతం పైగా వస్తేనే కొనుగోలుదారుకు అందజేస్తున్నాం. దిల్లీలో ఒక ప్రాజెక్ట్‌లో ప్రతి అపార్ట్‌మెంట్‌ను కొనుగోలుదారులకు అందజేయడానికంటే ముందు తనిఖీ చేశాం.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవస్థాపకులు, ప్రాప్‌టెక్‌ హోం ఇన్‌స్పెక్షన్‌ సర్వీసెస్‌; నార్త్‌స్టార్‌ హోమ్స్‌ భాగస్వామి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని