ఏసీలు కొంటున్నారా.. వీటి గురించి తెలుసుకోండి

వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు వేసవి తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉక్కపోత మొదలైంది. ఫ్యాను కింద సైతం ఉండలేని పరిస్థితి. కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాదు. దీంతో ప్రజలు ఏసీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Updated : 16 Mar 2024 09:07 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు వేసవి తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉక్కపోత మొదలైంది. ఫ్యాను కింద సైతం ఉండలేని పరిస్థితి. కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాదు. దీంతో ప్రజలు ఏసీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ-కామర్స్‌ యాప్‌లలో, బయట మార్కెట్లలో ఏసీల విక్రయాలు జోరందుకున్నాయి. వాటి ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రత్యేకతలు, రేటింగ్‌, వారంటీ తదితరాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొనుగోలుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • గది పరిమాణానికి తగిన సామర్థ్యం ఉన్న ఏసీ తీసుకోవాలి. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-160 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 160-200 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. పెద్ద గదికి తక్కువ సామర్థ్యం కలిగిన వాటిని కొనుగోలు చేస్తే కరెంట్‌ వినియోగం పెరుగుతుంది.
  • ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్‌ (ఐఎస్‌ఈఈఆర్‌) రేటింగ్‌ చూడాలి. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్‌ రేటింగ్‌ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్‌ రేట్‌ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్‌ స్టార్‌ ఉంటుంది. రేటింగ్‌ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్‌ రేటింగ్‌ ఉంటుంది. రేటింగ్‌లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుంది. తక్కువగా వినియోగించేవారికి 3 స్టార్‌ రేటింగ్‌ కలిగినవి సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
  • నిత్యం ఏసీని ఉపయోగించేవారు ఇన్వర్టర్‌తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకుంటే మంచిది. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్‌ ఇన్వర్టర్‌ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్‌, ఆఫ్‌ మాత్రమే ఉంటాయి. ప్రతిసారి ఆనాఫ్‌ అవ్వడం వల్ల గది ఉష్ణోగ్రత స్థిరంగా ఉండకపోవడంతో పాటు విద్యుత్తు వినియోగం అధికంగా ఉంటుంది. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్‌ ఇన్వర్టర్‌ ఏసీ కొనుక్కోవచ్చు.
  • మార్కెట్‌లో చాలా వరకు కన్వర్ట్‌బుల్‌ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల అవుట్‌డోర్‌ యూనిట్‌లోని ఫ్యాన్‌ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది.
  • ఏసీతో పాటు తప్పకుండా స్టెబిలైజర్‌ కొనుగోలు చేయాలి. వోల్టేజ్‌ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్‌ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్‌ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్‌ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారానూ నిర్వహించవచ్చు.
  •  ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పీసీబీ వారంటీ ఉన్న వాటిని కొనుగోలు చేయాలి. పీసీబీ పాడైతే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. కనీసం 5 సంవత్సరాల పీసీబీ వారంటీ, 10 సంవత్సరాల ఇన్వర్టర్‌ కంప్రెసర్‌ వారంటీ ఉన్న వాటిని ఎంచుకోవడం మంచిది.

ధరల విషయంలో జాగ్రత్త..

ఈ-కామర్స్‌ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్‌ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి. కొనుగోలు చేసేముందు సంబంధిత బ్రాండ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రత్యేకతలను పరిశీలించాలి. డెలివరీ, ఇనిస్టాలేషన్‌ ఛార్జీల గురించి ముందుగానే మాట్లాడుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని