ఇల్లు కొనే ముందు ఇవన్నీ చూడాల్సిందే

House buying guide: ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లూ ఎక్కువే ఉన్నాయి. కేవలం పొదుపు, పెట్టుబడి పెట్టిన సొమ్ముతోనే ఇల్లు కొనడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకనే గృహరుణంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు.

Updated : 03 Feb 2024 16:01 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లూ ఎక్కువే ఉన్నాయి. కేవలం పొదుపు, పెట్టుబడి పెట్టిన సొమ్ముతోనే ఇల్లు కొనడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకనే గృహరుణంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు.

ఎంత పొదుపు చేస్తారు..? : రుణ అర్హత నిర్ణయించడంలో మీ ఆదాయం ఎంతో ప్రధానం. ఇందులోనూ ఖర్చులు పోను ఎంత మిగులుతోంది అన్నది కీలకం. సాధారణంగా రుణదాతలు ఆరు నెలల బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తారు. మీ ఆదాయం, ఖర్చులు, మిగులు తదితర అంశాలను విపులంగా తెలుసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. వచ్చిన ఆదాయంలో కనీసం 30 శాతం వరకూ మిగులు కనిపిస్తే, ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా బ్యాంకులు గుర్తిస్తాయి. ఒకవేళ మీరున్న పరిస్థితుల్లో మీ దగ్గర 30-40 శాతం మిగులు లేకపోతే, ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది. పొదుపు ఎక్కువగా ఉన్నప్పుడే అప్పు తీసుకునే ప్రయత్నం చేయండి.

చేతిలో ఎంత డబ్బుంది?: ఇల్లు కొనాలంటే.. ముందుగా కొనుగోలుదారు తన చేతి నుంచి కొంత మొత్తాన్ని చెల్లించాలి. దీన్ని డౌన్‌ పేమెంట్‌గా పిలుస్తారు. ఆస్తి విలువలో సాధారణంగా 10-20 శాతం వరకూ ఇది ఉంటుంది. ఇది చెల్లించాక మిగతా మొత్తాన్ని అర్హతను బట్టి బ్యాంకులు రుణం ఇస్తాయి. బ్యాంకులను బట్టి, డౌన్‌పేమెంట్‌ శాతం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.70 లక్షల ఇల్లు కొనాలి అనుకున్నారనుకుందాం. డౌన్‌ పేమెంట్‌ కనీసం 20శాతం అనుకుంటే.. మీరు రూ.14 లక్షలు సొంతంగా చెల్లించాలి. ఈ మొత్తం ఎంత ఎక్కువగా చెల్లిస్తే అంత మంచిది. దీనివల్ల రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.

వాయిదాలు చెల్లించగలరా? : ప్రస్తుతం గృహ రుణం వడ్డీ రేట్లు 8.5 నుంచి 9.35 శాతం వరకూ ఉన్నాయి. రూ.50 లక్షల రుణాన్ని 20 ఏళ్ల వ్యవధికి తీసుకుంటే.. రూ.45వేల వరకూ ఈఎంఐ ఉంటుంది. ఏదో ఒక నెల ఈ మొత్తాన్ని చెల్లించడం కాదు. దాదాపు 240 నెలలు, వడ్డీ రేట్లు పెరిగితే అంతకు మించి క్రమం తప్పక ఈఎంఐ చెల్లిస్తూ ఉండాలి. కాబట్టి, నెలవారీ ఆదాయం, ఖర్చులు ఎలా ఉన్నా వాయిదాల చెల్లింపు ఆగకుండా చూసుకోవాలి. మీ ఖర్చులు, జీవన ప్రమాణాలకు ఇబ్బంది లేకుండా వాయిదాలను చెల్లించగలను.. అని నమ్మినపుడే ముందడుగు వేయాలి. కనీసం 3-5 ఏళ్ల వరకూ ఆర్థిక విషయాల్లో కొంత రాజీ పడక తప్పదనే విషయాన్ని ఇక్కడ తప్పక గుర్తుంచుకోవాలి.

ఆదాయం పెరుగుతుందా? : రుణానికి వెళ్లబోయే ముందు గమనించాల్సిన మరో విషయం.. మీ ఆదాయం త్వరలోనే పెరుగుతుందా అనేది. ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే, వాయిదాలు చెల్లించేందుకు ఇబ్బంది ఉండదు. అదే సమయంలో మీ దగ్గర పెరిగిన మిగులు మొత్తంలో కొంత గృహరుణ అసలుకు జమ చేయండి. ఇలా క్రమం తప్పక చేయడం వల్ల వ్యవధి తగ్గడంతోపాటు, వడ్డీ భారమూ అధికంగా పడదు.

ఉమ్మడిగా తీసుకుంటారా?

జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా రుణం తీసుకున్నప్పుడు కొన్ని ప్రయోజనాలుంటాయి. రుణం అధికంగా వస్తుంది. అదే సమయంలో ఈఎంఐ భారం ఇద్దరూ పంచుకోవచ్చు. సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 24 నిబంధనల ప్రకారం ఇద్దరూ గృహరుణం అసలు, వడ్డీపై మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. మిగులు మొత్తం ఎక్కువగా ఉంటే అప్పుడప్పుడూ కొంత మొత్తం చెల్లిస్తూ తొందరగా రుణం తీర్చేయొచ్చు.

క్రెడిట్‌ స్కోరు బాగుందా?

కొత్తగా రుణం తీసుకోవాలనుకునే వారు ముందుగా తమ క్రెడిట్‌ స్కోరును సొంతంగా పరిశీలించుకోవాలి. 700 పాయింట్లకు మించి ఉన్నప్పుడు రుణదాతలు కొంత సానుకూలంగా ఉంటారు. తక్కువ క్రెడిట్‌ స్కోరుంటే రుణ దరఖాస్తును తిరస్కరించే అవకాశాలుంటాయి. అధిక స్కోరున్నప్పుడు వడ్డీ రేటులోనూ కొంత రాయితీ లభిస్తుంది. కాబట్టి, స్కోరును పరిశీలించి, ఏమైనా తేడాలుంటే సరిచేసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని