Hyderabad: ఇంత ఎత్తు భవనాలు ఎలా కడుతున్నారు?

ఆకాశహర్మ్యాలకు నిలయంగా హైదరాబాద్‌ మారింది. గచ్చిబౌలి, కొండాపూర్‌, నార్సింగి చుట్టుపక్కలనే కాదు.. కిస్మత్‌పూర్‌, శంషాబాద్‌,  ఉప్పల్‌, పోచారం, ఘట్‌కేసర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, అబిడ్స్‌, పంజాగుట్ట, గుడిమల్కాపూర్‌లో భారీ అంతస్తులు వస్తున్నాయి.

Updated : 02 Mar 2024 07:44 IST

అధ్యయనానికి సిటీకి వచ్చిన దేశంలోని వేర్వేరు నగరాల బిల్డర్లు
మూడు రోజుల స్టడీటూర్‌ నిర్వహిస్తున్న క్రెడాయ్‌, ఎంఎస్‌ఎంఈ

ఈనాడు, హైదరాబాద్‌: ఆకాశహర్మ్యాలకు నిలయంగా హైదరాబాద్‌ మారింది. గచ్చిబౌలి, కొండాపూర్‌, నార్సింగి చుట్టుపక్కలనే కాదు.. కిస్మత్‌పూర్‌, శంషాబాద్‌,  ఉప్పల్‌, పోచారం, ఘట్‌కేసర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, అబిడ్స్‌, పంజాగుట్ట, గుడిమల్కాపూర్‌లో భారీ అంతస్తులు వస్తున్నాయి. ముంబయి తర్వాత ఎక్కువ సంఖ్యలో ఇక్కడే కడుతున్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోని బిల్డర్లకే కాదు.. మెట్రో నగరాల్లోని డెవలపర్లకు మన నగరంలోని నిర్మాణాలు అధ్యయన కేంద్రాలుగా మారాయి. సిటీలో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాల ప్రాజెక్ట్‌లు, ఉపయోగిస్తున్న అధునాతన సాంకేతికత, ప్రీకాస్టింగ్‌ నిర్మాణాల వరకు బిల్డర్లు తెలుసుకుంటున్నారు. క్రెడాయ్‌, ఎంఎస్‌ఎంఈ రెండో స్టడీ టూర్‌ సిటీలో శుక్రవారం నుంచి మొదలైంది. ఆదివారం వరకు జరుగుతుంది. దేశంలోని వేర్వేరు క్రెడాయ్‌ ఛాప్టర్ల నుంచి వచ్చిన బిల్డర్లు ఇందులో పాల్గొంటున్నారు.

ప్రీకాస్టింగ్‌ సాంకేతికత గురించి తెలుసుకున్నాం..
వెలుమూరి భీమశంకర్‌రావు, సంయుక్త కార్యదర్శి, క్రెడాయ్‌ ఏపీ

దిల్లీ, ముంబయి, చత్తీస్‌గఢ్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ ఛాప్టర్ల నుంచి స్టడీటూర్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాం. ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లను ఎలా అభివృద్ధి చేస్తున్నారు.. పర్యావరణపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.. వ్యాపార వృద్ధి కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి.. అనే అంశాలు ఈ పర్యటనలో తెలుసుకుంటున్నాం. కోయంబత్తూర్‌, బెంగళూరులో ప్రీకాస్టింగ్‌లో నిర్మాణాలు ఇదివరకే వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో అంతకంటే అత్యాధునిక సాంకేతికతతో మైహోం సంస్థ కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ చేస్తోంది. వారి సైట్‌కు వెళ్లి పరిశీలించాం. ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేసేందుకు, తక్కువ మంది కార్మికులతో పనిచేసేందుకు ఈ సాంకేతికత వినియోగిస్తున్నారు. 1200 మంది అవసరమైన చోట ప్రీకాస్టింగ్‌ కారణంగా 400 మందితో మాత్రమే పనిచేయిస్తున్న నిర్మాణ సాంకేతికత గురించి తెలుసుకున్నాం. తెల్లాపూర్‌లో 450 ఎకరాల్లో దశలవారీగా రాజపుష్ప నిర్మిస్తున్న లైఫ్‌స్టైల్‌ విలేజ్‌ను సందర్శించాం. ఇక్కడే విల్లాలు, ఆకాశహర్మ్యాలు, ఆసుపత్రి, ఐటీ టవర్లు ఉండేలా ఒక ఊరును అభివృద్ధి చేస్తున్నారు. 50 శాతం స్థలాన్ని ఖాళీగా వదిలి పచ్చదనం పెంపొందిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా వ్యాపార రంగంలో ఎలా రాణించాలో తెలిపేలా ఐఎస్‌బీలో సెషన్‌ నిర్వహించారు. పర్యావరణహిత భవనాలకు రేటింగ్‌ ఇచ్చే ఐజీబీసీతోనూ సమావేశం కాబోతున్నాం. క్రెడాయ్‌ తెలంగాణ, హైదరాబాద్‌ సభ్యులతోనూ భేటీ ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు