చలువ టైల్స్‌ వేసేద్దాం వేసవిని దాటేద్దాం

వేసవి ప్రారంభంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య భవనాల్లో సైతం ఉండలేని పరిస్థితి.

Published : 30 Mar 2024 01:24 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

వేసవి ప్రారంభంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య భవనాల్లో సైతం ఉండలేని పరిస్థితి. చల్లదనం కోసం ఏసీల వినియోగం పెరుగుతోంది. దీంతో కాలుష్య ఉద్గారాలు అధికమై వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఏసీలు అమర్చుకోలేని సామాన్యులు వేడి భరించలేక సతమతం అవుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు చలువ పైకప్పు (కూల్‌ రూఫ్‌) ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల భవనం లోపల వేడి తగ్గడంతో పాటు విద్యుత్తు ఆదా చేసుకోవచ్చు. కొత్త నిర్మాణాలతో పాటు పాత భవనాలకు సైతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల గది లోపలి ఉష్ణోగ్రత 5-8 డిగ్రీలు, పైకప్పు ఉపరితల ఉష్ణోగ్రత 15-18 డిగ్రీలు తగ్గుతుంది. చలువ పైకప్పు ఏర్పాటు చేసుకునేందుకు విభిన్న రకాల టైల్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

ఇరుకిరుకు నివాసాలు, కాంక్రీటు శ్లాబులు, రేకుల ఇళ్లలో నివసించే వారికి కూల్‌ రూఫ్‌ ఉపయోగపడుతుంది. నిర్మాణంలో ఉన్న భవనాలకు ఆధునిక సాంకేతికత ద్వారా పైకప్పు నిర్మాణంలో ఉపయోగించే సామగ్రిలో మార్పులు చేయడం, నిర్మాణ సమయంలో ప్రత్యేక రసాయనాలు వినియోగించడం వల్ల పైకప్పుపై పడిన సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతాయి. ఫలితంగా ఇంటి లోపలకు వచ్చే వేడి తగ్గుతుంది. ఇప్పటికే నిర్మించిన భవనాలపై కూల్‌ రూఫ్‌ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే పలు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

దీర్ఘకాలానికి

టైల్స్‌ను ఉపయోగించి చలువ పైకప్పు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతను బట్టి చదరపు అడుగుకి రూ.100-1000 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కూల్‌రూఫ్‌ టైల్స్‌ సుమారు 80 శాతం సూర్యకిరణాలను పరావర్తనం చేస్తాయి. విభిన్న రంగులు, డిజైన్‌లు, సైజులలో ఇవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. టైల్స్‌ను అమర్చేందుకు చదరపు అడుగుకి రూ.25-60 వసూలు చేస్తున్నారు. ఒకసారి వీటిని ఏర్పాటు చేసుకుంటే దీర్ఘకాలం మన్నికనిస్తాయి.

నిర్వహణ ముఖ్యమే

ఉష్ణోగ్రతను తగ్గించాలంటే కూల్‌రూఫ్‌ టైల్స్‌ నిర్వహణలో కొన్ని చిట్కాలు పాటించాలి. పైకప్పుపై పేరుకుపోయే వ్యర్థాలు, శిథిలాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. టైల్స్‌ నాచు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిర్వహణ బాగుంటే వీటి మన్నిక పెరుగుతుంది.


25 సంవత్సరాల మన్నిక : ఎన్‌.సత్యేంద్ర ప్రసాద్‌, రీజెన్సీ సిరామిక్స్‌ ఎండీ

పైకప్పుపై టైల్స్‌ వేసుకుంటే సుమారు 25 ఏళ్ల పాటు మన్నుతాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలతోపాటు పాత వాటికి సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. సామాన్యులకూ అందుబాటు ధరల్లో ఉన్నాయి. ఈ విధానం వల్ల పర్యావరణానికి సైతం మేలు చేకూరుతుంది. వేసవిలోనే కాకుండా శీతాకాలంలో సైతం బయటి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని