స్లాబ్‌కు ఓపీసీ.. గోడలకు పీసీసీ

సొంతింటి కలలు కనేవారు వాటిని సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు.

Updated : 13 Apr 2024 01:38 IST

ఐఎస్‌ఐ మార్క్‌ 550 గ్రేడ్‌ స్టీల్‌ వాడటం ఉత్తమం

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: సొంతింటి కలలు కనేవారు వాటిని సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఆ కష్టం వృథా కాకుండా ఉండేందుకు పునాది నుంచే ఇంటి నిర్మాణం దృఢంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మూడు తరాల వరకు ఇళ్లు దృఢంగా, మన్నికగా ఉండాలంటే ఫుట్టింగులు మొదలు ప్లింత్‌, పిల్లర్లు, బీమ్‌లతోపాటు స్లాబుల నిర్మాణంలో 550 గ్రేడ్‌ స్టీల్‌(ఇనుప చువ్వల)ను వాడడం తప్పనిసరన్న విషయాన్ని నిర్మాణదారులు గ్రహించాలి. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ సంస్థ ప్రతి ఏటా ఐఎస్‌ఐ పరీక్షలు చేసి ధృవీకరించే సంస్థలో తయారయ్యే స్టీల్‌ను వాడడం ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లర్లు, బీముల నిర్మాణానికి ఓపీసీ(ఆర్డినరీ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌) గ్రేడ్‌ 53. గోడలకు పీపీసీ(పోర్ట్‌ల్యాండ్‌ పోజోలానా సిమెంట్‌) వాడితే ఇంటి నిర్మాణం మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

ఇంజినీరింగ్‌ సూచనల మేరకే

ఇంటి నిర్మాణంలో ఫుట్టింగులు, పిల్లర్లు, ప్లింత్‌ బీములతోపాటు స్లాబు నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్లాబు పటిష్ఠంగా ఉండడంతోపాటు తరాల పాటూ దృఢంగా ఉండాలంటే 20ఎంఎం కవరింగ్‌తో స్లాబును నిర్మించాలి. 20ఎంఎం కవరింగ్‌తో కాకుండా స్లాబును నిర్మిస్తే అది పట్టుకోల్పోయి 20ఏళ్లకే పెచ్చులూడే ప్రమాదం ఉంటుంది.

  • 20ఎంఎం కవరింగ్‌తో నిర్మించే స్లాబులు దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి.
  • చాలావరకు నిర్మాణదారులు మేస్త్రీల సూచనల మేరకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తుంటారు. ఇంటి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పద్ధతులపై పట్టు ఉన్న సివిల్‌ ఇంజినీర్ల సూచనల మేరకు ముందుకెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరడుగుల లోతునుంచి ఫుట్టింగులు

తమ ఇంటి కలను నెరవేర్చుకోవాలన్న సంకల్పంతో ముందుకెళ్లేవారు ఫుట్టింగులనుంచే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 150గజాలలో ఇళ్లను నిర్మించుకునేవారు ఆరడుగుల లోతులో ఫుట్టింగులను ప్రారంభించాలి. ఇందుకుగాను ఒక్కో పిల్లర్‌కు 16ఎంఎం సామర్థ్యం కలిగిన 6చువ్వలు 6 ఇంచులకో 8ఎంఎం రింగును ఏర్పాటు చేసేలా చూడాలి. టై/ప్లింత్‌ బీములతోపాటు స్లాబుల నిర్మాణానికి 12ఎంఎం సామర్థ్యం కలిగిన చువ్వలను వినియోగించాలి.

మెట్ల నిర్మాణంలో 8, 10 ఎంఎం సామర్థ్యం కలిగిన చువ్వలను వాడాలి. స్లాబుల నిర్మాణంలో 2వే మ్యాట్‌ ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే 2 వే మ్యాట్‌తో పోల్చుకుంటే వన్‌ వే మ్యాట్‌లో 100 చువ్వలు తక్కువగా వినియోగిస్తారు. అలా చేయడంవల్ల నిర్మాణంలో దృఢత్వం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు