పెద్దల గృహాలకు హైబ్రిడ్‌ మోడల్‌

నగరంలో ఖాళీ స్థలం కన్పిస్తే చాలు అపార్ట్‌మెంట్‌ కట్టేస్తున్నారు. ఐటీ కారిడార్‌లో అయితే ఆఫీస్‌ స్పేస్‌, మాల్స్‌ నిర్మాణం చేపడుతున్నారు.. పోటీ నేపథ్యంలో గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, కార్యాలయాల పరంగా సరఫరా పెరిగింది. స్థానిక బిల్డర్లతో పాటు ఇతర నగరాల నుంచి వచ్చిన సంస్థలతో పోటీ బాగా పెరిగింది.

Updated : 03 Feb 2024 11:36 IST

నగరంలో ఖాళీ స్థలం కన్పిస్తే చాలు అపార్ట్‌మెంట్‌ కట్టేస్తున్నారు. ఐటీ కారిడార్‌లో అయితే ఆఫీస్‌ స్పేస్‌, మాల్స్‌ నిర్మాణం చేపడుతున్నారు.. పోటీ నేపథ్యంలో గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, కార్యాలయాల పరంగా సరఫరా పెరిగింది. స్థానిక బిల్డర్లతో పాటు ఇతర నగరాల నుంచి వచ్చిన సంస్థలతో పోటీ బాగా పెరిగింది. ఇప్పటి వరకు కట్టిన తరహాలోనే ఇక ముందూ అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు నిర్మించటం ఆర్థికంగా లాభసాటి కాకపోవచ్చనే హెచ్చరికలు ఉన్నాయి. ఫలితంగా ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు నిర్మాణదారుల చూపు మళ్లింది.

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి రంగంలో ప్రధానంగా గృహ నిర్మాణంలో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం ఎక్కువగా కన్పిస్తుంది. ఇందులో పలు కొత్త విభాగాలు పుట్టుకొస్తున్నాయి. పోటీ నేపథ్యంలో కొత్త మార్కెట్ల వైపు చూస్తున్నారు. అలాంటి వాటిలో సీనియర్‌ లివింగ్‌ ఒకటి. సరసమైన ఇళ్లు మరొకటి. ఈ తరహావి మరెన్నో ఉన్నాయి. ఇతర నగరాల్లో ఇప్పటికే ఇవి వచ్చాయని.. మన నగరంలోనూ మున్ముందు వీటికి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందులోనూ సవాళ్లు ఉన్నాయని.. ప్రజల ఆదరణ పొందేందుకు, ప్రాజెక్ట్‌ లాభసాటిగా ఉండేందుకు పరిశ్రమ వర్గాలు ఇటీవల జరిగిన ఇన్‌ఫ్రా, రియల్‌ ఎస్టేట్‌ సదస్సులో పలు సూచనలు చేశారు.

వయోధికుల  కోసం..

ప్రస్తుతం ఇళ్లు కొనుగోలు చేస్తున్న వారిలో అత్యధికంగా యువతనే ఉంటున్నారు. వీరంతా తమ బడ్జెట్‌కు అనుగుణంగా వ్యక్తిగత ఇళ్లు, సాధారణ అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాల్లో ఇళ్లు కొంటున్నారు. ఈ విభాగంలో లభ్యత కూడా ఎక్కువే. అయితే యువత వృత్తి, ఉద్యోగరీత్యా వేరే నగరాలు, విదేశాలకు వెళుతుండటంతో ఇక్కడ తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారు. జీవనప్రమాణాలు పెరగడంతో పదవీ వివరణ తర్వాత జీవించే వయస్సు సైతం వృద్ధి చెందుతోంది. వృద్ధాప్యంలో మెరుగైన జీవితం కోసం పెద్దలను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఒక వయస్సు వచ్చాక సాధారణ ఇళ్లలో నివసించడం పెద్దలకు అంత సౌకర్యంగా ఉండటం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకునే సీనియర్‌ లివింగ్‌ విభాగం వచ్చింది. బెంగళూరు, దిల్లీ, ముంబయి లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి ఇళ్ల నిర్మాణం బాగా ప్రాచుర్యం పొందింది. మన దగ్గర రెండు మూడు సంస్థలే తప్ప ఈ విభాగంలో పెద్దగా ప్రాజెక్ట్‌లు రాలేదు. సిటీలో వీటికి మున్ముందు మంచి ఆదరణ ఉంటుందని అంచనా. పెద్దల అవసరాలు తీర్చేలా ముఖ్యంగా నర్సింగ్‌ సేవలు, కామన్‌ కిచెన్‌, పార్కులు, కాలక్షేపం కోసం సదుపాయాలు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ‘బెంగళూరు, దిల్లీ, ముంబయిలో ఉన్నంతగా మన దగ్గర సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్టులు లేవు. ఉన్నవి కూడా నగరం వెలుపలే.. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని భావిస్తున్నారు. వృద్ధుల జనాభా సైతం పెరుగుతోంది. మున్ముందు సీనియర్‌ లివింగ్‌ విభాగంలో ఎంతో డిమాండ్‌ ఉంటుంది. అదే సమయంలో సవాళ్లూ ఉన్నాయి. ఎలాంటి సౌకర్యాలు అక్కడ కల్పిస్తున్నారనేది ప్రధానం. తొలి నాళ్లలో పూర్తిగా పెద్దవాళ్ల కోసమే ఇళ్లు కాకుండా హైబ్రిడ్‌ తరహాలో చేస్తే మేలు అనేది నా భావన’ అని ప్రణవ గ్రూప్‌ ఈడీ బి.రాంబాబు అన్నారు.

సరసమైన  ఇళ్లు..

నగరంలో ప్రస్తుతం ప్రీమియం ఇళ్ల విభాగంలో డిమాండ్‌ ఉండటంతో వీటి నిర్మాణాలు ఎక్కువగా చేపడుతున్నారు. సిటీ నలువైపుల ఆకాశహర్మ్యాలు కన్పిస్తున్నాయి. వీటిలో ఒక్కో ఫ్లాట్‌ ఐదువేల నుంచి 15వేల విస్తీర్ణం వరకు ఉండేలా నిర్మిస్తున్నారు. వీటిలో ఇళ్ల ధరలు రూ.కోటి నుంచి మొదలు పాతిక కోట్ల వరకు ఉన్నాయి. ఈ విభాగం కొవిడ్‌ తర్వాత నుంచి బాగా పుంజుకుంది.  ఈ మార్కెట్‌ మరో ఒకటి రెండేళ్లే అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. సరసమైన ఇళ్ల విభాగంలో డిమాండ్‌ అధికంగా ఉందని.. వాటిపై దృష్టి పెట్టాలని సూచనలు ఉన్నా.. ఆర్థికంగా లాభసాటి కాక ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ముందుకొచ్చి సరసమైన ఇళ్ల కోసం ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో భూములు కేటాయిస్తే బిల్డర్లు నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. సిటీలో 1000 నుంచి 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లకు ఎక్కువగా డిమాండ్‌ ఉంది’ అని మరో బిల్డర్‌ అన్నారు. సాధారణ అపార్ట్‌మెంట్లు సరసమైన ధరల్లోనే లభిస్తున్నా.. గేటెడ్‌ కమ్యూనిటీల్లో సకల సౌకర్యాలతో ఉన్న ప్రాజెక్టుల్లో అలాంటి ధరను కొనుగోలుదారులు ఆశిస్తున్నారు.

స్మార్ట్‌ బిజినెస్‌ హబ్‌లు...

‘మాల్‌, హైస్ట్రీట్‌, ఆఫీస్‌ స్పేస్‌ ఇలా వేర్వేరుగా నిర్మాణాలు నగరంలో చాలా ఉన్నాయి. సిటీలో కార్యాలయాలు 28 శాతం ఖాళీగా ఉన్నాయని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. నిర్మాణంలో ఉన్న భవనాలు సైతం నాలుగైదు ఏళ్లలో పెద్దఎత్తున అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పుడు ప్రణాళిక దశలో ఉన్న ప్రాజెక్టులు ఇప్పటివరకు సిటీలో కట్టిన మాల్స్‌, ఆఫీస్‌ స్పేస్‌ పంథాలో నిర్మిస్తే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ అసెట్‌లు డేటా సెంటర్లు, వేర్‌హౌసింగ్‌ వైపు చూడొచ్చు’ అని కుష్‌మన్‌ వేక్‌ఫీల్డ్‌ ఎండీ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ‘మాల్‌, హైస్ట్రీట్‌, ఆఫీస్‌ కలగలిసిన స్మార్ట్‌ బిజినెస్‌ హబ్‌లను ఇప్పుడు సిటీలో కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. మొదటిసారి ఇలా ప్రయోగం చేస్తున్నారు. ఐటీ స్పేస్‌నే కాకుండా లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌కు నిలయమైన హైదరాబాద్‌లో వీటికి రూపమిచ్చే కార్యాలయాలను కూడా ఒక అసెట్‌ క్లాస్‌గా చూడొచ్చు’ అని లైట్‌హౌస్‌ కాంటన్‌ రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ హెడ్‌ అతుల్‌ భరద్వాజ్‌ అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని