మార్చి 8 నుంచి క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల అత్యున్నత సంస్థ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌), హైదరాబాద్‌ 13వ ప్రాపర్టీ షోను మార్చి 8 నుంచి 10 వరకు నిర్వహించనుంది.

Published : 24 Feb 2024 01:31 IST

క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల అత్యున్నత సంస్థ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌), హైదరాబాద్‌ 13వ ప్రాపర్టీ షోను మార్చి 8 నుంచి 10 వరకు నిర్వహించనుంది. మాదాపూర్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో మూడురోజుల పాటూ జరిగే ఈ షోలో పెద్దసంఖ్యలో బిల్డర్‌లు పాలుపంచుకోనున్నారు. నచ్చిన ఫ్లాట్‌, విల్లా ఎంపికకు ఇది సదావకాశమని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు వి.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిటీ నలువైపులా తమ సభ్యులు గత నాలుగైదు ఏళ్లలో చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఒక్కచోట ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. రెండు మూడేళ్లలో పలువురు కొత్త సభ్యులు చేరారని.. వారు నిర్మించిన ఆకాశహార్మ్యాల ప్రాజెక్ట్‌లు ఉన్నాయన్నారు. సరసమైన ధరల్లో ప్రాజెక్ట్‌లు చేస్తున్న బిల్డర్లు ఉన్నారని.. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు.

సీఎం మాటలతో భరోసా పెరిగింది.. : రెండు నెలలుగా మార్కెట్‌ స్తబ్దుగా ఉన్నట్లు అనిపించినా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు విన్న తర్వాత భరోసా పెరిగిందని రాజశేఖర్‌రెడ్డి అన్నారు. క్రెడాయ్‌ సభ్యులు సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించిన అగ్నిమాపక శాఖ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ని రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఆ సమావేశంలో తొలిసారి రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ గురించి మాట్లాడారు. విజన్‌ 2050ను ప్రస్తావించారు. గత పాలకులు చేసిన మంచిని కొనసాగిస్తూ హైదరాబాద్‌ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పడంతో భరోసా పెరిగిందని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 2050 మెగా మాస్లార్‌ ప్లాన్‌ తెలంగాణ అంతటికి అమలు చేస్తామని చెప్పడం రాష్ట్ర అభివృద్ధికే కాదు మా పరిశ్రమ ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు.

10 నుంచి 15 ఏళ్ల వరకు: మార్కెట్‌ సెంటిమెంట్‌ ప్రస్తుతం బాగుందని రాజశేఖర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి మరో 10 నుంచి 15 ఏళ్ల వరకు పని ఉందన్నారు. ప్రాంతీయ వలయ రహదారి పూర్తి చేయడం, శాటిటైల్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం వంటి ఆలోచనలు కొత్త ప్రభుత్వానికి ఉన్నాయని.. వీటితో అభివృద్ధి అన్నివైపులా మరింత విస్తరించేందుకు దోహదం చేస్తుందన్నారు. పుణెలో మగర్‌పట్టాలో నిర్మించిన టౌన్‌షిప్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ కాకుండా టౌన్‌షిప్‌లతో వాక్‌ టూ ఆఫీస్‌ కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు సమస్యలు తీరుతాయని అన్నారు. అక్కడి మోడల్‌ను మనం అనుసరించవచ్చని తెలిపారు. సమావేశంలో క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి బి.జగన్నాథరావు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని