రుచుల వేడుక... బోనాల్‌!

బోనాల సందడి నడుస్తోంది...   అంటే ఇంట్లోనూ వంటల ఘుమఘుమల జోరు మొదలయినట్టే. ఈ రోజుల్లో చేసే స్పెషల్‌ వంటకాలని ఇలా ప్రయత్నించి చూడండి..

Updated : 17 Jul 2022 06:37 IST

బోనాల సందడి నడుస్తోంది...  

అంటే ఇంట్లోనూ వంటల ఘుమఘుమల జోరు

మొదలయినట్టే. ఈ రోజుల్లో చేసే

స్పెషల్‌ వంటకాలని ఇలా ప్రయత్నించి చూడండి..


నాటుకోడికూర

కావాల్సినవి: నాటుకోడి- కిలో, నూనె- మూడు చెంచాలు, కారం- చెంచా, పసుపు- అరచెంచా, కరివేపాకు- ఒక రెబ్బ, పచ్చిమిర్చి- ఆరు, ఉల్లిపాయలు- పావుకిలో. మసాలా పేస్ట్‌ కోసం: ధనియాలు- చెంచా, గసగసాలు- రెండు చెంచాలు, యాలకులు-5, కొబ్బరిపొడి- రెండు చెంచాలు, ఎండు మిరపకాయలు- ఐదు, కారం- చెంచా, పసుపు- తగినంత, దాల్చినచెక్కలు- రెండు, వెల్లుల్లి- 12రెబ్బలు, లవంగాలు- ఆరు, అల్లంముక్కలు- అంగుళం సైజువి ఆరు, ఉప్పు- తగినంత, కొత్తిమీర- కొద్దిగా

తయారీ: ధనియాలు, యాలకులు, లవంగాలు వేయించుకున్న గసగసాలు, కొబ్బరిపొడి, మిరపకాయలు, పసుపు, వెల్లుల్లి, అల్లం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కనపెట్టుకోవాలి. మరోపక్క కుక్కర్‌లో చికెన్‌కి తగినంత ఉప్పు, కారం, నూనె పట్టించి కొద్దిగా నీళ్లు పోసి ఐదు విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని గోధుమరంగులో వచ్చేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్‌కుక్కర్‌లో ఉడికించి పెట్టుకున్న చికెన్‌ వేసి ఆ తర్వాత సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేయాలి. నాలుగు నిమిషాల తర్వాత గరంమసాలా, ఉప్పు కూడా వేసి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి దింపేయండి.


బోటీమసాలాఫ్రై

కావాల్సినవి: బోటీ- కేజీ, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా, ఉల్లిపాయలు- పావుకిలో, పచ్చిమిర్చి- ఆరు, కారం- చెంచా, పసుపు- తగినంత, గరంమసాలాపొడి- చెంచా, మిరియాలపొడి- అరచెంచా, కరివేపాకు- రెమ్మ, పుదీనా, తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు, నూనె- నాలుగు చెంచాలు, షాజీరా- చిన్నచెంచా, ఉప్పు- తగినంత

తయారీ: ముందుగా బోటీని మంచి నీటిలో శుభ్రం చేసుకుని కుక్కర్‌లో లీటరున్నర నీళ్లు పోసుకుని నాలుగు విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వడకట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసుకుని అందులో షాజీరా, ఉల్లిపాయముక్కలు వేసుకుని అవి మంచి రంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకుని, ముందే ఉడకబెట్టి ఉంచిన బోటీ ముక్కలు వేయాలి. రెండు నిమిషాలు పెద్దమంటపైన వేయించుకోవాలి. అప్పుడు గరంమసాలా, ధనియాలపొడి, మిరియాలపొడి, కారం, ఉప్పు, కరివేపాకు వేసి ఐదు నిమిషాల పాటు సన్నమంటమీద ఉంచాలి. దించేటప్పుడు కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే సరిపోతుంది.


మటన్‌ మసాలా

కావాల్సినవి: మటన్‌- కేజీ, నూనె- నాలుగు చెంచాలు, ఉల్లిపాయ- ఒకటి (పెద్దది), పసుపు- పావుచెంచా, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాలు, కారం- రెండు చెంచాలు, ధనియాలపొడి- చెంచా, గరంమసాలాపొడి- చెంచా, పెరుగు- కప్పు, ఉప్పు- తగినంత, కొబ్బరిపొడి- నాలుగు చెంచాలు, గసగసాలు- రెండు చెంచాలు, నీళ్లు- రెండు కప్పులు, కొత్తిమీర- కొద్దిగా

తయారీ: గసగసాలు, కొబ్బరిపొడిని కొద్దిగా వేయించుకుని మిక్సీలో ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె వేడి చేసుకుని అందులో తరిగిన ఉల్లిపాయముక్కలు వేసుకుని బంగారు రంగులోకి వచ్చేంతవరకూ దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసిన మటన్‌ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాతే కారం, ధనియాలపొడి, ఉప్పు వేసుకోవాలి. మంటని సన్న సెగమీద ఉంచి పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరిపేస్ట్‌, పెరుగు, గరంమసాలా వేసుకోవాలి. బాగా కలిపి... మూడు నిమిషాలు ఉంచి తర్వాత  నీళ్లుపోసి కుక్కర్‌ మూతపెట్టేయాలి. మాంసం మెత్తబడే వరకూ ఉంచి దించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే సరిపోతుంది.


తలకాయ కూర

కావాల్సినవి: తలకాయ మాంసం- కేజీ, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా, కారం- రెండు చెంచాలు, ధనియాలపొడి- చెంచా, పసుపు, ఉప్పు- తగినంత, గరంమసాలాపొడి- చెంచా, పచ్చిమిర్చి- ఆరు, పుదీనా- మూడురెబ్బలు, కొత్తిమీర- కొద్దిగా, ఉల్లిపాయ- పావుకిలో, షాజీర- చెంచా, నూనె- నాలుగు చెంచాలు, టమాటాలు- 100గ్రా.

తయారీ: ముందుగా వేడినీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి తలకాయమాంసాన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక షాజీరా, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి నాలుగు నిమిషాల పాటు దోరగా వేయించాలి. అవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి మరో మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. అప్పుడు తలకాయ మాంసం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేసి బాగా కలిపి పదినిమిషాలుంచితే నీరంతా పోతుంది. ఆ తర్వాత కారం, ధనియాలపొడి, గరంమసాలాపొడి, జీలకర్రపొడి, పుదీనా వేసి ఐదునిమిషాల పాటు వేయించి తగినంత నీరుపోసి మీడియం మంటపైన నలభై నిమిషాలపాటు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుని దించుకోవడమే.


కార్జం ఫ్రై

కావాల్సినవి: కార్జంముక్కలు- కేజీ, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా, కారం- చెంచా, ధనియాలపొడి- చెంచాన్నర, పసుపు- అరచెంచా, మిరియాలపొడి- చెంచా, ఉప్పు- తగినంత, గరంమసాలా- చెంచా, నూనె- నాలుగు చెంచాలు, పుదీనాతరుగు- మూడుచెంచాలు, కొత్తిమీర తరుగు- చెంచా, మెంతి ఆకులు- రెండు చెంచాలు, ఉల్లిగడ్డలు- రెండు

తయారీ: కార్జాన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. వాటికి కారం, ధనియాలపొడి, గరంమసాలాపొడి, మిరియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు, పుదీనా ఆకులు వేసి ఓ అరగంటపాటు పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకుని అందులో ఉల్లిపాయముక్కలు, మెంతి ఆకులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మగ్గిన తర్వాత అందులో పచ్చిమిర్చి, మారినేట్‌ చేసి పెట్టుకున్న కార్జం వేసుకుని బాగా ఉడకనివ్వాలి. దగ్గరకు వచ్చాక దింపుకొని కొత్తిమీర చల్లుకోవడమే.  



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని