వ్యర్థాలతో రంగురంగుల ఇటుకలు

ఆలోచన ఉంటే ప్రతి వ్యర్థానికి అర్థం చెప్పవచ్చు.. అవే వ్యర్థాల నుంచి ఆదాయం సృష్టించవచ్చు. జలమండలి సైతం అదే బాటలో.. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రేటర్‌ వ్యాప్తంగా 15 లక్షల నల్లాలతో నిత్యం తాగునీటిని సరఫరా చేస్తోంది.

Published : 24 Feb 2024 01:34 IST

వివిధ ఉత్పత్తుల తయారీకి అవకాశం
కార్యాచరణతో సిద్ధమైన జలమండలి

 

ఈనాడు, హైదరాబాద్‌ : ఆలోచన ఉంటే ప్రతి వ్యర్థానికి అర్థం చెప్పవచ్చు.. అవే వ్యర్థాల నుంచి ఆదాయం సృష్టించవచ్చు. జలమండలి సైతం అదే బాటలో.. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రేటర్‌ వ్యాప్తంగా 15 లక్షల నల్లాలతో నిత్యం తాగునీటిని సరఫరా చేస్తోంది. కొత్త నల్లాలకు అనుమతులు, నీటి బిల్లులతో నెలకు రూ.130 కోట్ల దాకా జలమండలికి ఆదాయం వస్తోంది. పెరుగుతున్న జీతభత్యాలు, కరెంటు బిల్లులతో ఈ ఆదాయం ఎటూ సరిపోవడం లేదు. అభివృద్ధి పనులకు మళ్లీ అప్పులే దిక్కు అవుతున్నాయి. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు సంస్థ సిద్ధమైంది.

గ్రేటర్‌లో 2.6 లక్షల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. మరో 20కి పైగా మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీలు) ఉన్నాయి. ఎప్పటికప్పుడు మ్యాన్‌హోళ్లు, ఎస్టీపీలను శుభ్రం చేస్తుంటారు. తద్వారా నిత్యం 200 టన్నుల వ్యర్థాలు బయటపడుతున్నాయి. వీటిని తరలించడానికి ప్రత్యేక వాహనాలున్నాయి. నగర వ్యాప్తంగా సేకరించిన వ్యర్థాలను సమీపంలోని ఎస్టీపీలు, జలమండలి ఇతర స్థలాల్లో డంపు చేస్తున్నారు. వినూత్నంగా ఆలోచించిన జలమండలి ఈ వ్యర్థాలను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇతర దేశాల్లో ఇలాంటి వ్యర్థాల రీసెక్లింగ్‌తో వేర్వేరు అవసరాలకు వాడుకుంటున్నారు. ఎస్టీపీలు, మ్యాన్‌హోళ్ల నుంచి వచ్చే చెత్తలో ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలు ఇతర వ్యర్థాల సైతం కలిసిఉంటున్నాయి. మొత్తం 200టన్నుల్లో 50 టన్నులు ఇవే. మిగతా 150 టన్నుల్లో ఎక్కువ భాగం సన్నటి ఇసుకే. దీనిని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చని జలమండలి భావిస్తోంది. ముఖ్యంగా ఉద్యానవనాల్లో కాలి బాటలకు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇతర బహళ అంతస్తులు, మాల్స్‌ నిర్మాణాల్లో సెల్లార్లలో ఫ్లోరింగ్‌కు వాడే పేవర్‌ బ్లాక్‌లు తయారు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రహరీలు, ఇళ్ల నిర్మాణం, ఇతర అవసరాలకు వినియోగించే కెర్బ్‌ స్టోన్లు కూడా ఈ ఇసుకతో ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ బ్లాక్‌లకు మంచి డిమాండ్‌ ఉంది. రకరకాల రంగుల్లో కూడా వీటిని తయారు చేసే అవకాశముంది. ప్రస్తుతం జలమండలి టెండర్ల ద్వారా ఏజెన్సీకు ఈ బాధ్యతలను అప్పగించనుంది. ఉత్పత్తులు తయారీ, అమ్మకాలు అన్నీ సదరు ప్రైవేటు ఏజెన్సీనే చేపట్టనుంది. ఒప్పందంలో భాగంగా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని జలమండలికి అందించనుంది. త్వరలో ఈ ఉత్పత్తుల తయారీ శ్రీకారం చుట్టనున్నట్లు జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీధర్‌బాబు తెలిపారు.

ఫీకల్‌ స్లడ్జ్‌తోనూ..: గ్రేటర్‌ వ్యాప్తంగా జలమండలికి ఇరవైకి పైగా మురుగు నీటి శుద్ధి కేంద్రాలున్నాయి. నగర వ్యాప్తంగా ఇళ్ల నుంచి మానవ వ్యర్థాలు ఈ ఎస్టీపీలకు పైపులైన్ల ద్వారా చేరిన తర్వాత వాటిని శుద్ధిచేస్తారు. చివర్లో వచ్చే ఒక విధమైన పదార్థాన్ని సేంద్రియ ఎరువులు, ఇతర అవసరాల కోసం జలమండలి విక్రయిస్తోంది. అన్ని ఎస్టీపీల్లో కలిసి నిత్యం 80 టన్నుల ఈ ఉత్పత్తి అవుతుండగా.. టన్ను రూ.680 లెక్కన విక్రయిసున్నారు. త్వరలో మరో 30 ఎస్టీపీలు రానుండటంతో మరింత ఆదాయం పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని