నిర్మాణ రంగ ఉన్నతికి చేయూత ఇవ్వండి

నిర్మాణ రంగం అభివృద్ధి, కొనుగోళ్ల ప్రోత్సాహకానికి కొత్త ప్రభుత్వానికి స్థిరాస్తి సంఘాలు పలు సూచనలు, విజ్ఞప్తులు చేశాయి.

Updated : 27 Jan 2024 07:28 IST

పలు ప్రోత్సాహకాలను ఆశిస్తున్న స్థిరాస్తి సంఘాలు
హైదరాబాద్‌ మాస్టర్‌ప్లాన్‌ 2050 రూపకల్పనకు సూచనలు

నిర్మాణ రంగం అభివృద్ధి, కొనుగోళ్ల ప్రోత్సాహకానికి కొత్త ప్రభుత్వానికి స్థిరాస్తి సంఘాలు పలు సూచనలు, విజ్ఞప్తులు చేశాయి. నిర్మాణ రంగ ఉన్నతి రాష్ట్రానికి వెన్నెముక అని.. పరస్పర సహకారంతో ముందుకెళ్దామనే సంకేతాలను ఇచ్చాయి. 2050 మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు సలహాలు ఇచ్చాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను సర్కారు దృష్టికి తీసుకొచ్చాయి.

ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కలిపి 7.6 శాతం వరకు అవుతున్నాయి. జీఎస్‌టీ 5 శాతం దీనికి అదనం. మొత్తంగా ఇంటి కొనుగోలుపై 12.6 శాతం పన్నుల రూపంలో వెళుతోంది. కొంతకాలం వరకైనా రిజిస్ట్రేషన్‌ ఫీజు తగ్గించాలని ప్రభుత్వాన్ని నరెడ్కో తెలంగాణ కోరింది. ఫీజులు తగ్గితే రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గదని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రియల్‌ ఎస్టేట్‌ తగ్గిందనే ప్రచారానికి తెరపడుతుందనే భావనను ప్రభుత్వం ముందు వెలిబుచ్చారు. వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందు నుంచే మార్కెట్‌ నెమ్మదించిందని అన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజుల తగ్గింపుతో అటు ప్రభుత్వం, ఇటు కొనుగోలుదారులు, పరిశ్రమకు మేలు జరుగుతుందని చెప్పారు.

ఆగిన ఆకాశహర్మ్యాల  అనుమతులు

పర్యావరణ కమిటీ లేక ఆకాశహర్మ్యాల అనుమతులు ఆగిపోయాయి. గత ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికంటే ముందు నిర్మాణ సంఘాలు కొత్త కమిటీ ఏర్పాటుపై సూచనలు చేశాయి. నాటి సర్కారు సైతం సీఎస్‌కు సూచించి కమిటీ ఏర్పాటయ్యేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఎందుకనో ఏర్పాటు కాలేదు. రెండు నెలలు ఎన్నికలు, కొత్త ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కావొస్తుంది. అప్పటి నుంచి ఆకాశహర్మ్యాల దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్నాయని బిల్డర్లు అన్నారు. 20వేల చదరపు మీటర్లు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు పర్యావరణ కమిటీ అనుమతి తప్పనిసరి అని.. త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలని నరెడ్కో తెలంగాణ సర్కారును కోరింది. ‘పర్యావరణ అనుమతి లేక ప్రాజెక్ట్‌ పనులు ఆగిపోయాయి. కమిటీ ఏర్పాటయ్యేవరకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలి’ అని ఒక బిల్డర్‌ అన్నారు.


మాస్టర్‌ ప్లాన్‌ లక్ష్యం ఆధారితంగా ఉండాలి

2050 కోసం హైదరాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ మంచి ఆలోచన. ప్రణాళికలతో స్థిరత్వం వస్తుంది. ఏ ప్రణాళిక అయినా లక్ష్యం ఆధారితంగా ఉంటే ప్రయోజనం ఉంటుంది. 2040 దుబాయ్‌ మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం గ్లోబల్‌ డెస్టినేషన్‌గా మారాలనేది లక్ష్యం. పారిస్‌ 2050 మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం కార్బన్‌ ఉద్గారాలను 75 శాతం తగ్గించాలనేది లక్ష్యం. ఇలా ప్రత్యేకించి నిర్దేశించినప్పుడే వాటిని చేరుకోగలం. మన మాస్టర్‌ప్లాన్‌లోనూ ఇలాంటి లక్ష్యాలు ఉండాలి. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ ప్రకారం 2035 నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే నగరాల్లో హైదరాబాద్‌ 4వ స్థానంలో ఉండబోతుందని తెలిపింది. 2018లో హైదరాబాద్‌ జీడీపీ 50 బిలియన్‌ డాలర్లు ఉంటే 2035 నాటికి 200 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దీనికి తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన ఉండాలి.

 బి.సునీల్‌చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ


తనఖా తొలగించాలి

భవన అనుమతుల సమయంలో నిర్మాణ విస్తీర్ణంలో 10 శాతం మార్టిగేజ్‌ చేయాలనే నిబంధనను తొలగించాలని కోరాం. రెరా వచ్చాక పారదర్శకత పెరిగింది. కొనుగోలుదారుల నుంచి సేకరించిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేసి ప్రాజెక్ట్‌కే కేటాయిస్తున్నాం. ఎప్పటికప్పుడు వాటి పురోగతిని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నాం. ఉల్లంఘిస్తే జరిమానాలు ఉన్నాయి. కాబట్టి 10 శాతం తనఖా అవసరం లేదనేది మా భావన. 10 లక్షల విస్తీర్ణంలో నిర్మాణం చేసే చోట లక్ష చ.అ. తనఖాలో అంటే ప్రాజెక్ట్‌ చేయడం కష్టం అవుతోంది. గతంలో ఉన్న పరిస్థితులను బట్టి అవసరం అని మేమే సూచించాం. ఇప్పుడు తొలగించాలని కోరుతున్నాం.

 ఎం.విజయసాయి, ప్రధాన కార్యదర్శి, నరెడ్కో తెలంగాణ


అన్నివైపులా వృద్ధి చెందితేనే..

నగరంలో ఒకచోట కాకుండా అన్నివైపులా అభివృద్ధి చెందేలా ప్రభుత్వ లక్ష్యం ఉండాలి. కొత్త ప్రభుత్వం ఆలోచనలు ఆ దిశగా ఉన్నాయి. సిటీలో పశ్చిమ, తూర్పు, ఉత్తరం, దక్షిణం అన్నివైపులా అభివృద్ధి చెందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీర్ఘకాలానికి బాహ్యవలయ రహదారి, ప్రాంతీయ వలయ రహదారి మధ్యలో 14 నగరాలు అంటున్నారు. చాలాకాలం నుంచి వీటిని వింటున్నాం. ఆచరణలోకి వస్తే ప్రయోజనం ఉంటుంది. అభివృద్ధిని కొనసాగిస్తూ.. సమయానుకూలంగా వాటిపై దృష్టి పెట్టడం ప్రధానం. 70 కి.మీ. మెట్రోరైలు విస్తరణ, మూసీ సుందరీకరణ మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది. మెట్రో కొత్త ప్రాంతాలకు విస్తరణతో సరసమైన గృహాల కొత్త మార్కెట్లకు దారులు తెరుచుకుంటాయి. గత మాస్టర్‌ప్లాన్‌ సమయంలో 4 జోన్లు మాత్రమే ఉండేవి. ఇన్నేళ్లలో మారిన పరిస్థితులకు తగ్గట్టుగా ఇవి పెంచాల్సిన అవసరం ఉంది.

 వి.రాజశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని