సుస్థిరం వైపు అడుగులు

బహుళజాతి సంస్థలు మొదటి నుంచి పర్యావరణహిత భవనాల వైపు మొగ్గు చూపుతున్నాయి.

Published : 23 Mar 2024 00:43 IST

బహుళజాతి సంస్థలు మొదటి నుంచి పర్యావరణహిత భవనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. గ్రేడ్‌ ‘ఏ’ భవనాలనే ఎంపిక చేసుకుంటున్నాయి. వీరి బాటలోనే దేశీయ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. మూడింట రెండొంతుల కార్పొరేట్‌ సంస్థలు తమ కార్యాలయాలు సస్టెయినబుల్‌గా ఉండాలని కోరుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు కొత్త భవనాలను కడుతున్నాయి. వీటిపై ఇంకా అవగాహన పెరగాల్సి ఉందని ఐజీబీసీ అంటోంది.  

ఈనాడు, హైదరాబాద్‌

దేశంలో నూతన భవనాలు విద్యుత్తు ఆదా డిజైన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొత్త నిర్మాణాల్లో ఈ మేరకు జాగ్రత్తలు బిల్డర్లు తీసుకుంటున్నారు. పాత వాటిని రెట్రోఫిట్టింగ్‌ చేయిస్తున్నారు. భవనం మొత్తానికి కావాల్సిన విద్యుత్తును సౌర ఇంధనం ద్వారా సమకూర్చుకుంటున్నారు. నెట్‌ జీరో భవనాలుగా ధ్రువీకరణతో కార్బన్‌ క్రెడిట్స్‌ పొందుతున్నారు. నిర్మాణ సమయంలోనే పర్యావరణహిత ఉత్పత్తుల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. నీటి ఆదాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని నిర్మాణ సమయంలో పునర్వినియోగిస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక వీటినే మొక్కలు, ఫ్లషింగ్‌కు వాడేలా భవనాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవల వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో చాలావరకు గ్రీన్‌ బిల్డింగ్‌ సర్టిఫికెట్‌ కల్గినవే కావడం విశేషం.

స్మార్ట్‌ సాంకేతికతలతో..

కార్పొరేట్‌ కార్యాలయాల్లో విద్యుత్తు వినియోగం అధికంగా ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు స్మార్ట్‌ సాంకేతికతలను వినియోగిస్తున్నారు. నీటి ఆదా కోసం వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఎంత ఆదా చేశాం? పర్యావరణానికి ఏ మేరకు నష్టం తగ్గించగలిగాం... అనేది ఎప్పటికప్పుడు సరిచూసుకునేందుకు ఆడిట్‌లను నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతి దశలోనూ కీలకాంశాలపై నిర్మాణ సంస్థలు దృష్టిసారిస్తున్నారు.

పచ్చదనానికి పెద్దపీట..

స్థలం ఉంది కదా అని పూర్తిగా కాంక్రీట్‌తో నింపేయకుండా తక్కువ విస్తీర్ణంలో ఎత్తైన భవనాలు కడుతూ.. జాగాను ఎక్కువ ఖాళీగా వదిలిపెడుతున్నారు. దానిని పచ్చదనం పెంచడానికి ఉపయోగిస్తున్నారు. ఐదు అంతస్తులు దాటితే ఆపైన అంతస్తుల్లోనూ పచ్చదనం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. బయటేకాదు ఇండోర్‌లోనూ మొక్కలతో పరిసరాలను ఆహ్లాదకరంగా మారుస్తున్నారు. ఉద్యోగులు ఎదుర్కొనే ఒత్తిడిని దూరం చేస్తాయని.. ఫలితంగా ఉత్పాదకత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతుండటంతో ఈ దిశగా కార్పొరేట్‌ సంస్థలు కార్యాలయాలను డిజైన్‌ చేయిస్తున్నాయి.

సవాళ్లున్నాయ్‌..

హరిత భవనాలు పెరుగుతున్నప్పటికీ ఇప్పటికీ వీటి వాటా పరిమితంగానే ఉంది. ఆయా భవనాలు కట్టేవారే కాదు.. వాటిని లీజుకు తీసుకునేవారిలోనూ అవగాహన లేమి సవాల్‌గా నిలుస్తోంది. హరిత ఉత్పత్తుల గురించి, అవి ఎక్కడ దొరుకుతాయనే అవగాహన లేదంటున్నవారు 46.7 శాతం మంది ఉన్నారు. హరిత ఉత్పత్తులతో వ్యయం పెరుగుతుందని.. బడ్జెట్‌ పరిమితులు ఉన్నాయని అంటున్న సంస్థలు 40 శాతం ఉన్నాయి. మార్గదర్శకం చేసేవారు లేకపోవడంతో కూడా కొందరు ఇటువైపు చూడట్లేదు. ఇలాంటి సంస్థలు 13 శాతం వరకు ఉన్నాయి. నిపుణుల లభ్యతపై సందేహాలను వ్యక్తం చేసే సంస్థలు మరో 20 శాతం ఉన్నాయి. వీటన్నింటిని క్రమంగా అధిగమించాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని