సాంకేతికత జోడించు.. సురక్షితంగా జీవించు

అందమైన ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కల.. సదుపాయాలను ఏరికోరి ఎంపిక చేసుకుంటారు. అన్ని వసతులు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అందమైన గృహాలంకరణ (ఇంటీరియర్‌ డిజైన్‌)కు ప్రాధాన్యం ఇస్తారు.

Published : 06 Apr 2024 02:22 IST

స్మార్ట్‌ ఇళ్లపై నగరవాసుల్లో పెరుగుతున్న ఆసక్తి

అందమైన ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కల.. సదుపాయాలను ఏరికోరి ఎంపిక చేసుకుంటారు. అన్ని వసతులు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అందమైన గృహాలంకరణ (ఇంటీరియర్‌ డిజైన్‌)కు ప్రాధాన్యం ఇస్తారు. దీనికి సాంకేతికతనూ జోడిస్తే.. ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. కొంత మంది నిర్మాణదారులు ఆటోమేషన్‌ సదుపాయంతో ఇళ్లను తీర్చిదిద్దుతున్నారు. విస్తీర్ణాన్ని బట్టి ఇందుకు రూ.2 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. కొన్ని నిర్మాణ సంస్థలు ప్యాకేజీల     రూపంలోనూ అందిస్తున్నాయి.

జీడిమెట్ల, న్యూస్‌టుడే: ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో బల్బులు ఆపేశామా..? ఏసీ కట్టేశామా.. అసలు ఇంటికి తాళం వేశామా..? వంటి అనుమానాలు సందేహాలు చాలా మందిలో వస్తుంటాయి. కొన్ని ప్రత్యేక డిజైన్‌లను ఎంచుకోవడం, సాంకేతిక పరికరాల సాయంతో ఆయా అంశాలను మనం ఎక్కడి నుంచైనా పర్యవేక్షించే సౌలభ్యం అందుబాటులో ఉంది. చేతిలో చరవాణి ఉంటే చాలు అందులో యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసి బయట నుంచే తాళం వేయొచ్చు. అంతేకాదు... బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు, టీవీలను నియంత్రించే వెసులుబాటూ ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.  

దొంగలు ప్రవేశిస్తే సమాచారం..

సాంకేతిక హంగులు సమకూర్చుకుంటే ఇళ్లకు రెట్టింపు భద్రత ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే.. సెన్సర్ల సాయంతో గుర్తించవచ్చు. దొంగలు తలుపులు, కిటికీలు బద్దలు కొట్టే సమయంలో వచ్చే శబ్దం ద్వారా.. అనుసంధానిత చరవాణికి అప్రమత్తత సందేశాలు వస్తాయి. ఆ సమయంలో ఇంట్లో ఏం జరుగుతోందో వీడియో ఆన్‌ చేసి చూసుకోవడంతో పాటు ప్రవేశించిన వారి చిత్రాలను తీసుకొని పోలీసులకు సమాచారం అందించొచ్చు.

సాధారణ ఇళ్లకూ ఉపయోగించొచ్చు..

సాధారణ ఇళ్లకూ ఈ టెక్నాలజీని వినియోగించుకొనే ఒరవడి నగరంలో క్రమంగా పెరుగుతోంది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో, కొన్ని ఎలక్ట్రానిక్స్‌ దుకాణాల్లో దొరికే స్మార్ట్‌ పరికరాలను ఈ ఇళ్లలో అమరుస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఎక్కువగా వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని విద్యుత్తు సదుపాయంతో పనిచేస్తే.. మరికొన్ని బ్యాటరీల సాయంతోనూ పనిచేస్తాయి.

ఇంట్లో లేకపోయినా అతిథికి మర్యాదలు  

కార్యాలయంలో పని ఒత్తిడి.. లేదా అత్యవసరంగా బయటకు వెళ్తే వెంటనే ఇంటికి తిరిగి రాలేని పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. ఆ సమయంలో ఇంటికి ఎవరైనా అతిథి వస్తే హడావుడిగా వెనక్కి రావాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో లేకపోయినా.. తలుపులు తెరిచి స్వాగతం పలకొచ్చు. ఇంట్లోకి వెళ్లగానే ఆటోమేషన్‌ సాంకేతికతతో బల్బులు, ఏసీ, టీవీ ఆన్‌ చేయొచ్చు. స్నానం చేసేందుకు వేడి నీళ్లనూ  సిద్ధంగా ఉంచేయొచ్చు. ఇవన్నీ క్షణాల్లో చకచక చేయడంతో పాటు ఆహారాన్ని ఫుడ్‌ డెలివరీ సంస్థల నుంచి పంపిస్తు ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. ఇదంతా స్మార్ట్‌ ఇళ్లతోనే సాధ్యమన్నది నిపుణులు చెబుతున్న మాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని