ఇంటి మరమ్మతులకు టాపప్‌ ఉందిగా..

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి కొనుగోలు కోసమే కాదు మరమ్మతులకు, ఇతర అవసరాలకు ప్రత్యేకంగా రుణాలను అందిస్తాయి. మీకు ఇప్పటికే గృహరుణం ఉంటే.. టాపప్‌ లోన్‌గా దీన్ని తీసుకోవచ్చు.

Published : 17 Feb 2024 01:38 IST

ఈనాడు, హైదరాబాద్‌ : బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి కొనుగోలు కోసమే కాదు మరమ్మతులకు, ఇతర అవసరాలకు ప్రత్యేకంగా రుణాలను అందిస్తాయి. మీకు ఇప్పటికే గృహరుణం ఉంటే.. టాపప్‌ లోన్‌గా దీన్ని తీసుకోవచ్చు.

  • రుణదాతలను బట్టి అర్హత మారుతుంది. సాధారణంగా బ్యాంకులు రుణ గ్రహీత ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, ఆస్తి విలువ వంటి అంశాలను చూస్తాయి. ఇంటి మరమ్మతు కోసం ఎంత ఖర్చు అవుతుందనే విషయాలను సంబంధిత నిపుణుల నుంచి తీసుకొని, ఆ నివేదికను బ్యాంకులకు అందించాలి.
  • మరమ్మతు పూర్తి చేయడానికి అవసరమైన మేరకు రుణ మొత్తాన్ని తీసుకోవాలి. మీ ఆదాయం, ఆస్తి విలువను పరిగణనలోకి తీసుకొని కొన్నిసార్లు అధిక మొత్తం ఇస్తామని చెప్పొచ్చు. కానీ,  తిరిగి చెల్లించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. మీరు సులభంగా చెల్లించే మేరకే అప్పు తీసుకోవడం ఎప్పుడూ మంచిది.
  • సాధారణ గృహరుణ వడ్డీ రేట్లతో పోలిస్తే ఈ రుణాలకు వడ్డీ రేట్లు కాస్త అధికంగానే ఉంటాయి. రుణదాతలను బట్టి, ఇది మారుతూ ఉంటుంది. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందిస్తున్న రేట్లను పోల్చి చూసుకున్నాకే నిర్ణయం తీసుకోండి.
  • టాపప్‌ రుణాన్ని బ్యాంకులు కొన్ని నెలల వ్యవధి నుంచి ఏళ్ల వరకు ఇస్తాయి. మీ  చెల్లింపు సామర్థ్యానికి అనుగుణంగా వ్యవధిని ఎంచుకోండి. ఎక్కువ ఆర్థిక ఒత్తిడి లేకుండా చూసుకోండి. 
  • ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రుణాన్ని పొందేందుకు వీలుగా అన్ని పత్రాలనూ సిద్ధంగా ఉంచుకోవాలి. రుణదాత ఏయే పత్రాలు అడుగుతున్నారో ముందే తెలుసుకోండి. గుర్తింపు, నివాసం, ఆదాయం, ఆస్తి యాజమాన్య ధ్రువీకరణలు అడిగేందుకు అవకాశం ఉంది. మరమ్మతుకు సంబంధించిన పూర్తి వివరాలూ అందించాలి. సాధారణంగా ప్రస్తుతం చిన్నపాటి మరమ్మతులకూ రూ.3-4 లక్షలు అవుతోంది.
  • రుణాన్ని బ్యాంకులు ఇంటి యజమాని ఖాతాలో జమచేస్తాయి. మీరు చెబితే  పనులు నిర్వహించిన గుత్తేదారు/ఏజెన్సీకి నేరుగా ఇస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని