బుద్వేల్‌, మోకిల లేఅవుట్లలో మౌలిక వసతులకు టెండర్లు

మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలోని బుద్వేల్‌(రాజేంద్రనగర్‌), మోకిల(శంకర్‌పల్లి)లోని లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు భారీ లేఅవుట్లలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, తాగునీరు తదితర వసతుల కోసం శుక్రవారం టెండర్లు పిలిచింది.

Published : 17 Feb 2024 01:26 IST

రూ.400 కోట్లతో పనులు  

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలోని బుద్వేల్‌(రాజేంద్రనగర్‌), మోకిల(శంకర్‌పల్లి)లోని లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు భారీ లేఅవుట్లలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, తాగునీరు తదితర వసతుల కోసం శుక్రవారం టెండర్లు పిలిచింది. బుద్వేల్‌ లేఅవుట్‌లో రూ.354.53 కోట్లతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించింది. మోకిలలో రూ.47.65 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 29లోపు  బిడ్లు దాఖలు చేయాల్సి ఉంది. బుద్వేల్‌లో గుట్టపై హెచ్‌ఎండీఏకు 182 ఎకరాల భూములున్నాయి. 100 ఎకరాల్లోని 14 ప్లాట్లకు గతేడాది ఆగస్టులో వేలం నిర్వహించారు. వంద ఎకరాలకు హెచ్‌ఎండీఏ రూ.2000.20 కోట్లు అప్‌సెట్‌ ధరగా నిర్ణయించగా...ఇందుకు ఒకటిన్నర రెట్లు ... రూ.3625.73 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కోకాపేట్‌ మాదిరిగానే దీనిని బహుళ అంతస్తుల నిర్మాణాల జోన్‌గా నిర్ణయించారు. ఏఏఐ అనుమతుల ప్రకారం అపరిమితమైన అంతస్తులు నిర్మించుకునే అవకాశం  ఉండటంతో, ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పోటీపడి  భూములు కొనుగోలు చేశాయి. 18 నెలల్లో ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేయాల్సి ఉండగా...అసెంబ్లీ ఎన్నికల కారణంగా కొంత ఆలస్యం జరిగింది. శంకర్‌పల్లి మండలం మోకిలలో 165 ఎకరాల లేఅవుట్‌లోని 300 ప్లాట్లలో 98,975    చదరపు గజాల స్థలాన్ని హెచ్‌ఎండీఏ వేలం వేసింది. అత్యధికంగా  చదరపు గజం రూ.లక్ష పలికింది. కనిష్ఠంగా  రూ.75 వేలకు అమ్ముడుపోయింది. ఈ ప్లాట్ల వేలంలోనూ రూ.250 కోట్లుపైనే ఆదాయం సమకూరింది. పాడుకున్న వారిలో కొందరు చెల్లింపులు చేయకపోవడంతో ఆయా వేలం పాటలను రద్దు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని