నివాసాల్లో కొత్త నేస్తాలు

ఇల్లు కొనేటప్పుడు రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి? నీటి వసతి ఎలా ఉంది? భవిష్యత్తులో వృద్ధి ఎలా ఉంటుంది?  సమీపంలో పిల్లలకు మంచి పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయా? పెద్దలకు కాలక్షేపం అవుతుందా? కార్యాలయానికి దగ్గరుందా? ధర ఎంత? ఇలా పెద్ద జాబితానే ఉంటుంది.

Published : 14 Jan 2023 01:07 IST

పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా పార్కులు
కొత్త ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఇస్తున్న డెవలపర్లు
ఈనాడు, హైదరాబాద్‌

ల్లు కొనేటప్పుడు రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి? నీటి వసతి ఎలా ఉంది? భవిష్యత్తులో వృద్ధి ఎలా ఉంటుంది?  సమీపంలో పిల్లలకు మంచి పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయా? పెద్దలకు కాలక్షేపం అవుతుందా? కార్యాలయానికి దగ్గరుందా? ధర ఎంత? ఇలా పెద్ద జాబితానే ఉంటుంది. ఇందులో ఇప్పుడు మరోటి వచ్చి చేరింది. పెంపుడు జంతువులకు అనుకూలమైన కమ్యూనిటీనా? కాదా అనేది కూడా కొనుగోలుదారులు చూస్తున్నారు. ఇప్పటికే పూర్తైన ప్రాజెక్టుల్లో జంతు ప్రేమికులు.. ఇరుగుపొరుగు ఇళ్ల నుంచి ఎదుర్కొంటున్న అభ్యంతరాలతో నిర్మాణ సంస్థలు ఈ లోటు మాత్రం ఎందుకు ఉండాలని ఆలోచిస్తున్నాయి. పెంపుడు జంతువులకు అనుకూలంగా ఉండేలా కొత్త సౌకర్యాలు కల్పిస్తున్నాయి. పిల్లలు, పెద్దల కోసం వేర్వేరు పార్కులే కాదు.. కొత్తగా పెట్‌పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాయి.

నగరంలో జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇదివరకు వ్యక్తిగత ఇళ్లలో కుక్కలు, పిల్లులు, చిలకలు, కుందేళ్లు, తాబేళ్లు, మేకలు పెంచుకునేవారు. వాటి కోసం ప్రత్యేకంగా కొంత స్థలం కేటాయించేవారు. ఉదయం, సాయంత్రం కుదిరినప్పుడు వాటిని బయటికి తీసుకెళ్లేవారు. వాటితో కలిసి నడకకు వెళ్లేవారు. వీటి పెంపకానికి ప్రతినెలా భారీగా ఖర్చు చేసేవారు సిటీలో ఉన్నారు. రూ.లక్షలు వెచ్చించి విదేశీ పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. రూ.కోట్లు ఇచ్చినా వాటిని విక్రయించం అనేవారు ఉన్నారు. చాలామంది వీటితో గడుపుతూ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నారు. వాటితో ఆడుకుంటూ ఒత్తిడి నుంచి బయటపడుతున్నారు. అందుకే ఇంట్లో వాళ్లతో సమానంగా వీటికి వేడుకలు చేయడం.. చనిపోతే కుంగుబాటుకు గురవడం చూశాం. అంతగా పెంపుడు జంతువులతో పెనవేసుకుంటున్న బంధం కావడంతో వ్యక్తిగత ఇళ్ల నుంచి అపార్ట్‌మెంట్లకు మారినా.. వాటితో స్నేహాన్ని వదులుకోలేకపోతున్నారు. ఇప్పుడంతా బహుళ అంతస్తుల భవనాలు. ఉద్యోగ కేంద్రాలకు చేరువలో ఉండేందుకు వీలుగా అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలో ఎక్కువ మంది ఉంటున్నారు. జంతువులను పెంచుకోవాలని ఉన్నా కుదరక కొంతమంది మానుకుంటే.. మరికొంతమంది అపార్ట్‌మెంట్లలోనూ పెంచుకుంటున్నారు. ఇక్కడే ఇరుగుపొరుగు, అసోసియేషన్లతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. కారిడార్లు, లిఫ్ట్‌లు, ప్రాంగణాలను పాడు చేస్తున్నాయని గేటెడ్‌ కమ్యూనిటీల్లోనూ ఫిర్యాదులు ఎదుర్కొంటున్నారు. ఇక అద్దెకుండే పెంపుడు జంతు ప్రేమికుల కష్టాలు చెప్పలేం. కుక్కలు, పిల్లులను పెంచుకునేలా ఇళ్ల నిర్మాణం చేపట్టవచ్చుగా అని తమ బిల్డర్‌ కలిసిన ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నారు. వీటికి మార్కెట్‌ ఉందని గ్రహించిన నిర్మాణసంస్థలు తమ కొత్త ప్రాజెక్టుల్లో పెంపుడు జంతువులకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

పార్కులు వస్తున్నాయ్‌

సిటీలో జంతు ప్రేమికుల పరిస్థితిని చూసి జీహెచ్‌ఎంసీ మొదటిసారి గచ్చిబౌలిలో డాగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేసింది. వీటి చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ వాసులు సెలవు రోజుల్లో తమ పెంపుడు జంతువులను తీసుకొని ఇక్కడికి వస్తుంటారు. దూరంగా ఉన్న కమ్యూనిటీల్లోని జంతు ప్రేమికుల పరిస్థితి ఏంటి? ఇంట్లో మహిళలు, పెద్దవాళ్లు మాత్రమే ఉంటే పెంపుడు జంతువులను బయటికి తీసుకురావడం కూడా కష్టమే. ఎక్కడికీ తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచితే క్రూరంగా ప్రవర్తించే ప్రమాదం ఉండటంతో పెంపుడు జంతువులకు దూరం అవుతున్నారు. వీరి ఇబ్బందులను  దూరం చేసేలా కొత్త గేటెడ్‌ కమ్యూనిటీలు వస్తున్నాయి. వీటికోసం ప్రత్యేకంగా పార్కులను నిర్మిస్తున్నారు. అందులో పెంపుడు జంతువులను ఆడించేందుకు వీలుగా రింగ్‌లు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ‘మేము ఇటీవల కొత్తగా ప్రారంభించిన విరాట్‌ ప్రాజెక్టులో చాలా అదనపు సదుపాయాలు కల్పిస్తున్నాం. జంతు ప్రేమికుల కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పెట్‌ పార్క్‌ను ఏర్పాటు చేశాం’ అని వెర్టెక్స్‌ హోమ్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.జి.మురళీమోహన్‌ తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని